Thursday, December 4, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅవి బెనిఫిట్స్‌ కావు… బకాయిలే!

అవి బెనిఫిట్స్‌ కావు… బకాయిలే!

- Advertisement -

ఒక ఉద్యోగి తన సర్వీసు కాలంతో నిమిత్తం లేకుండా 58 లేదా 60, 61 ఏండ్లకు ఉద్యోగ విరమణ చేస్తాడు. ఉద్యోగి ఏ వయసులో ఉద్యోగంలో చేరారనేది ప్రధానం కాదు, ప్రమాణమూ కాదు. నిర్ణీత వయసు అంటే ఉద్యోగి పుట్టిన సంవత్సరం నుండి సదరు ప్రభుత్వంలో అమల్లో ఉన్న వయసుకు పదవీ విరమణ జరుగుతుంది. అయితే పదవీ విరమణ సందర్భంలో సంబంధిత శాఖ లేదా ప్రభుత్వం అతనికి రావలసిన బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. స్వతంత్ర సంస్థలు సింగరేణి, విశ్వవిద్యాలయాల లాంటివి పదవీ విరమణ రోజునే ఉద్యోగికి చెల్లించవలసిన మొత్తాన్ని బ్యాంకులో జమచేస్తాయి. పదవీ విరమణ పొందిన ఉద్యోగి పెన్షన్‌ వెంటనే వచ్చినా రాకపోయినా పెన్షనర్‌ అని పిలువబడుతాడు.

పదవీ విరమణ చేసిన మరుసటి రోజు నుండి అతడు లేదా ఆమెకు కష్టాలు ప్రారంభమవుతాయి. రావలసిన డబ్బుల కోసం ఎదురుచూపులు మొదలవుతాయి. సర్వీస్‌లో ఉండగానే పెన్షన్‌ ప్రతిపాదనలు ఏజీ ఆఫీస్‌కు పంపిన అదృష్టవంతులు యాభై శాతం కూడా ఉండరు. తన కార్యాలయంలోనే అనేక కొర్రీలతో సెక్షన్ల మధ్య ఆ ఫైలు చక్కర్లు కొడుతూ ఉంటుంది. అది ఆ కార్యాలయం గడప దాటిన ఒక నెల పనిదినాల తర్వాత ఒక్కోసారి మరో పదిరోజుల్లో పెన్షన్‌ ఆర్డర్‌ ఇంటికి, కార్యాలయానికి, సంబంధిత ట్రెజరీకి వస్తుంది. ఏజీ ఆఫీసులో ఎటువంటి సిఫారసులు అవసరం లేకుండానే పని జరుగుతుంది. ట్రెజరీ ఆఫీసులో ‘కావలసిన కాగితాలు’ సమర్పించి నెలవారీ పెన్షన్‌ పొందడం వరకు ఒక దశ. అతడికి వచ్చే పెన్షన్‌ అంతకు ముందు తీసుకున్న జీతంలో దాదాపుగా సగం కన్నా తక్కువే ఉంటుంది. కానీ పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ బాగా వస్తుందనే అభిప్రాయం కొంతమందిలో ఉంది, ఇది సరికాదు.

పెన్షనరుకు సహజంగా జిపిఎఫ్‌, లీవ్‌ ఎన్‌కాష్మెంట్‌, అనారోగ్యానికి ఖర్చు చేసిన మెడికల్‌ బిల్లులు, జిఎల్‌ఐసి, గ్రాట్యూటీ, కమ్యూటేషన్‌ డబ్బులందాలి. జిపిఎఫ్‌ అంటే జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ – ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా కొంత సొమ్ము ప్రభుత్వం దగ్గర దాచుకుంటారు. దానికి నిర్ణీత వడ్డీ మొత్తాన్ని కలిపి పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం ఇవ్వాలి. అంతా కలిపి రూ.పది నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది. ఇది బెనిఫిట్‌ కాదు, ఉద్యోగి దాచుకున్న సొమ్ము. పదవీవిరమణ తర్వాత ప్రభుత్వం ఇవ్వవలసిన బకాయి. లీవ్‌ ఎన్‌కాష్మెంట్‌ ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్‌ మొత్తానికి గరిష్టంగా 300 లేదా అంతకన్నా తక్కువ లీవులు మిగిలి ఉంటే వాటిని ప్రభుత్వానికి అమ్ముకునే సౌకర్యం కల్పించారు. అంటే అది ఉద్యోగికి పది నెలల జీతం లేదా అంతకన్నా తక్కువ. మూడు దశాబ్దాల సర్వీసుకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం. ఇదొక సౌకర్యం మాత్రమే. బెనిఫిట్‌ కాదని అర్థం చేసుకోవాలి. అదే విధంగా గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సొమ్ము ప్రతి నెలా ఉద్యోగి నుండి అతడి బేసిక్‌ పే ఆధారంగా మినహాయించుకుని రిటైరయ్యే సమయానికి తిరిగి చెల్లించేది.

ఇది ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా చనిపోతే తప్ప పెద్దగా ప్రయోజనం లేని పథకం. పదవీ విరమణ నాటికి ఈ సొమ్ము రూ.ఐదు లక్షల నుండి పది లక్షలలోపు గానే ఉంటుంది. కానీ దీన్ని చెల్లించటానికి కూడా ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఇక ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నంత కాలంలో తనకు లేదా తన కుటుంబానికి అనారోగ్యానికై ఖర్చు చేసిన బిల్లులు ప్రభుత్వం విడుదల చేయాలి, కానీ దానికి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి! ఇలా వేలాది బిల్లులు ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్‌ ఖర్చనేది అన్ని యాజమాన్యాలలో ఉన్న సౌకర్యమే. కొన్ని కంపెనీలు మెటర్నిటీ, డెలివరీ, ఆపరేషన్‌ ఖర్చులు కూడా భరిస్తాయి. ప్రభుత్వంలో కూడా ఆ సౌకర్యం అమలులో ఉండడం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సాధించుకున్న హక్కు. అది బెనిఫిట్‌ ఏమాత్రం కాదు. కేవలం సౌకర్యం మాత్రమే. అది కూడా ఉద్యోగులు ఖర్చు చేసిన మొత్తంలో ఇరవై ఐదు శాతం మినహాయించుకుని ప్రభుత్వం మిగిలిన సొమ్మును విడుదల చేస్తుంది. ఆర్థికశాఖ ఆ రకమైన బిల్లులు గత మూడేండ్లుగా చెల్లించాల్సి ఉంది.

ఇక గ్రాట్యూటీ – ఇది ముప్ఫయి సంవత్సరాలు అంతకు ఎక్కువ లేదా తక్కువ కావచ్చు ఒక ఉద్యోగి ప్రభుత్వానికి ఎంతో విశ్వాసపాత్రుడై సేవలందించినం దుకుగాను కృతజ్ఞతగా చెల్లించే సొమ్ము. ఇది ఏ స్థాయి వారికైనా ఒకే మొత్తంగా ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రతి పీఆర్‌సీలో ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. గత పీఆర్‌సీ ప్రకారం ఇది ప్రస్తుతం రూ.పదహారు లక్షలుగా ఉంది. దీన్ని మరలా ఉద్యోగి నుండి రికవరీ చేయరు. కొన్ని ప్రయివేటు సంస్థలు కూడా తమ వద్ద పనిచేసి రిటైర్‌ అయిన ఉద్యోగులకు ప్రతిఫలంగా కొంత మొత్తం డబ్బు ముట్టజెప్పి ఇంటికి పంపడం మామూలే. ఇది ఇవ్వడానికి ప్రభుత్వం పెన్షనర్లను ఏండ్ల కొద్ది వేచి ఉంచుతున్నది.

చివరగా కమ్యూటేషన్‌ సొమ్ము – పెన్షనర్‌ కు ఇచ్చే డబ్బు ప్రభుత్వం నలభై శాతం ముందే ఇచ్చేసి 180 నెలలపాటు అతడి పెన్షన్‌ నుండి రికవరీ చేసుకునేది. ఇది ఆఖరున పెన్షనర్‌కు ఇచ్చే డబ్బు కన్నా ఎక్కువే అవుతుంది. అంటే పెన్షనర్‌కి ఇచ్చిన డబ్బును వడ్డీతో సహా ముక్కుపిండి మరీ ప్రభుత్వం వసూలు చేసుకుంటుందన్న మాట. ఇది రూ.25 లక్షల నుండి 40 లక్షల వరకు ఉద్యోగిస్థాయిని బట్టి ఉంటుంది. ఈ డబ్బు కూడా ఉదారంగా ఇచ్చేది కాదు. మరి ప్రయోజనం ఎలా అవుతుంది? భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ కాల పరిమితిని 180 నుండి 140 నెలలు చేసినా మన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఉత్తర్వులు ఇంతవరకు జారీ చేయకపోవడం గమనార్హం.

ఇన్ని రకాలుగా పెన్షనర్లకు చెల్లించవలసిన సొమ్ముపై ప్రభుత్వం చాలా దుష్ప్రచారం చేస్తున్నది. వీళ్లకు ఇచ్చే డబ్బు కోసం పేద ప్రజలకిచ్చే ఏ పథకాన్ని నిలిపివేయాలంటూ ప్రజలను, ఉద్యోగ సంఘాలను ప్రశ్నిస్తున్నది. అంటే ఉద్యోగులు రిటైర్‌ అయిన తర్వాత వారి మీద ప్రజలను ఉసిగొల్పుతున్నది. వారిని ప్రజలకు దూరం చేస్తున్నది. ఇది ప్రభుత్వానికి ఏమాత్రం సమంజసం కాదు. పైన పేర్కొన్న వాటిలో ఏది కూడా ఉదారంగానో లేక ఉచితంగానో ఇస్తున్నది లేదు. జిపిఎఫ్‌, లీవ్‌ ఎన్కాష్మెంట్‌, జిఎల్‌ఐసి డబ్బులు కేవలం ఉద్యోగులు తమ పదవీ కాలంలో దాచుకున్నవి మాత్రమే. మెడికల్‌ బిల్లులు తమ సేవా కాలంలో అనారోగ్యానికై చేసిన ఖర్చు. ఇది ఉద్యోగుల హక్కు. ఏ ప్రయివేటు యాజమాన్యమైనా చెల్లిస్తుంది. గ్రాట్యూటీ డబ్బు ప్రభుత్వం ఉద్యోగి సేవలకు గుర్తింపుగా, గౌరవంగా, కృతజ్ఞతా పూర్వకంగా చెల్లించేది. ఇది కూడా ఉద్యోగుల హక్కు అని గుర్తించాలి. కమ్యూటేషన్‌ డబ్బు ముందే ఇచ్చి తరువాత నెల నుండి వడ్డీతో సహా వసూలు చేసుకునేది. వీటిలో ఏది కూడా అన్యాయంగా లేదా అప్పనంగా చెల్లిస్తున్న డబ్బు కాదు.

పదవీ విరమణ చెందిన వారి విషయంలో అందరూ ఉపయోగించే పదం రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌. ‘బెనిఫిట్స్‌’ అంటే ప్రయోజనాలు లేదా ‘లాభాలు’. రిటైర్‌ అయిన వ్యక్తికి లాభాలు లేదా ప్రయోజనాలు ఉంటాయా లేక నష్టం ఉంటుందా? మనం చెప్పుకున్నవేవీ ప్రయోజనాలు కాదు. అవి ఉద్యోగి సేవింగ్స్‌ కొన్ని, ఖర్చులు కొన్ని కాగా మరికొన్ని హక్కులు. వీటిని బెనిఫిట్స్‌ లేదా ప్రయోజనాలు అనే తప్పుడు అర్థంతో వాడటం పరిపాటైంది. వీటిని పదవీ విరమణ ‘బకాయిలు’ అని పేర్కొనడమే సముచితంగా ఉంటుంది. ఉద్యోగులు, పెన్షనర్లు, సంఘాల వారు కూడా ఈ విషయమై తగు జాగ్రత్త వహించాలి. ప్రభుత్వం ప్రతి పెన్షనర్‌కు కొన్ని లక్షల రూపాయలు బాకీ పడిందనేది ప్రజలకు వివరించాలి.

లేదంటే పెన్షనర్లు ప్రభుత్వం నుండి ఇంకా ఏవేవో ప్రయోజనాలు పొందుతున్నారని ప్రజలు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. రావలసిన డిఏలు, పీఆర్‌సీలు పెన్షనర్లకు ఎలా అమలు కాకుండా చేయాలా అని కేంద్ర మంత్రి నిర్మలమ్మ ఆలోచిస్తుంటే, ఇవ్వవలసిన వాటిని కూడా ఇవ్వకుండా వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను, పెన్షనర్లను వేధిస్తున్నది. చేయవలసిన న్యాయాన్ని సకాలంలో అందివ్వకుండా మరింత దూరం చేస్తున్నది. మనోవేధనతో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. ఇది న్యాయాన్ని తస్కరించినట్లే లేదా తిరస్కరించినట్లే. పెన్షనర్ల పట్ల ప్రభుత్వాలకు చులకన భావం పనికిరాదు. వారు నిన్నటి వరకు ప్రభుత్వ సేవలోనే ఉన్నారనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గమనంలోకి తీసుకుని వారికి రావాల్సిన బకాయిలను చెల్లించి భరోసాగా నిలవాలి.ఇది ప్రభుత్వం దయాదాక్షిణ్యం ఇచ్చేది కాదు, బాధ్యత.

శ్రీశ్రీ కుమార్‌
9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -