తెలంగాణలో నిజాం రాచరిక పాలన, సాంఘిక, ఆర్థిక, దోపిడీపై తిరుగుబాటు పోరాటంలో ఉద్భవించిన నాయకుడు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి (వి.ఎన్).’పువ్వు పుట్టగానే పరిమళించు అన్నట్లు’ అన్యాయాన్ని ఎదిరించేతత్వం, అరాచకాలను ఎదుర్కొనే లక్షణంతో ఎత్తుగడల్లో దిట్టగా, తెలివిగల విద్యార్ధిగా బాల్యం నుండే పోరాట మార్గాన్ని ఎంచుకున్నాడు. విద్యార్థి దశలో విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై విప్లవోద్యమంలో తనదైన పాత్ర పోషించాడు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉద్యమాల రూపశిల్పిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మార్క్సిస్టు పార్టీ నిర్మాణంలోను తనదైన ముద్రవేశాడు. ప్రజాపోరాటాలు నిర్వహించడంతో పాటు సిద్ధాంత ఆచరణను మేళవిస్తూ మార్కిస్టు మహోద్యమంలో మహానేతగా కొనసాగాడు. పీడిత ప్రజల కోసం అహర్నిశలు పాటుపడిన కామ్రేడ్ వీఎన్ అనారోగ్యంతో 2004 డిసెంబర్ 5న అనారోగ్యంతో మరణించారు. నేడు ఆయన 21వ వర్థంతి.
పోరాటాల పురిటిగడ్డ అయిన ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి ప్రాంతంలో మామిండ్ల మడవ గ్రామంలో 19 మే1930లో ధనిక రైతు కుటుంబంలో జన్మించిన వెంకట నరసింహారెడ్డి పేద ప్రజల కోసం జీవితాంతం పోరుబాటలో నడిచిన గొప్పయోధుడు. ఆయన సూర్యా పేటలో విద్యనభ్యసిస్తున్న రోజుల్లో విద్యార్థి సంఘం నాయకుడిగా గుర్తింపు పొంది విద్యార్థుల సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న తరుణంలో పోలీసులు పెద్ద ఎత్తున లాఠీఛార్జి, దాడిచేసి అరెస్టులకు పూనుకున్నారు. కామ్రేడ్ ధర్మభిక్షంను అరెస్టు చేయడంతో విద్యార్థులను సమీకరించి ఉద్యమాలు నిర్వహించాడు. కమ్యూనిస్టు పార్టీ పిలుపునందుకుని నిజాం రజాకార్ల, పోలీసుల దుర్మార్గాలను ఎదుర్కొనేందుకు చదువు మధ్యలో వదిలేసి ఎర్రజెండా చేతబట్టాడు. చిల్పకుంట్ల, ఏపూరు ఏటి వద్ద శిక్షణలో చేరి వడిసెల, కర్రసాము శిక్షణ పొంది శత్రు శిబి రాన్ని అంచనా కట్టడంలో అందరికన్న తెలివిగలవాడిగా పేరు తెచ్చుకున్నాడు.
పాత సూర్యాపేట పక్కన ఉన్న బాలెంల గ్రామంలో బందూకు చేబట్టి బడుగు జీవులకు అండగా నిలిచి పాలకుర్తి, మొండ్రాయి గ్రామాల్లో భూపోరాటాలకు నాయకత్వం వహించాడు. పెద్దగూడెం దళానికి దళ కమాండర్‌గా పనిచేసి శత్రువులకు చిక్కని ఎత్తుగడలతో నైజాం రజాకార్లను మట్టికరిపించాడు. సాయుధపోరు విస్తృతం చేయాలన్న పార్టీ నిర్ణయం ప్రకారం ఉత్తర తెలంగాణ ఏరియా బాధ్యతలు తీసుకుని కరీంనగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో రహస్య జీవితం గడుపుతూ, కొత్త కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. అంతేకాదు, పార్టీలో పూర్తికాలం కార్యకర్తలను గుర్తించి వారికి రాజకీయ సైద్ధాంతిక అవగాహన కల్పించటంలో వీఎన్ కృషి మరువలేనిది.
పార్టీలో పనిచేస్తున్న పూర్తికాలం కార్యకర్తల బాగోగులు, కుటుంబ పరిస్థితులపై వారితో కూర్చొని మాట్లాడి, వారికి మనోధైర్యం ఇచ్చేవారు. కార్యకర్తల జీవన విధానం గురించి మాట్లాడేవారు. పునాది వర్గాల నుంచి వచ్చిన కార్యకర్తల యెడల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండేవారు. పార్టీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు డివిజన్,మండల,గ్రామాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చేవారు.పాలక పార్టీల అండతో ఉద్యమ కేంద్రాలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరిగినప్పుడు, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేసినప్పుడల్లా ఆయన ప్రజలను సమీకరించేవారు. ఉద్యమాలకు పిలుపునిచ్చి కార్యకర్తలకు అండగా నిలిచేవారు. ఆయన ప్రజాప్రతినిధిగానూ సేవలందించారు. నల్లగొండ జిల్లాను సమగ్ర అభివృద్ధికి సాగు, తాగునీరు అందించాలని, ఫ్లోరైడ్ నివారణ కోసం కృషిచేశారు. ఆయనతో పాటు సతీమణి స్వరాజ్యం కూడా ముందు నడిచారు. ఆయన చరిత్ర విప్లవోద్యమాలకు వెలుగు. ఆయన పరిపూర్ణమైన విప్లవ జీవితం గడిపారు. ధనిక రైతు కుటుంబంలో పుట్టి పీడిత వర్గాల కోసం తుదిశ్వాస వరకు పనిచేశారు. ప్రతినిత్యం పేదల కోసమే గళమెత్తిన ఆయన గొప్ప ఆదర్శ కమ్యూనిస్టు. ఆయన నిరాడంబరత, సిద్ధాంత ఆచరణ నేటి తరానికి ఆదర్శం.
ములకలపల్లి రాములు 9490098338



