సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
యూనియన్ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ బాగ్‌లింగంపల్లిలో 2కే రన్
నవతెలంగాణ – ముషీరాబాద్
కార్మికులను యాజమాన్యాలకు బానిసలుగా మార్చేలా.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించి లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో మెదక్ పట్టణంలో జరిగే సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం బాగ్‌లింగంపల్లి లోని సుందరయ్య పార్క్ నుంచి 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్‌తో నాలుగు లేబర్ కోడ్‌లుగా అమలు చేస్తూ తుంగలో తొక్కిందన్నారు. కార్పొరేట్లు, పెట్టుబడిదారుల ప్రయోజనానికే ఈ కోడ్‌లని తెలిపారు. ఈ లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులను సన్నద్ధం చేసేందుకు ఈ మహాసభలో చర్చలు జరుగుతాయన్నారు.
డిసెంబర్ 7న మెదక్ పట్టణంలో జరిగే కార్మిక బహిరంగ సభకు రాష్ట్రంలోని అశేష కార్మికవర్గం హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక సామాజిక ఉద్యమాలు, కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న సీఐటీయూ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు పద్మశ్రీ, ఎం.వెంకటేష్, శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎం.దశరథ్, జె.కుమారస్వామి, నగర కోశాధికారి కె.అజయ్ బాబు, నాయకులు మల్లేష్, జి.నరేష్, శ్రీనివాస్, అజయ్ బాబు, పి.మల్లేష్, సుందరయ్య పార్క్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, వాకర్స్ క్లబ్ సెంట్రల్ గవర్నర్ శైలజ, మాజీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం కార్యదర్శి వీరయ్య శ్రీనివాసరావు పాల్గొన్నారు.



