స్వయంగా ప్రధాని మోడీ స్వాగతం
ఇరువురు నేతల ప్రయివేటు విందు సమావేశం
న్యూఢిల్లీ : ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పుతిన్‌కు విమానాశ్రయం లో స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ఒకే కారులో ప్రధాని అధికార నివాసానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ, పుతిన్‌కు ప్రయివేటుగా డిన్నర్ ఇచ్చారు. గతేడాది జులైలో మోడీ మాస్కోలో పర్యటించినపుడు రష్యా నేత కూడా ఇలాగే విందునిచ్చారు. కాగా గత నాలుగేండ్ల కాలం లో పుతిన్ తొలి పర్యటన ఇదే. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందుగా 2021 డిసెంబరులో పుతిన్ భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత ఇప్పుడే రావడం. శుక్రవారం హైదరాబాద్ హౌస్‌లో జరిగే భారత్-రష్యా 23వ సదస్సులో ఇరువురు నేతలు పాల్గొంటారు. దానికి ముందుగా ఆయనకు ఘన స్వాగతం లభించనుంది. సదస్సు ముగిసిన తర్వాత పుతిన్ రష్యా ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన ఆర్‌టీ ఇండియా చానల్‌నుట కొత్తగా ప్రారంభించనున్నారు.
ఆ తర్వాత పుతిన్ గౌరవార్ధం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పా టు చేసిన విందు సమావేశానికి హాజరవు తారు. అంతకుముందు రాజ్‌ఘాట్ కు వెళ్ళి మహాత్మునికి నివాళులు అర్పించను న్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా పుతిన్ పర్యటన జరుగుతోంది. ఉక్రెయిన్‌పై శాంతి ఒప్పందానికి ట్రంప్ పట్టుబడుతున్న వేళ, అలాగే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అదనంగా భారత్‌పై సుంకాలు విధిస్తున్న వేళ పుతిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అటు అమెరికాతో ఇటు రష్యాతో సంబంధాలను సమతూకం చేసుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఇదిలావుండగా, పెండింగ్‌లో వున్న మిలటరీ హార్డ్‌వేర్‌ను త్వరగా అందచేయాల్సిందిగా భారత్ గట్టిగా కోరుతుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆరంభమైన తర్వాత ఈ విషయంలో అసాధారణ రీతిలో జాప్యం జరుగుతోంది.
ఐదు ఎస్-400 యూనిట్లు కోసం 2018లో 500కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంపై భారత్, రష్యాలు సంతకాలు చేశాయి. వీటిలో మూడు వరకు అందచేయగా, మరో రెండింటిని వచ్చే ఏడాది మధ్య నాటికి అందచేస్తారని భావిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ వ్యవస్థలు సమర్ధవంతంగా పనిచేశాయి. ఇంధన భద్రతపై ప్రధానంగా చర్చ జరగనుంది. సరఫరాలు నిలకడగా కొనసాగేలా వుండేందుకు రష్యా ప్రయత్నిస్తున్నప్పటికీ భారత్ కొనుగోళ్లు కొద్ది కాలం పాటు తగ్గవచ్చని భావిస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ వ్యాఖ్యానించారు. పుతిన్, మోడీ సమావేశానికి ముందుగానే ఇరు దేశాల రక్షణ మంత్రులు సమావేశమై కీలకమైన మిలటరీ హార్డ్‌వేర్‌పై చర్చలు జరుపుతారని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై అమెరికా తాజాగా జరిపిన దౌత్యచొరవల గురించి పుతిన్, మోడీకి తెలియచేస్తారని భావిస్తున్నారు.




