మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతాయా?
సర్వత్రా అనేక అనుమానాలు
ఎంఎంసీ నేత అనంత్ విజ్ఞాపనపై ఇంకా స్పందించని ప్రభుత్వాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌తో తిరిగి దండకారణ్యం(డీకే)లో ఉద్రిక్తత నెలకొన్నది. ఒకవైపు శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తే తాము లొంగిపోతామంటూ మావోయిస్టులు ప్రకటించిన తరుణంలో ఒక్కసారిగా దంతెవాడలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడంతో సందేహాస్పద వాతావరణం ఏర్పడిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలనే మావోయిస్టు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) కమిటీ అధికార ప్రతినిధి అనంత్.. పై మూడు ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు లేఖలను రాసి తాము సామూహికంగా లొంగిపోదల్చుకున్నామనీ, అందుకు తగిన వాతావరణాన్ని దండకారణ్యంలో కల్పించాలని కోరాడు. అంతేగాక జనవరి 1న తాము ఆయుధాలతో సహా లొంగిపోనున్నామని స్పష్టం చేశాడు. అలాగే తాము ప్రతీ ఏడాది అమరవీరుల కోసం జరిపే పీపుల్స్ లిబరేషన్ ఘెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) సంస్మరోణోత్సవాలను కూడా నిలిపివేయడమేగాక ఇతర కార్యకలాపాలను కూడా ఆపివేస్తున్నట్టు ప్రకటించాడు.
దీనికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో దంతెవాడలో భారీ ఎన్‌కౌంటర్ జరగటం, అందులో 17 మంది మావోయిస్టులతో పాటు ముగ్గురు జవాన్లు మరణించటం చోటు చేసుకున్నది. దీంతో ఒక్కసారిగా మావోయిస్టుల లొంగుబాట్ల ప్రక్రియకు ప్రతిష్టంభన ఏర్పడిందనే వాతావరణం చోటు చేసుకున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకపక్క మావోయిస్టులు తమకు అనుకూలమైన తీరులో మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని లొంగిపోవాలని తెలంగాణతో సహా ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలుపునిచ్చారు. అందుకు స్పందిస్తూ మావోయిస్టులు సైతం లొంగిపోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు.
ఇంకోవైపు మల్లోజుల వేణుగోపాల్‌రావు, తక్కళ్లపల్లి వాసుదేవరావు వంటి కేంద్ర కమిటీ అగ్రనేతలు సైతం లొంగు’బాట’లో నడిచారు. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో సాగిస్తున్న కగార్ ఆపరేషన్‌కు కొంత విరామం ప్రకటించి, మావోయిస్టులు రావడానికి మార్గం సుగమం చేస్తే బాగుండేదనే అభిప్రాయం పౌర హక్కులు, ప్రజాస్వామికవాదుల నుంచి వినిపిస్తున్నది. మరోవైపు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఇరుపక్షాల నుంచి ఎటువంటి ప్రాణహానీ లేకుండా మావోయిస్టుల లొంగుబాటు జరిగి దండకారణ్యంలో వాతావరణం పూర్తి శాంతియుతంగా మారాలన్నదే తమ కోరికగా అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో దంతెవాడలో జరిగిన తాజా ఘటన ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందో అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.



