తమను గెలిపించాలంటూ పోస్టులు
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆశావాహులు,అభ్యర్థులు స్మార్ట్ ఫోన్లతో ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. గతంలో కరపత్రాలు, వాల్ పోస్టర్లు,వాల్ పెయింటింగ్ తో ప్రచారం నిర్వహించేవారు.ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను ఇస్తూ వాల్ పోస్టర్లను గోడలకు అతికించేవారు. కానీ ఇప్పుడు సర్పంచ్ తో పాటు వార్డు సభ్యుల పోటీదారులు సోషల్ మీడియానే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషనుకు ముందే కొంత మంది ఆశావహులు తాము ఈ సారి ఎన్నికల బరిలో ఉంటున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టారు.
ఇక నోటిఫికేషన్ రాగానే విస్తృతంగా ప్రచారాన్ని ప్రారంభించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ఫ్రాగామ్లో నిత్యం పోస్టులు పెడుతూ ప్రచారం ముమ్మురం చేస్తున్నారు.గ్రామానికి చెందిన ఓటర్ల ఫోన్ నంబర్లను తెలుసుకుని ప్రతిరోజూ ప్రచారం చేస్తూ తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్న పోటోలను పంపిస్తున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తారో ఆ విషయాన్ని కూడా పోస్టుల ద్వారా షేర్ చేస్తున్నారు. తమ కుల సంఘాల వారికి ఫోన్లు చేస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల పోటీదారులు తమను గెలిపించాలని కోరుతున్నారు.



