నవతెలంగాణ ఢిల్లీ: రెండురోజులుగా మీడియా అంతట వినిపిస్తోన్న పదంసంచార్ సాథీ. భారత్‌లో విక్రయించే ఫోన్లలో ఈ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశమే ఈ దుమారానికి కారణం. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాలపై నిఘా పెట్టడమే అవుతుందని సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరోసారి స్పష్టత ఇచ్చారు. అసలు స్నూపింగ్‌కు తావే లేదని, అది సాధ్యం కాదని బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. ఇది ప్రజల రక్షణ కోసమేనన్నారు. యాప్‌లో రిజిస్టర్ అవకుండా అది పనిచేయదని వివరించారు.
ఫోన్‌లో సంచార్‌సాథీ యాప్ ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉండాలి.. ఫోన్ వాడకాన్ని ప్రారంభించినప్పటి నుంచి, ఈ యాప్ పని చేయాలి.. ఫోన్ నుంచి ఈ యాప్‌ను తొలగించే వీలుండకూడదని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. దానిపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గింది.
‘‘మీరు ఆ యాప్ ను కొనసాగించాలని అనుకుంటే.. మీ ఫోన్‌లో ఉంచుకోవచ్చు. డిలీట్ చేయాలనుకుంటే చేసేయొచ్చు. మీరు ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఎన్నో యాప్‌లు ముందుగానే ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. అవి వద్దనుకుంటే తొలగించుకుంటాం కదా. ఇది యూజర్ల రక్షణకు సంబంధించిన అంశం. ఇందులో తప్పనిసరి ఏమీ లేదు. మీరు రిజిస్టర్ కాకపోతే.. అది అచేతనంగా ఉండిపోతుంది’’ అని ఇప్పటికే సింధియా వివరణ ఇచ్చారు.



