ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు
న్యూయర్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ
న్యూయార్క్ : ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాలోని న్యూయార్క్‌ను సందర్శించాలనుకుంటున్నట్టు తెలిపారు. ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వారెంట్ ప్రకారం నెతన్యాహును అరెస్టు చేస్తామని న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ హెచ్చరికలు చేశారు. ఓ మీడియాకు వర్చువల్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడారు. ‘ఔను. నేను న్యూయార్క్‌ను సందర్శించాలనుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమ్దానీతో మాట్లాడతారా అని ప్రశ్నించగా.. ‘మమ్దానీ తన మనసు మార్చుకోవాలి. మనకు జీవించే హక్కు ఉందని అతడు చెబితే.. మా మధ్య సంభాషణకు అది మంచి ఆరంభం అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.
డెమోక్రటిక్ సోషలిస్టు అయిన మమ్దానీ ఇటీవల న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో నెతన్యాహుపై మమ్దానీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన్ను ఓ యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు. తాను మేయర్‌నైతే, నెతన్యాహు ఒకవేళ న్యూయార్క్‌కు వస్తే మాత్రం ఆయనను అరెస్టు చేయిస్తానని వ్యాఖ్యానించారు. ఇక, గాజాపై యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుతో పాటు ఇజ్రాయిల్ మాజీ రక్షణమంత్రి యోవ్ గాలంట్‌పై 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఐసీసీ సభ్య దేశాల్లోకి అడుగుపెడితే వారిని అరెస్టు చేసే ముప్పు ఉంది. మమ్దానీ అరెస్టు హెచ్చరికలు ఉన్నప్పటికీ.. అది అసాధ్యమని నెతన్యాహు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే న్యూయార్క్ సందర్శనకు సిద్ధమని తెలిపారు.



