నవతెలంగాణ-హైదరాబాద్: భద్రాద్రి జిల్లా కొత్తగుడెం రైల్వే స్టేషన్ లో నాటు బాంబు పేలడం సృష్టించింది. రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా కొన్ని సంచులు పడి ఉండడాన్ని అక్కడే ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది గమనించారు. వాటిని వెంటనే పక్కనే ఉన్న చెత్తకుప్పలో పడవేశారు అక్కడే ఉన్న ఓ శునకం సంచిని కొరకడంతో పేలుడు సంభవించి అక్కడికక్కడే కుక్క మృతి చెందింది. పేలుళ్లకు పెద్దఎత్తున శబ్ధం రావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేశారు. మరో నాలుగు సంచులలో బాంబులు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఉదయం వెళ్లే రైలులో ఈ నాటు బాంబులను తరలించడానికి ప్రయత్నం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.


