నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలి
గ్యాస్ మాస్క్‌లతో ప్రతిపక్ష ఎంపీల నిరసన
రూపాయి విలువ పతనంపై ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో ఆ పొగ పార్లమెంట్‌నూ తాకింది. ఆ కాలుష్య నియంత్రణకు కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు మాస్క్‌లు ధరించి నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతబూని నినాదాల హోరెత్తించారు. ఈ సమస్యను జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంకా గాంధీ, సీపీఐ(ఎం) ఎంపీ కె. రాధాకృష్ణన్, జాన్ బ్రిట్టాస్, సీపీఐ ఎంపీలు పి.సంతోష్ కుమార్, సుబ్బరాయన్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు గ్యాస్ మాస్క్‌లు ధరించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ఇది ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. కాలుష్యంతో చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడి మృతి చెందుతున్నారని. పెద్దలూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాయు కాలుష్యం రాజకీయ అంశం కాదని ప్రియాంక గాంధీ అన్నారు. నెల రోజుల నుంచి తీవ్రమవుతున్న వాయు కాలుష్య సంక్షోభంపై చర్చించాలని ఉభయసభల్లో కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఢిల్లీ వాయు కాలుష్యంపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్ మధ్య రాజ్యసభ ఒకసారి వాయిదా పడింది.
చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పతనం
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యూఎస్ డాలర్‌తో పోలిస్తే చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.90.43 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ ”రూపాయి పడిపోతోందని నేను చెప్పాను. దీని అర్థం దేశ ఆర్థిక పరిస్థితి బాగా లేదని. మనం అభివృద్ధి చెందుతున్నామని, ఆర్థిక పరిస్థితి బాగుందని వారు ఎప్పుడూ చెబుతారు. కానీ రూపాయి పడిపోయినప్పుడు, అది మన ఆర్థిక పరిస్థితి ఏమిటో చూపిస్తుంది” అని అన్నారు.
కొన్నేండ్ల క్రితం మన్మోహన్ సింగ్ హయాంలో రూపాయితో పోలిస్తే డాలర్ విలువ ఎక్కువగా ఉన్నప్పుడు, బీజేపీ నేతలు ఏమన్నారని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. మరిప్పుడు నెలకొన్న పరిస్థితికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి పతనం అవుతోందని తెలిపారు. లోక్‌సభలో ఆరోగ్య భద్రత జాతీయ భద్రతా పన్ను బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మరోవైపు కేంద్ర ఎక్సైజ్ (సవరణ) బిల్లును రాజ్యసభ తిరిగి లోక్‌సభకు పంపడంతో పార్లమెంటు ఆమోదం పొందినట్టు ప్రకటించారు.
18,822 మంది భారతీయుల్ని బహిష్కరించిన అమెరికా : కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్
”భారతీయులపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తరువాత భారతీయులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే వేలాది మందిని స్వదేశానికి పంపించిన ట్రంప్ సర్కార్.. ఇప్పటికీ ఆ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 3,258 మంది భారతీయులను యూఎస్ బహిష్కరించింది” అని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
‘2009 నుంచి ఇప్పటి వరకూ 18,822 మంది భారతీయుల్ని అమెరికా బహిష్కరించింది’ అని తెలిపారు. 2023లో 617 మందిని, 2024లో 1,368 మందిని, 2025లో 3,258 మంది భారతీయులను అమెరికా బహిష్కరించి నట్టు వివరించారు. ‘జనవరి 2025 నుంచి ఇప్పటి వరకూ 3,258 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపింది. వీరిలో 2,032 మంది అంటే సుమారు 62.3 శాతం మందిని సాధారణ వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి పంపింది. మిగిలిన 1,226 మందిని (37.6 శాతం) యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించే చార్డర్ విమానాల్లో భారత్‌కు తరలించింది’ అని జైశంకర్ వెల్లడించారు.
ఐదేండ్లలో 62 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్లకుండా నిరాకరణ
గత ఐదేండ్లలో విదేశీ ఇమ్మిగ్రేషన్ అధికారులు 62 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్లకుండా నిరాకరించారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అలాగే 11 మంది విద్యార్థులను కిర్గిజ్‌స్తాన్‌కు వెళ్లకుండా నిరాకరించారు. అయితే గత ఐదేండ్లలో యూకే 170 మంది, ఆస్ట్రేలియా 114 మంది, రష్యా 82 మంది, అమెరికా 45 మంది, ఉక్రెయిన్ 13 మంది, ఫిన్‌లాండ్ ఐదుగురు ఇండియా విద్యార్థులను బహిష్కరించాయి.
పార్లమెంట్‌ను తాకిన ఢిల్లీ వాయు కాలుష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



