Thursday, December 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసర్పంచ్‌ పదవికి వేలంపాట..?

సర్పంచ్‌ పదవికి వేలంపాట..?

- Advertisement -

గోకుల్‌తండా పంచాయతీ పరిధిలో.. పెద్ద తండా, చిన్న తండా మధ్య వాగ్వాదం
అన్యాయం జరుగుతోందని తండావాసుల ఆవేదన
ఎన్నికలు బహిష్కరిస్తామని చిన్న తండావాసులు వెల్లడి
3 వార్డు స్థానాలకు నామినేషన్‌ ఉపసంహరణ
అధికారులు సముదాయించినా పరిష్కారం కాని సమస్య

నవతెలంగాణ-రామారెడ్డి
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తండాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. డబ్బున్నవారే పదవి దక్కించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తండాల్లో సర్పంచ్‌ పదవికి బహిరంగ వేలం వేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్‌తండా పంచాయతీ పరిధిలో పెద్దతండా, చిన్న తండాలున్నాయి. పెద్దతండా పరిధిలో దాదాపు 400మంది ఓటర్లు, చిన్న తండా పరిధిలో 250మంది ఓటర్లు ఉన్నారు. పెద్దతండా వారు సర్పంచ్‌ పదవిని వేలంపాట వేయగా.. అదే తండాకు చెందిన ఓ వ్యక్తి రూ.13,40,000 చెల్లించినట్టు తెలుస్తోంది. అభివృద్ధిలో భాగంగా చిన్న తండాకు వాటా అడిగితే ఇవ్వకపోవడంతో వారి పరిధిలోని 1, 2, 3 వార్డులకు ఒక్కొక్కరుగా నామినేషన్‌ వేసి బుధవారం ఉపసంహరించుకున్నారు.

సర్పంచ్‌ పదవికి చిన్న తండా నుంచి ఇద్దరు, పెద్ద తండా నుంచి ఒకరు బరిలో ఉండగా.. రెండు తండాల మధ్య బుధవారం వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. చివరకు ఎన్నికలు బహిష్కరిస్తామని, లేదంటే రెండు తండాలకు రెండు పోలింగ్‌ బూతులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎంపీడీవో, తహసీల్దార్‌తోపాటు పలువురు అధికారులు ప్రయత్నించినా పరిష్కారం కాలేదు. చివరకు ఆర్డీవో, అడిషనల్‌ ఎస్పీ చైతన్యరెడ్డి కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎన్నికల అధికారి నాగేశ్వర్‌ను వివరణ కోరగా చిన్న తండా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారని.. ఉన్నతాధికారులకు నివేదిస్తామని, వారి సూచన మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -