పెద్ద సంఖ్యలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది నియామకం
వైద్య, నర్సింగ్ కళాశాలలు, సీట్ల సంఖ్య పెంపు
2 వేల పడకలతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం
వేగంగా కొనసాగుతున్న టిమ్స్ పనులు
ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితి రూ.10 లక్షలకు పెంపు
నవతెలంగాణ -హైదరాబాద్
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్‌రెడ్డి వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. గర్భిణీల నుంచి పిల్లలు, వృద్ధులకు వచ్చే సమస్యల వరకు ప్రతి రుగ్మతకూ ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందించాలనే సీఎం ఆకాంక్ష మేరకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నియామకం, ఆస్పత్రుల నిర్మాణం, వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలల సంఖ్యను పెంచడంతో పాటు సీట్లనూ పెంచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక శ్రద్ధతో జూనియర్ డాకర్ల స్టైఫండ్ పెంపు మొదలు ప్రతి సమస్యనూ పరిష్కరించడంతో పాటు వైద్యారోగ్య రంగం బలోపేతానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మందులు సులభం గా అందించేందుకు గానూ ప్రతి జిల్లాలో సెంట్రల్ మెడిసినల్ స్టోర్ (సీఎంఎస్)ను సర్కారు ఏర్పాటు చేసింది. కొత్తగా 22 జిల్లాల్లో స్టోర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. 1375 వైద్య చికిత్సల ధరలను సుమారు 22 నుంచి 25 శాతం వరకూ పెంచడంతో పాటు కొత్తగా 163 రకాల చికిత్సలను కొత్తగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఆరోగ్యశ్రీ కింద అందే చికిత్సల సంఖ్య 1835కి పెరిగింది.
వైద్యులు… సిబ్బంది పెంపు… అందుబాటులోకి 9 ప్రభుత్వ వైద్య కళాశాలు
సర్కారు దవాఖానాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మాసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్టులు, వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టింది. మొత్తంగా రెండేండ్ల కాలంలో వైద్యారోగ్యశాఖలో 9వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసింది. మరో ఏడు వేల పైచిలుకు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగా 9ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటు లోకి తీసుకొచ్చింది. దీంతో 450 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు అందుబాటు లోకి వచ్చాయి. మొత్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3,690 నుంచి 4,140కి పెరిగింది. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల సౌకర్యార్ధం కొత్త హాస్టల్ బిల్డింగ్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి నిర్మాణానికి రూ.204.85 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని(హనరోరియం) ప్రభుత్వం 15 శాతం పెంచింది. దేశంలోనే అత్యధిక స్టైఫండ్స్ ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ తొలి ఐదు స్థానాల్లో ఉంది. తెలంగాణలో కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో నర్సింగ్ కాలేజీలో 60 సీట్ల చొప్పున అదనంగా 960 సీట్లు తెలంగాణ బిడ్డలకు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో నర్సింగ్ కాలేజీల సంఖ్య 21 నుంచి 37కు పెరిగింది. సీట్ల సంఖ్య 1,400 నుంచి 2,360కి పెరిగింది. నర్సులకు దేశ, విదేశాల్లో ఉద్యోగవకాశాలు కల్పించే విధంగా.. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సహకారంతో ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ భాషలను నర్సింగ్ విద్యార్థులకు నేర్పిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 28 ప్రభుత్వ పారామెడికల్ కాలేజీల ప్రారంభంతో వాటి సంఖ్య 12 నుంచి 40కి పెరిగింది. 1680 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా తెలంగాణలో ప్రస్తుతం 3,172 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
కమ్యూనికేబుల్ డిసీజెస్‌పై కేంద్రీకరణ
ఆధునిక కాలం జీవన శైలి, పని విధానాలు, ఆహారపు అలవాట్లతో ప్రజల్లో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్స్‌ను ప్రజా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సుమారు 50 లక్షల మంది పేషెంట్లకు ఈ క్లినిక్‌ల ద్వారా వైద్యం అందుతోంది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ డే కేర్ క్యాన్సర్ సెంటర్లను సర్కారు ప్రారంభించింది. క్యాన్సర్‌తో బాధపడేవారు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండానే జిల్లాల్లోనే కీమో థెరపి చికిత్స అందించే ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రీజనల్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. డయాలసిస్ రోగులకు వాస్క్యులర్ సర్జరీలు చేసే సదుపాయం ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో మాత్రమే ఉంది. జిల్లాల్లోనూ వాస్క్యులర్ సర్జరీలు చేసేందుకు ఏర్పాట్లను ప్రజా ప్రభుత్వం ప్రారంభిం చింది. గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం, ఖమ్మం, మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రుల్లో, ఆదిలాబాద్ రిమ్స్‌లో వాస్క్యులర్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ.33 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 102 డయాలసిస్ సెంటర్లున్నాయి. రాబోయే రెండేండ్లలో 50 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
పది నిమిషాల్లోనే ఆస్పత్రికి తరలించేలా…
ప్రతి మండలానికి ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. కొత్తగా 213 అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఎమర్జన్సీ రెస్పాన్స్ టైమ్ గిరిజన ప్రాంతాల్లో 20 నిమిషాల నుంచి 14 నిమిషాలకు, గ్రామీణ ప్రాంతాల్లో 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైమ్‌ను పది నిమిషాలకు తగ్గించేందుకు మరో 77 అంబులెన్స్‌లను త్వరలోనే ప్రారంభించనున్నది. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే పేషెంట్‌ను ట్రామాకేర్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నది.
సర్కారు దవాఖానాల్లోనూ ఐవీఎఫ్ సేవలు
సంతానం కాక ఎదురుచూస్తూ ఐవీఎఫ్ సేవల కోసం ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి మోసపోతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగింది. ఈ నేపథ్యంలో లక్షల ఖరీదైన ఐవీఎఫ్ సేవలను గాంధీ, పెట్లబుర్జు ఆస్పత్రుల్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. వరంగల్ ఎంజీఎంలోనూ త్వరలోనే ఆ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యసేవల విషయంలో వివక్ష చూపకూడదనే ఉద్దేశంతో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా మైత్రి క్లినిక్స్ ద్వారా సేవలను అందిస్తున్నది. ప్రమాదాలు, ఇతర కారణాలతో అకాల మరణం పొందిన వారి నుంచి అవయవాలు సేకరించి ఆయా సమస్యలతో సతమతమయ్యే వారికి అమర్చేందుకు ఉద్దేశించిన జీవన్‌దాన్ వ్యవస్థను ప్రక్షాళించి, పారదర్శకంగా తయారు చేసేందుకు ప్రజా ప్రభుత్వం నడుంబిగించింది. కేంద్రం చట్టాన్ని స్వీకరించి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తోంది. అవయవదానాన్ని ప్రోత్సహిస్తోంది.
టిమ్స్‌లలో ప్రత్యేక వైద్యసేవలు
హైదరాబాద్ మహా నగరంలో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు (టిమ్స్) త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఆల్వాల్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూరో సైన్సెస్‌గా, సనత్‌నగర్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ సైన్సెస్‌గా, కొత్తపేట్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ గ్యాస్ట్రో సైన్సెస్‌గా సేవలు అందించనున్నాయి. సనత్‌నగర్ టిమ్స్‌లో అన్నిరకాల ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ టిమ్స్ పనుల తీరుపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ క్రమానుగతంగా సమీక్షిస్తున్నారు.
ఉస్మానియా హాస్పిటల్‌లో పెయిన్ క్లినిక్ ప్రారంభమైంది. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న పేషెంట్లకు ఇక్కడ నొప్పి నుంచి ఉపశమనం కలిగించేలా చికిత్సలు అందుతున్నాయి. వృద్ధుల కోసం అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో జెరియాట్రిక్ కేర్ క్లినిక్స్ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. వృద్ధులకు అవసరమైన ప్రత్యేక వైద్య సేవలు అందించేలా సిబ్బందిని నియమిస్తోంది. గోషామహల్‌లో రూ.2 వేల కోట్లతో 26 ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల పడకలతో కొత్త ఉస్మానియా దవాఖానాకు ఈ ఏడాది జనవరి 31న శంకుస్థాపన చేశారు. ఆ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా 28 వైద్య విభాగాల సేవలు అందనున్నాయి.



