టెంపుల్ మ్యూజియం అభివృద్ధికి కేటాయించిన యోగి సర్కార్
అన్ని హంగులతో అతి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం
లక్నో : అయోధ్యలో దేవాలయ మ్యూజియం అభివృద్ధి కోసం టాటా సన్స్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 52.102 ఎకరాల భూమిని కేటాయించింది. గత సంవత్సరం మార్చి 15వ తేదీన టాటా సన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం పాతిక ఎకరాలు ఇచ్చిందని, అయితే మరింత భూమి కావాలని ఆ కంపెనీ కోరిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా విలేకరులకు చెప్పారు. ‘మే 20న జరిగిన సమావేశంలో వారు మరింత భూమి కేటాయింపు కోసం డిమాండ్ చేశారు. అన్ని హంగులతో అతి పెద్ద ప్రాజెక్టును నిర్మిస్తామని వారు చెప్పారు. దీంతో అంతర్జాతీయ ప్రమాణాలతో దేవాలయ మ్యూజియం నిర్మాణం, నిర్వహణ నిమిత్తం 52.102 ఎకరాలు కేటాయిస్తూ తాజా లీజు ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని ఆయన వివరించారు.
పురా తన భారతీయ దేవాలయాలలోని వివిధ రకాల నిర్మాణ శైలులను మ్యూజియంలో ప్రదర్శిస్తామని ఖన్నా తెలిపారు. ఇది భారతీయ దేవాలయాలపై పరిశోధనలు చేస్తున్న ప్రపంచ దేశాల వారిని ఆకర్షిస్తుందని చెప్పారు. కాగా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని, నిర్వహణను పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మందిరం యొక్క మూడో అంతస్తులో మ్యూజియంను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మ్యూజియంను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రధాని మోడీదని, ఆయన గత నెలలో అయోధ్యలో పర్యటించినప్పుడు ఈ ప్రాజెక్టును సమీక్షించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.



