ప్రణాళికలు సరే.. ఆర్థిక వనరులేవి..?
ఈ రెంటినీ సమతూకం చేయాల్సిందే
గతానుభవాలు కీలకం
వాటిని పరిగణనలోకి తీసుకోవాలంటున్న మేధావులు
ప్రజలు కేంద్రంగా ‘విజన్’ ఉండాలని సూచిస్తున్న సామాజికవేత్తలు
బి.వి.యన్.పద్మరాజు
నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్‌లైన్లతో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ఆ తర్వాత నూతన రాష్ట్రం ఏర్పడింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పురుడు పోసుకున్న తెలంగాణలో ప్రజల సామాజిక, ఆర్థిక జీవన స్థితిగతులు కొంత మారినప్పటికీ వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, ఉపాధి, ఉద్యోగాలు తదితర రంగాల్లో చెప్పు కోదగిన మార్పు రాలేదనే చెప్పాలి. అందువల్ల రాష్ట్రాభివృద్ధికి కీలకమైన రైతులు, యువత, మహిళాభ్యుదయమే లక్ష్యంగా తాము ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్-2047’ డాక్యుమెంట్‌ను రూపొందించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ‘విజన్ 2020’, ఆయన జమానాలోనే ‘స్వర్ణాంధ్ర’ నినాదం, తెలంగాణ వచ్చాక ‘బంగారు తెలంగాణ’ స్లోగన్… ఈ కోవలోనే ఇప్పుడు ‘రైజింగ్ తెలంగాణ విజన్-2047′ డాక్యుమెంట్ రాబోతోందా? అనే అనుమానాలూ కొందరిలో లేకపోలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా పలు ప్రభుత్వాలు రూపొందించిన ప్రణాళికలు, వాటి అమలు తీరును పరిశీలిస్తే…’ఎక్కడ వేసిన గొంగళి అక్కడే…’ అనే విధంగా పరిస్థితి తయారైంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న ‘విజన్ డాక్యుమెంట్-2047’పై సానుకూల, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంట్‌లో ప్రభుత్వం పేర్కొన్న లక్ష్యాలు, ప్రణాళికలు ఆచరణాత్మకంగా ఉండా లని సామాజిక, ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ప్రజలు కేంద్రంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని వారు కోరుతున్నారు. లక్ష్యాలు, వాటి సాధనకు అవసరమైన వనరుల మధ్య అంతరం లేకుండా చూసుకోవాలని, లేదంటే విజన్ డాక్యుమెంట్ సఫలీకృతం కాబోదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం… విజన్ డాక్యుమెంట్‌లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను పొందుపరుస్తోంది.
ఇందులో భాగంగా వ్యవసాయం, సాగునీటి పారుదల, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించటం అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది. రైతులు, మహిళలు, యువత అభివృద్ధే లక్ష్యంగా డాక్యుమెంట్‌లో పలు అంశాలను చేర్చబోతున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఇదే నిజమైతే ఆ డాక్యుమెంట్ అమలుకు నిధులెక్కడి నుంచి సమీకరిస్తారనేది శేష ప్రశ్నగా మిగిలింది. ఇప్పటికే రూ.8 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద ఉందంటూ సీఎం సహా మంత్రులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు రాష్ట్ర ఆదాయం పెరగకుండా, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను సృష్టించు కోకుండా ప్రణాళికలను ఎలా అమలు చేస్తారనే చర్చ నడు స్తోంది. దీనికి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
అప్పుల తిప్పలెలా…?
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమంటూ ప్రభుత్వం చెబుతోంది. ఇది సాధ్యం కావాలంటే ముందు ఖజానాకు భారంగా ఉన్న రూ.8 లక్షల కోట్ల అప్పులు, వాటికి ఏడాదికి సగటున రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు చెల్లిస్తున్న వడ్డీల గురించి కూడా ప్రస్తావించాలి. బాండ్ల రూపంలో ఆర్బీఐ వద్ద నుంచి లెక్కకు మిక్కిలిగా తెస్తున్న రుణాలపై కూడా సర్కారు వివరణివ్వాలి. బడ్జెట్‌లో పేర్కొన్న అప్పులు, బడ్జెటేతర (కార్పొరేషన్ల పేర తెచ్చిన) రుణాలను ఎలా తీరుస్తారు? ఎప్పటిలోగా ఈ భారం నుంచి బయట పడతారనే విషయాలను కూడా ప్రభుత్వం సహేతుకంగా వివరించాలి. అప్పుడే విజన్ డాక్యుమెంట్‌కు సమగ్రత వస్తుందని, విశ్వసనీయత ఏర్పడు తుందని ఆర్థికనిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
బకాయిల సంగతేంటి..?
గత పదేండ్ల బీఆర్‌ఎస్ హయాంలో మాదిరిగానే ఇప్పటి కాంగ్రెస్ జమానాలోనూ బకాయిలు విపరీతంగా పేరుకుపోతున్నాయి. రైతు భరోసా కింద వానాకాలం పంట కోసం జూన్‌లో రూ.9 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు మళ్లీ ఎండాకాలం పంట కోసం మరో రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. భూమి లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద తొలి విడతలో రూ.300 కోట్లు విడుదల చేశారు. మలి విడత కింద ఇప్పుడు మరో రూ.300 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.5 వేల కోట్లు, ఉద్యోగ విరమణ చేసిన వారికి (రిటైర్‌మెంట్ బెనిఫిట్స్) రూ.10 వేల కోట్లు, కాంట్రాక్టర్లకు రూ.30 వేల కోట్లు, ఆర్టీసీకి రూ.5 వేల కోట్లు, విద్యుత్ సంస్థలకు రూ.21 వేల కోట్లు ప్రభుత్వం బకాయిపడింది.
ఇవన్నీ తీరితేగానీ ప్రణాళికల అమలుకు మార్గం సుగమం కాబోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ విధానాల వెంట పరుగులు పెట్టకుండా, మన ప్రజల అవసరాలు, రాష్ట్రంలోని భౌతిక పరిస్థితులను బేరీజు వేసుకుని ముందుకు పోవాలని వారు సూచిస్తున్నారు. మొత్తంగా ‘మనిషి కేంద్రంగా’ అభివృద్ధి జరగాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఆ రూపంలో విజన్ డాక్యుమెంట్‌కు రూపకల్పన జరిగితేనే అది ప్రయోజనకరంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ముందు ఫుట్‌పాత్‌లు కట్టండి… డాక్టర్ సి.రామచంద్రయ్య, సెస్ మాజీ ప్రొఫెసర్
‘హైదరాబాద్‌ను న్యూయార్క్, సింగపూర్‌లా మారుస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది.. మంచిదే. కానీ ముందు నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఫుట్‌పాత్‌లను నిర్మించండి. రహదారులకు సంబంధించి సేఫ్టీ ఫుట్‌పాత్‌లు అనేవి ప్రజల హక్కు. హైదరాబాద్‌లో రోడ్లు వెడల్పుగా ఉన్న చోట కూడా ఫుట్‌పాత్‌లు సరిగా ఉండటం లేదు. బెంగళూరులోని ఎమ్‌జీ రోడ్‌లో మాదిరిగా కూడా హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లు లేవు. ఇవి సరిగ్గా లేకపోవటం వల్ల కొద్ది దూరానికి కూడా వాహనాలు తీయాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్, కాలుష్యం నానాటికీ పెరిగిపోతున్నాయి. ముందు ఈ సమస్యలను పరిష్కరిస్తే.. ఆ తర్వాత న్యూయార్క్, సింగపూర్ గురించి మాట్లాడుకోవచ్చు…’
ఆచరణాత్మకంగా ఉండాలి.. డాక్టర్ అందె సత్యం, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు
‘విజన్ డాక్యుమెంట్ ఆచరణాత్మకంగా ఉన్నప్పుడే అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అందులో చెప్పే లక్ష్యాలకు, వనరులకు మధ్య తేడా ఉన్నప్పుడు ఆచరణాత్మకంగా ఉండే అవకాశం లేదు. విజన్ డాక్యుమెంట్ ఆధారంగా జరిగే అభివృద్ధి సమ్మిళిత అభివృద్ధిగా ఉండాలి. ప్రజల భాగస్వామ్యం లేకుండా కేవలం కార్పొరేట్లకే అవకాశం కల్పిస్తే, అభివృద్ధికి, ప్రజలకు మధ్య దూరం పెరుగుతుంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఇలాంటి ఉదాహరణలున్నాయి. వనరులన్నీ కార్పొరేట్లకు అప్పజెపితే ప్రభుత్వాలు కూడా నియంత్రించలేని స్థితికి పరిస్థితులు దిగజారుతున్నాయి. అందువల్ల ఉపాధి పెరగటంతోపాటు ఉత్పత్తిలో ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. రానున్న కాలంలో ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యత లభించాలి. అభివృద్ధికి సుస్థిరత చేకూర్చేందుకు ఇప్పటికి కూడా ఉత్పత్తి రంగానికి, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కొనసాగుతోంది. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి…’
ప్రజాభిప్రాయం సేకరించాలి.. డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, ప్రముఖ ఆర్థికవేత్త
‘ప్రభుత్వం చెబుతున్న విజన్ డాక్యుమెంట్-2047పై మొదట ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి, సమగ్రంగా చర్చించాలి. ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ రంగాల నిపుణుల సలహాలు తీసుకోవాలి. డాక్యుమెంట్ రూపకల్పన బాధ్యతను రాష్ట్రానికి చెందిన వారికి కాకుండా బయటి వారికి (ఐఎస్‌బీ ప్రొఫెసర్లు) ఇచ్చారు. ఇక్కడి భౌతిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులు వారికెలా తెలుస్తాయి?’



