నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి 260.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గురువారం పట్టణంలోని ఐబీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలకు సీఎం హాజరయ్యారు. ఏరోడ్రమ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద నుండి కార్ లో రోడ్డుమార్గాన సభ ప్రాంగణానికి చేరుకున్నారు. సభ ప్రారంభించే ముందు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.18.70 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం శంకుస్థాపన చేశారు. అలాగే రూ.1.75 కోట్ల పెట్టుబడితో ఇందిరా మహిళా శక్తి క్రింద స్వయం సహాయక మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్ స్థాపనకు శంకుస్థాపన చేశారు.
రూ.19.69 కోట్లతో 160 స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరు చేశారు. రూ.200 కోట్లతో పట్టణ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్లతో పట్టణంలోని మహాలక్ష్మి వాడ, విద్యానగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అదనపు గదుల నిర్మణం, ఆధునికీకరణకు శంకుస్థాపన చేశారు.పట్టణ భద్రతను మరింత బలోపేతం చేసి, శాంతి–భద్రతల పరిరక్షణను అత్యున్నత స్థాయిలో కొనసాగించేందుకు రూ.11.93 కోట్లతో 18 పోలీస్ క్వార్టర్స్, 2.6 కోట్లుతో 3 ఇంటెలిజెన్స్ విభాగం క్వార్ట్రర్స్, 2 కోట్లతో భరోసా కేంద్రం ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు.
స్థిరమైన, నిరంతర విద్యుత్ సరఫరా క్రమంలో ఆదిలాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న రూ. 231.24 లక్షల నిధులతో కొత్త కలెక్టరేట్ సమీపం వద్ద టీజీఎన్.పీడీసీఎల్ ద్వారా 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంఖు స్థాపన చేశారు. మొత్తం 260.45 కోట్ల అభివృద్ధి పనులకు సభ ప్రాంగణం నుండే శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఇందులో స్థానిక శాసన సభ్యులు పాయాల్ శంకర్, రాష్ట్రమంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ఎం పి నగేష్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, గడ్డం వినోద్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు ఉన్నారు.



