స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పంపిణీ
పైలట్ ప్రాజెక్టు కింద 5 గ్రామాల ఎంపిక
జనవరి నాటికి అన్ని ఆప్షన్లతో భూ భారతి కొత్త యాప్
భూసమస్యలపై ట్రిబ్యునల్ ఏర్పాటు
సింగిల్ పేజీ డిజిటలైజేషన్‌లో భూరికార్డు, సర్వే, రిజిస్ట్రేషన్
నాటి మున్సిపల్ మంత్రి ముడుపులు తీసుకుని ల్యాండ్ కన్వర్షన్ : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతులకు భూధార్ కార్డులను పంపిణీ చేస్తామని రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. తొలుత నక్షా లేని ఐదు గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని అన్నారు. ఆ గ్రామాల్లోని రైతులకు భూధార్ కార్డులతోపాటు సరిహద్దులు, కొత్త సర్వేనెంబర్లను కేటాయిస్తామని వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేండ్లలో రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజల సౌలభ్యం కోసం విప్లవాత్మక మార్పులను తెచ్చామని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను రెండేండ్లలో పునర్నిర్మించామని అన్నారు. భూహక్కుల నుంచి రిజిస్ట్రేషన్ల వరకు సమూల సంస్కరణలను అమలు చేశామని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకల్లా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల సమాచారంతో కూడిన సింగిల్ పేజీ డిజిటలైజేషన్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
విదేశీ సంస్థ రూపొందించిన ధరణి పోర్టల్ యాప్‌ను బంగాళాఖాతంలో వేశామని స్పష్టం చేశారు. దాని స్థానంలో జనవరి నాటికి భూభారతి కొత్త యాప్‌ను తెస్తామనీ, ఇందుకు సంబంధించి ఎన్‌ఐసీ కసరత్తు చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో 413 గ్రామాల్లోని భూములకు నక్షాలు లేవని అన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఐదు గ్రామాలను ఎంపిక చేశామనీ, నక్షాలతోపాటు భూమికి సరిహద్దులు, సర్వేనెంబర్లను కేటాయిస్తామని వివరించారు. ఆయా గ్రామాల్లోని రైతులకు భూధార్ కార్డులను సిద్ధం చేశామనీ, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంపిణీ చేస్తారని చెప్పారు. పట్టణాల్లో ఉన్న వాటిని తీసేస్తే మిగిలిన 373 గ్రామాల్లో రెండో విడతలో భూధార్ కార్డుల పంపిణీ చేపడతామని అన్నారు. మూడో విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల చొప్పున వివాదం లేకుండా అభద్రత లేకుండా భూభారతి చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఆ తర్వాత అన్ని గ్రామాల్లోని రైతులకు భూధార్ కార్డులిస్తామని చెప్పారు. ఆలస్యమైనా పారదర్శకంగా ఈ ప్రక్రియను చేపడతామని అన్నారు.
డిసెంబర్ నాటికి లైసెన్స్‌డ్ సర్వేయర్లు
రాష్ట్రంలో 10,543 రెవెన్యూ గ్రామాలున్నాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ఆరు వేల మంది వీఆర్వోలను నియమించామని అన్నారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం 10,400 మంది దరఖాస్తు చేశారని వివరించారు. మొదటి విడతలో 3,490 మంది అర్హత సాధించారని అన్నారు. ప్రతి మండలానికి నలుగురు లేదా ఆరు మంతి సర్వేయర్లున్నారని చెప్పారు. మరో 2,500 మంది సర్వేయర్లను డిసెంబర్ చివరినాటికి నియమిస్తామని వివరించారు. భూసర్వేకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. అందుకోసం 400 రోవర్లను కొనుగోలు చేశామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయలేదని అన్నారు. రాష్ట్రంలోని 2.29 కోట్ల సర్వే నెంబర్లకు భూధార్ నెంబర్లను కేటాయించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
జనవరి నాటికి భూసమస్యలు పరిష్కరిస్తాం
రాష్ట్రంలో ఇంతవరకు భూ సమస్యలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వాటిని జనవరి నెలాఖరుకల్లా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. సమస్యలున్న వాటి కోసం ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలను వెలికితీసేందుకు ఇంతవరకు రెండు జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతోందనీ, వాటి ఫలితాలను గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 2.45 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా తొమ్మిది లక్షల దరఖాస్తులొచ్చా యని అన్నారు. అందులో న్యాయపరమైన చిక్కులున్న వాటిని గుర్తించి సరైన సమాధానంతో తిరస్కరించామని చెప్పారు. 6.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. సాదాబైనామాకు 9.25 దరఖాస్తులొచ్చాయని వివరించారు. ఇబ్బందుల్లేని దరఖాస్తులను పరిష్కరిస్తామని చెప్పారు. అవసరమైతే జీవోను సవరిస్తామని అన్నారు. 58, 59 జీవోలకు సంబంధించిన దరఖాస్తుల్లో పారదర్శకంగా ఉన్న వాటిని పరిష్కరిస్తామని వివరించారు.
111 జీవో పరిధిలోని భూములకు సంబంధించి చట్టప్రకారమే నడుచుకుంటా మని అన్నారు. 1/70 చట్టానికి సంబంధించి కమిటీ వేస్తామని చెప్పారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి రాకుండా స్లాట్ బుకింగ్ విధానాన్ని తెచ్చామని వివరించారు. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడు దశల్లో ఈ స్లాట్ బుకింగ్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. కార్పొరేట్ స్ధాయిలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశల వారీగా నిర్మిస్తున్నామని అన్నారు. హిల్ట్ పాలసీపై బీఆర్‌ఎస్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రి ముడుపులు ఇచ్చిన వారికే ల్యాండ్ కన్వర్షన్ చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో అందరికీ ల్యాండ్ కన్వర్షన్ చేసుకునేందుకు అవకాశం కల్పించామనీ, అవినీతి తావెక్కడ ఉందని ప్రశ్నించారు. నాడు చేసిన ల్యాండ్ కన్వర్షన్ వివరాలను బయటపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు భూధార్ కార్డులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



