నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మకంగా ఆదివారం 13 గంటలపాటు అంతర్జాలంలో నిర్వహించిన అంతర్జాతీయ వేదిక బాల సాహిత్య భేరి లో అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధిని కంబంపాటి శృతి పాల్గొని చిరు స్వరాలు గేయ సంకలనంలో బాల రచయిత్రి సిద్ధాంతపు పూజిత శ్రీ వ్రాసిన మనిషి మారాలి గేయాన్ని ఆలపించి తానా నిర్వాహకుల ప్రశంసలు అందుకుంది.
తానా ప్రపంచ సాహిత్య వేదిక కన్వీనర్ ప్రసాద్ తోటకూర,తానా పాఠశాల అధ్యక్షులు భాను ప్రకాష్,సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ , శాంతా బయోటిక్స్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ వర ప్రసాద రెడ్డి, మలేషియా తెలుగు సంఘం నిర్వాహకులు ముల్లాల సత్యా దేవి, చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ తెలంగాణా సారస్వత పరిషత్ కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య, ప్రముఖ బాల సాహితీ వేత్తలు డి.కె.చదువులు బాబు,పైడిమర్రి రామకృష్ణ వంటి ఉద్దండులు శృతి గేయాలాపన ను ప్రశంసించారు. గురువారం తానా పంపిన ప్రశంసా పత్రాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, పాఠశాల ఉపాధ్యాయినీ ,ఉపాధ్యాయులు ,విద్యార్ధులు పాల్గొని అభినందనలు తెలిపారు.



