పల్లెసీమల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు జాతిపిత మహాత్మా గాంధీ. గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యమని నొక్కిచెప్పారు. ఇప్పుడు మన రాష్ట్రంలో అలాంటి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రిజర్వేషన్లు, వాటిపై కోర్టుల్లో దావాలు, నోటిఫికేషన్లు, నామినేషన్ల ఘట్టాలు ఒకదాని తర్వాత ఒకటి కొనసాగాయి. మరో పదిహేను ఇరవై రోజుల్లో కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లు బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది.. సిద్ధాంతాలు, విధానాల ప్రాతిపదికన కాకుండా మొత్తం మనీ పాలిటిక్స్, పవర్ పాలి’ట్రిక్స్’ రాజ్యమేలుతున్న తరుణంలో నిజంగా గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నదెవరు? ఆ లక్ష్యం ఆచరణలో అమలవుతోందా? అనేది కీలకం.
పంచాయతీలకు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం కావటం మంచిదే. కానీ ఆ క్రమంలో కొనసాగుతున్న తంతులే విచిత్రంగా ఉంటున్నాయి. ఏకగ్రీవం అయిన పంచాయతీల్లో సర్పంచులు రూ.50 లక్షల నుంచి రూ.కోట్ల వరకూ బాండ్ పేపర్ మీద రాసిస్తుండటం గమనార్హం. ‘ధనం మూలం ఇదం జగత్…’ అన్నట్టు ప్రజాసేవ కంటే ‘పైసల’తోవే ఎక్కువవుతోంది. కొన్నిచోట్ల ‘మేం గతంలో ఓడిపోయాం, ఈసారి కచ్చితంగా గెలిపించండి…’ అంటూ అభ్యర్థులు కంటతడిపెట్టిన సన్నివేశాలూ రక్తికట్టాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వాల విధానాలు, అధికారుల నిర్లక్ష్యానికి విసిగి వేసారిన ప్రజలు అసలు నామినేషన్లే దాఖలు చేయకపోవటం పాలకుల పాలసీల పెరాలసిస్‌కు పరాకాష్ట. మంచిర్యాల జిల్లాలో మూడు, ఆసిఫాబాద్, నిర్మల్‌లో ఒక్కోటి చొప్పున గ్రామాల్లో నామినేషన్లను దాఖలు చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 133 వార్డుల్లో ఒక్క నామినేషనూ పడలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసు కోవచ్చు. మరీ విచిత్రమేమంటే…మొన్నటిదాకా ప్రభుత్వం వైపు నుంచి బిల్లులు రాలేదని మాజీ సర్పంచులు ఆందోళనలు చేపట్టినా.. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు ముందుకు రావటం.
ఈ నేపథ్యంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు గ్రామాల అభివృద్ధి అనుకున్నంత స్థాయిలో జరిగిందా? నిజంగా స్థానిక సంస్థానాధీశులు ప్రజల బాగోగులు పట్టించుకుంటున్నారా? అనే సంశయం కూడా కలగక మానటం లేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా పని చేయనిస్తున్నాయా? అనేది కూడా కీలకాంశం. వామపక్షాల ఏలుబడిలో ఉన్న కేరళలో అక్కడి ప్రభుత్వం… స్థానిక సంస్థలను అదే రకంగా పనిచేయిస్తోంది. ప్రజాభిప్రాయం ప్రకారమే పంచాయతీలు, పురపాలక, నగర పాలక సంస్థల్లో పాలన సాగుతోంది. దీంతో అక్కడ అనేక ఫలితాలు వస్తున్నాయి. అదే రకమైన చర్యలను తెలంగాణలోనూ చేపట్టాలి. స్థానిక సంస్థలు ఎంతబలంగా ఉంటే అంతగా రాష్ట్రాభివృద్ధి సాధ్యమనే వాస్తవాన్ని గుర్తించాలి. కానీ అందుకు భిన్నంగా మన దగ్గర పరిస్థితి కొనసాగుతోంది. నిర్మొహమాటంగా చెప్పాలంటే ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి హామీ పథకానికి తప్ప మిగతా ఏ ఒక్కదానికీ నిధులు విడుదల కావటం లేదు. పంచాయతీల్లోని కారోబార్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సఫాయి కార్మికులకు జీతాలివ్వలేని దుస్థితిలో అవి కొట్టుమిట్టాడుతున్నాయి.
గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదనే సాకుతో తెలంగాణకు రావాల్సిన రూ.3,500 కోట్లను కేంద్రం విడుదల చేయకుండా తొక్కిపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (మార్చితో ముగియనుంది) చివరి నాటికి వాటిని విడుదల చేయించుకోవాలి. లేదంటే అవి మురిగిపోతాయి.. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి.అందువల్ల పంచాయతీ పోరు ముగిసిన వెంటనే సీఎం మళ్లీ ఢిల్లీ విమానమెక్కటం, నిధులు విడుదల చేయండి మహాప్రభో అంటూ కేంద్ర పెద్దలకు వినతిపత్రమివ్వటం ఖాయం. ఇక సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ రూ.400 కోట్ల కోసం వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిణామాల దృష్ట్యా రాజ్యాంగంలోని 73, 74 సవరణల ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే సమున్నత లక్ష్యం నీరుగారిపోతోంది.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది మరింత నిర్వీర్యమైంది. జీఎస్టీని తీసుకొచ్చి రాష్ట్రాలనే అడుక్కునే స్థితికి దిగజార్చిన కేంద్రం.. ఇప్పుడు స్థానిక సంస్థల అధికారాలపై కన్నేసింది. క్రమక్రమంగా వాటికి కత్తెరేసే పనులకు శ్రీకారం చుట్టింది. అందువల్ల పంచాయతీ ఎన్నికలను నిర్ణీత సమయంలో సమర్థవంతంగా నిర్వహించటంతోపాటు ఆ తర్వాత కూడా వాటి స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. తెలంగాణ జనాభాలో ఇప్పటికీ అరవై శాతం మందికిపైగా ఆధారపడిన వ్యవసాయ రంగం గ్రామసీమలను పచ్చగా కళకళలాడేలా ఉంచుతోంది. అతి కీలకమైన ఈ విషయాన్ని గుర్తించి, పంచాయతీల పాలకమండళ్లకు ఇవ్వాల్సిన గౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలనే సూత్రాన్ని కాపాడటానికి కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవ్వాలి.
పంచాయతీ పదనిసలు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



