– రూ. 10వేల కోట్ల సర్వీస్ చార్జీలు చెల్లించకుండా నిర్లక్ష్యం
– ఆర్థికంగా చితికిపోతున్న బోర్డులు
– గాడితప్పుతున్న పౌరసేవలు
– సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కే రూ. 1,145.17 కోట్ల బకాయి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వికసిత్ భారత్ అంటున్న కేంద్ర ప్రభుత్వం…దేశంలోని పలు కంటోన్మెంట్లను పట్టించుకోవడం లేదు. దేశభక్తి గురించి ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ సర్కారు …దేశభక్తికి అలవాలంగా ఉన్న ఆర్మీ కంటోన్మెంట్లపై శీతకన్ను వేసింది. దేశ వ్యాప్తంగా 62 కంటోన్మెంట్లు ఉండగా, వాటికి దాదాపు రూ.10వేల కోట్లను కేంద్రం బకాయి పెట్టింది. రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు అత్యధికంగా రూ. 1145 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డుల్లో జరగాల్సిన అభివృద్ధి, వాటిని నిర్వహణ కుంటుపడుతోంది. బోర్డులు ఆర్థికంగా చితికిపోతున్నాయి. రోజువారీ నిర్వహణకే నిధుల్లేక ఇబ్బంది పడుతున్నాయి. సిబ్బంది జీతభత్యాలకే పరిమితమై ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్లలో పౌరసేవలు అందిస్తున్నాయి. అందుకుగాను కేంద్ర ప్రభుత్వం వాటికి సర్వీస్ చార్జీల పేరిట ప్రతియేటా నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ కొన్నేండ్లుగా ఆ నిధులను విడుదల చేయడంలో మోడీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. దీని కారణంగా కంటోన్మెంట్లలో జరగాల్సిన అభివృద్ధి జరగడం లేదు. సర్వీస్ చార్జీలు రాకపోవడంతో కంటోన్మెంట్ సేవలు గాడి తప్పుతున్నాయి. స్థానిక ప్రజలకు డ్రయినేజీ, వీధి లైట్లు, శానిటేషన్, నీటి సరఫరా, గార్బేజ్ కనెక్షన్ వంటి సేవలు అందించడం కంటోన్మెంట్ బోర్డుల బాధ్యత. అయితే ఈ సేవలకు బదులుగా కేంద్ర రక్షణ శాఖ నుంచి రావాల్సిన నిధులు కొన్నేండ్లుగా ఆలస్యమవుతుండడంతో బోర్డులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఏండ్లుగా బకాయిలే…..జీతాలకు టెన్షన్
దేశ వ్యాప్తంగా 62 కంటోన్మెంట్లకు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ రక్షణ శాఖ చెల్లింపులు ఆలస్యం కావడంతో వినియోగ బిల్లులు, శానిటేషన్ కాంట్రాక్టులు, లైటింగ్ మెయింటెనెన్స్ వంటి కీలక సేవలు బోర్డులకు భారంగా మారాయి. కంటోన్మెంట్లలో పని చేయడమే తాము చేసిన నేరమా? అంటూ అధికారులు ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ చార్జీలు సకాలంలో విడుదల కాకపోవడంతో కొన్ని కంటోన్మెంట్లలో సిబ్బంది జీతాలకే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కొన్ని బోర్డులు బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్‌పై నడవాల్సిన పరిస్థితి తలెత్తింది. నిధులు రాకపోవడం వల్ల పాలన ఎలా చేయాలో బోర్డులకు అర్థం కావడం లేదు. వేతనాలు నెలనెల చెల్లించకపోవడంతో రోడ్డుల మరమ్మతులు, డ్రయినేజీ డిసిల్టింగ్, చెత్త నిర్వహణ వంటి పనులు ఆలస్యమవు తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. కంటోన్మెంట్ బోర్డులు అనేకసార్లు డిమాండ్లు చేసినా, కేంద్రం నుంచి స్పందన రాలేదు. కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్లకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే ఇలాటి సమస్య ఉత్పన్నమవుతోంది. కనీసం పెండింగ్ చార్జీలు విడుదల చేసినా బోర్డులు ఊపిరి పీల్చుకుంటాయి. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని పెండింగ్ సర్వీస్ చార్జీలు విడుదల చేయకపోతే, కంటోన్మెంట్లలో పరిపాలన పూర్తిగా గాడి తప్పే అవకాశముందని బోర్డులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తక్షణమే పెండింగ్ సర్వీస్ చార్జీలు విడుదల చేయాలి
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్ బోర్డులకు చెల్లించాల్సిన పెండింగ్ సర్వీస్ చార్జీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ప్రత్యేకంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు రావాల్సిన రూ. 1,145 కోట్ల బకాయిలను వెంటనే మంజూరు చేయించేందుకు తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు తక్షణ చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
-ఎం. శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్,అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం
వివిధ కంటోన్మెంట్ బోర్డులకు కేంద్రం చెల్లించాల్సిన పెండింగ్ సర్వీస్ చార్జీలు (కోట్లలో)
సికింద్రాబాద్ – 1145.17
కాన్పూర్ – 1188.92
అంబాల (హర్యానా) – 878.85
డెహ్రాడూన్ – 499.52
బెరెల్లి (యూపీ) – 374.69
వారణాసి (యూపీ) – 281.05
బర్రాక్‌పోరే (పశ్చిమబెంగాల్) – 180.88
రూర్‌కేలా – 130.49
రామ్‌గర్ (ఝర్ఖండ్) – 120.23
మిధుర (యూపీ) – 113.68
షిల్లాంగ్ (మేఘాలయ) – 96.35
కసౌలి (హెచ్‌పీ) – 89.05
బదామిబాగ్ (జమ్మ్మూ,కశ్మీర్) – 59.44
దన్‌పూర్ (బీహార్) – 58.00
అయోధ్య (యూపీ) – 49.23
కంటోన్మెంట్లపై కేంద్రం శీతకన్ను
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



