నవతెలంగాణ-హైదరాబాద్: ఇవాళ సాయంత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు రానున్నారు. ఈక్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రతిపక్ష నాయకుడితో విదేశీ ప్రముఖుల భేటీని అడ్డుకుంటున్నారని బీజేపీపై మండిపడ్డారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మాకు అందరితోనూ సంబంధాలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు భిన్నమైన దృక్పథాన్ని అందిస్తారు. మేము కూడా భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాము. ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే చేసే పని కాదు. బయట నుంచి వచ్చే వ్యక్తులను ప్రతిపక్షం కలవడానికి ప్రభుత్వం ఇష్టపడదు.” అని రాహుల్ గాంధీ అన్నారు. “మోడీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నియమాన్ని పాటించడం లేదు. ఇది వారి అభద్రతా భావం (insecurity)” అని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో ఈ సంప్రదాయం కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. “కానీ ఈ రోజుల్లో, విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు, నేను విదేశాలకు వెళ్లినప్పుడు, ప్రతిపక్ష నాయకుడిని కలవవద్దని ప్రభుత్వం వారికి సూచిస్తోంది. ఇది వారి విధానం, వారు ఎల్లప్పుడూ ఇలానే చేస్తున్నారు” అని రాహుల్ గాంధీ విమర్శించారు.



