Thursday, December 4, 2025
E-PAPER
Homeజాతీయంతెలంగాణ మోడల్‌కు సహకరించండి

తెలంగాణ మోడల్‌కు సహకరించండి

- Advertisement -

ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌రెడ్డి వినతి
ఆర్‌ఆర్‌ఆర్‌, బుల్లెట్‌ రైలు, మెట్రో విస్తరణ అంశాలపై విజ్ఞప్తులు


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ మోడల్‌కు సహకరించాలని ప్రధాని మోడీని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో దాదాపు 30 నిమిషాలకుపైగా సాగిన ఈ భేటీలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌), రింగ్‌ రోడ్‌కు సమాంతరం రైల్వే లైన్‌ పనులు, మెట్రో దశ రెండో ఫేజ్‌కు అనుమతి, మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌, హైదరాబాద్‌-బెంగళూరు-చెన్నై బుల్లెట్‌ రైలు, ఇతర పెండింగ్‌ ప్రాజెక్ట్‌లతో కూడిన విజ్ఞప్తుల పత్రాలను సీఎం ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసిందని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగా నికి క్యాబినెట్‌ ఆమోదంతో పాటు ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని, రీజనల్‌ రింగ్‌ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి మీదుగా బందర్‌ పోర్ట్‌ వరకు 12 లేన్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు హై స్పీడ్‌ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్‌ రిజర్వ్‌ మీదుగా… మన్ననూర్‌ నుంచి శ్రీశైలం వరకు ఫోర్‌ లేన్‌ ఎలివేటేడ్‌ కారిడార్‌ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని ముఖ్యమంత్రి కోరారు.

గుజరాత్‌కు మన్మోహన్‌ లా… తెలంగాణకు మీరు సహకరించండి
గుజరాత్‌ మోడల్‌కు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహకరించిన విధంగానే… ప్రస్తుతం దేశ ప్రధానిగా తెలంగాణ మోడల్‌ సహకరించాలని ప్రధాని మోడీని కోరినట్టు సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ‘యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ముందుకు గుజరాత్‌ మోడల్‌ తీసుకువచ్చిన విషయం గుర్తు చేశా. ఆ రోజు ఆయన పెద్ద మనసుతో స్పందించి సహకరించారు. ఆ సహకారంతోనే గుజరాత్‌ను మోడల్‌గా అభివృద్ధి చేయగలి గారు. అలాగే సీఎంగా తెలంగాణ మోడల్‌కు సహకరించాలని కోరుతున్నా’ అని ప్రధాని మోడీని కోరినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధాని సైతం తెలంగాణ అభివృద్ధి నమూనాకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాకు చెప్పారు.

నా వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్దాంతం: సీఎం
డీసీసీల మీటింగ్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తోందని సీఎం ఎ. రేవంత్‌ రెడ్డి అన్నారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడినవి ఎడిట్‌ చేసి ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. బుధవారం పార్లమెంట్‌లో ప్రధాని, రాహుల్‌, కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హిందూ సమాజం లాంటిదే కాంగ్రెస్‌ అని డీసీసీ అధ్యక్షులకు చెప్పానని వివరించారు. పార్టీ నేతగా ఎలా పనిచేయాలనేది వివరించే క్రమంలో ఉదహరించానన్నారు.

‘డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీలో భిన్న రకాల మనస్తత్వాలపై చెప్పే ప్రయత్నం చేశా. అధ్యక్షులు వయసులో చిన్నవారైనా… పెద్ద బాధ్యతలో ఉన్నారని గుర్తు చేశా. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్‌ కోల్పోవడంతో బీజేపీ దీన్ని వివాదం చేస్తోంది. వాళ్ల రాద్దాంతంతో ఒరిగేదేవిూ లేదు. ఉత్తర భారతాన నన్ను పాపులర్‌ చేస్తున్నందుకు సంతోషిస్తున్నా’ అని అన్నారు. మరోవైపు కర్నాటకలో 2.5 ( చెరో రెండున్నరేండ్ల సీఎం) అంశం తెరపైకి వచ్చిందని… తెలంగాణలో ఎలా ఉండబోతోందని జాతీయ మీడియా ప్రశ్నించింది. ఇందుకు సీఎం బదులిస్తూ… రెండు టర్మ్‌లు (పదేండ్లు) సీఎంగా తానే ఉంటానని, కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -