Thursday, December 4, 2025
E-PAPER
Homeమానవిచైతన్యాన్ని నింపే కామేశ్వరి కథలు

చైతన్యాన్ని నింపే కామేశ్వరి కథలు

- Advertisement -

డి.కామేశ్వరి… తెలుగు సాహిత్య రంగంలో పరిచయం అవసరం లేని పేరు. మూడు వందల కథలతో పదకొండు కథా సంపుటాలను వెలువరించారు. తను రాసే ప్రతి అక్షరంలో మహిళా అభ్యుదయానికి పెద్ద పీఠ వేస్తారు. అటు అధ్యయనంలో కానీ ఇటు రచనల్లోనూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తనలోని ప్రతిభకు ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. నిత్యం మహిళల సమస్యలపై స్పందిస్తూ, తన రచనల ద్వారా మహిళల్లో చైతన్యాన్ని నింపుతున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

కాలం మారింది అనుకుంటాం.. మనుషులు మారారు అనుకుంటాం.. కానీ మహిళలను చూసే దృష్టి కోణం విషయంలో మాత్రం పెద్దగా తేడా ఏమీ లేదు. ఆ నాడు ఈ నాడు ఆమెకు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. మహిళలు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. నమ్మి మోస పోయిన మహిళ తనకు న్యాయం కావాలి అంటూ న్యాయస్థానానికి వచ్చి న్యాయం కోరుతుంది. చివరకు ఆ న్యాయస్థానం ముందే పోరాటానికి దిగుతుంది. చివరకు విజయం సాధిస్తుంది. ఇదే ‘న్యాయం కావాలి’ పేరుతో సినిమాగా వచ్చింది. ఇది అప్పట్లో కేవలం ఓ సినిమా మాత్రమే కాదు ఎంతో మంది మహిళల్లో ఆత్మధైర్యాన్ని నింపిన చిత్రం. ప్రముఖ రచయిత్రి డి.కామేశ్వరి రచించిన ‘కొత్తమలుపు’ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.

అధ్యయనంతో మొదలై…
తన విభిన్న, అభ్యుదయ రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో విశిష్టస్థానం సంపాదించుకున్న డి.కామేశ్వరి ఆగస్టు 22, 1935న తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో పుట్టారు. రామచంద్రాపురంలో పెరిగి అక్కడే విద్యను అభ్యసించారు. చిన్నతనంలోనే వివాహం జరగడంతో భర్త డి.వి.నరసింహం ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించారు. భర్త ఉద్యోగ విరమణ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. భర్త ఆఫీసుకి వెళ్లిన తర్వాత ఆమెకు ఏమీ తోచేది కాదు. పైగా అక్కడ భాష సమస్య. సాయంత్రం భర్త ఆఫీస్‌ నుండి రాగానే ఇంట్లో తనకు ఏమీతోచడం లేదని అనేవారు. అతను పుస్తకాలు చదవమని సలహాఇచ్చేవారు. అక్కడ తెలుగు పుస్తకాలు పెద్దగా దొరికేవి కావు. అయితే ‘నీకు ఇంగ్లీష్‌, హిందీ చదవడం వచ్చుకదా, ఆ పుస్తకాలు చదువు’ అంటూ ప్రోత్సహించారు. అలా అనేక పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. దీంతో ఇంగ్లీష్‌ భాషపై బాగా పట్టు దొరికింది. తన ఇరవై ఐదవ ఏటా నెమ్మదిగా రచనలు చేయడం ప్రారంభించారు. అలా మొదలైన ఆమె రచనా వ్యాసాంగం నేటికీ కొనసాగుతూనే ఉంది.

వివిధ భాషల్లో…
కామేశ్వరి మొదటి రచన ‘వనితలు వస్త్రాలు’ 1962లో ఆంధ్రపత్రికలో ప్రచురింప బడింది. అలాగే ఇదే పత్రికలో ఆమె రాసిన మొదటి కథ ఆనందరావు – ఆ కాకరకాయలు కూడా ప్రచురితమైంది. అప్పటి నుండి ఆమె వెను తిరిగి చూసుకోలేదు. ఈమె 1968లో ‘కొత్తనీరు’ అనే తన మొదటి నవలను రాశారు. కామేశ్వరి రాసిన కథలు, నవలలు హిందీ, కన్నడ, తమిళ భాషలలో అనువాదం చేయబడ్డాయి. అలాగే అనేక కథలకు, నవలలకు పోటీలలో బహుమతులు కూడా వచ్చాయి. ఆమె రచనలన్నీ సామాజిక స్పృహతో నిండి ఉంటాయి. కవితలు, కథలు, వ్యాసాలు వంటి అనేక ప్రక్రియల్లో ఆమె తన ప్రతిభను చాటుకున్నారు.

గత యాభై మూడేండ్లలో సుమారు మూడువందల కథలతో పదకొండు కథా సంపుటాలు వెలువరించారు. అలాగే ఇరవై రెండు నవలలు, ఒక కవితాసంపుటి, ఒక యాత్రావిశేషాల పుస్తకాన్ని ప్రచురించారు. వారి నవలలు ‘కొత్తమలుపు’ ‘న్యాయం కావాలి’ అన్న పేరుతో, కోరికలే గుర్రాలైతే అదే పేరుతో చిత్రాలుగా నిర్మించబడ్డాయి. ఈమె రచనలు హిందీలో ‘ఆజ్‌ కీ నారీ’, ఇంగ్లీష్‌లో ‘లివింగ్‌ టుగెదర్‌’ కాగా, తమిళంలోకి ఒక కథల పుస్తకం, కన్నడలోకి సుమారు పది పుస్తకాలు అనువదించబడ్డాయి. అలాగే ఆమె రాసిన అనేక కథలు రేడియో నాటకాలుగా, టీవీ సీరియల్స్‌గా ప్రసారం అయ్యాయి.

ప్రతిభకు పురస్కారాలు
కామేశ్వరి ప్రతిభకు గుర్తుగా అనేక పురస్కారాలు ఆమెను వరించాయి. 1970లో గృహలక్ష్మి స్వర్ణకంకణం, 1981లో ‘కొత్తమలుపు’ నవల ఆధారంగా వచ్చిన ‘న్యాయం కావాలి’ సినిమా ఉత్తమ కథగా అవార్డు అందుకుంది. 1983లో మాదిరెడ్డి సులోచన అభినందన అవార్డు ఆమెను వరించింది. అలాగే 1990, 1994, 1999లో తెలుగు యూనివర్సిటీ ఉత్తమ రచయిత్రిగా మూడుసార్లు అవార్డులు అందుకున్నారు. 1991లో మద్రాసు తెలుగు అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు సైతం ఆమెను వరించింది. అలాగే 1998 సుశీల నారాయణరెడ్డి అవార్డు, 2006లో గోపీచంద్‌ అవార్డు, 2010లో ‘మనసున మనసై’ నవలకు టీవీ అవార్డు అందుకున్నారు.

  • పాలపర్తి సంధ్యారాణి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -