గచ్చిబౌలి ఎస్వీకే సందర్శనకు పిల్లలను ప్రోత్సహించండి
ఎంఈవోలకు రంగారెడ్డి డీఈవో సుశీందర్ రావు ఆదేశం
బాలోత్సవ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం సేవలను విరివిగా ఉపయోగించుకోనున్నట్టు రంగారెడ్డి జిల్లా విద్యాధికారి పి.సుశీందర్ రావు తెలిపారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (గచ్చిబౌలి) ఆధ్వర్యంలో కార్యదర్శి పి.ప్రభాకర్ అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన బాలోత్సవ్ సభ మొదటి రోజు ముగింపు సభకు సుశీందర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలు బాగున్నాయని అభినందించారు. ఆ కేంద్రంలో ఉన్న పెద్ద గ్రంథాలయాన్ని పేద విద్యార్థుల కోసం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని మండల విద్యాధికారులను ఆదేశించారు.
వినడం కన్నా చదవడం ద్వారా నేర్చుకున్న విషయాలు ఎక్కువగా గుర్తుంటాయని తెలిపారు. అదే పనిగా తరగతి గదిలో చదువుకోమంటే పిల్లలు ఇష్టపడరనీ, బాలోత్సవ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఎస్వీకే లాంటి చోట్లకు వచ్చి బయటి ప్రపంచం చూస్తుంటే వారికి ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు చదువు నేర్పించే ముందు పిల్లల మనసులను గెలవాలన్నారు. పిల్లల నుంచి ఎక్కువగా మా టీచర్ కొడుతుంది… తిడుతుంది.. లాంటి ఫిర్యాదులు రావడానికి ఆ టీచర్‌ను పిల్లలు ఇష్టపడకపోవడమే కారణమని వివరించారు. సమాజం మంచి కోరేవారు, సమాజం చెడు కోరేవారు ఇద్దరూ తరగతి గది నుంచే తయారవుతారని వ్యాఖ్యానించారు. ఏ టీచర్ అయితే విద్యార్థిని సరిగ్గా తీర్చిదిద్దరో ఆ గది నుంచి వచ్చే వారు చెడు కోరేవారుగా తయారవుతున్నారని చెప్పారు. తమ పరిధిలో 1,500 స్కూళ్లు ఉన్నాయనీ, అవసరం మేరకు ఎస్వీకే సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు.
సభకు మరో అతిథిగా హాజరైన ఎన్‌ఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్, జేవీవీ గౌరవాధ్యక్షులు ఎ.రాంచంద్రయ్య మాట్లాడుతూ పిల్లలను తీర్చిదిద్దే దర్శకత్వ బాధ్యతను టీచర్లు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. మనిషి అని గుర్తించడానికి కళా దృక్పథం ఉండాలని సూచించారు. కళాత్మక దృష్టి ఉంటేనే మనిషి ఉత్తేజంగా ఉంటారనీ, ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ వయోలిన్ వాయించే వాడని ఉదహరించారు. తాను నాలుగో తరగతి నుంచి పరిశోధన చేసే వరకు ప్రతీ ఏడాది నాలుగైదు కళాత్మక కార్యక్రమాల్లో పాల్గొనే వారమని గుర్తుచేసుకున్నారు. ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మొద్దనీ, సంశయాత్మకంగా ఉన్న విషయాలపై ప్రశ్నించి తెలుసుకోవాలని సూచించారు. రాజ్యాంగం కూడా అదే విషయాన్ని చెబుతుందని వివరించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వస్తున్న చెకుముకి పిల్లల్లో శాస్త్రీయ అవగాహన పెంచుతోందని తెలిపారు. 1930లో సీ.వీ.రామన్‌కు సైన్సులో నోబెల్ బహుమతి వచ్చిన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఎవరికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అలాంటి అత్యున్నత బహుమతిని అందుకునే దిశగా మన ఆలోచనలుండాలని ఆకాంక్షించారు.
సభాధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ బాలోత్సవ్‌లో భాగంగా వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో పిల్లలు పాల్గొన్నారని తెలిపారు. ఆయా స్కూళ్లలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులతో తుది పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఉత్సవాలకు సహకరించిన సిబ్బంది, ఉపాధ్యాయులు, డ్యాన్సర్లు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం కూడా బాలోత్సవ్ కొనసాగుతుందని చెప్పారు. ఎస్వీకే సమీపంలోని 10 చోట్ల పేద విద్యార్థులకు ట్యూషన్స్ చెబుతున్నట్టు వివరించారు. పేద విద్యార్థులతో పాటు బడ్జెట్ స్కూళ్ల విద్యార్థులు విద్యావసరాల కోసం ఎస్వీకేను సంప్రదిస్తే అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఎస్వీకే గ్రంథాలయంలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో 3 లక్షల పుస్తకాలున్నాయనీ, వాటిలో 15 వేల పుస్తకాలు డిజిటల్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
ప్రతి నెల మొదటి ఆదివారం 10 మంది స్పెషలిస్టులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, ఉచితంగా మందులందిస్తున్నట్టు వెల్లడించారు. ఉచిత కంప్యూటర్ శిక్షణ కూడా కొనసాగుతోందని వివరించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రధానంగా నిలిచిన పుచ్చలపల్లి సుందరయ్య…. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన అగ్రగణ్యుల్లో ఒకరని చెప్పారు. మొదటి పార్లమెంటులో ఆయన ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హౌదా ఉన్నా కూడా సైకిల్‌పై ప్రయాణించిన ఆయన ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. సుందరయ్య ఆశయాల సాధనకు తమ కృషి కొనసాగుతుందనీ, ఏ సమస్య ఉన్న సంప్రదించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు చంద్రయ్య మ్యాజిక్ షో ద్వారా పిల్లల్లో శాస్త్రీయ అవగాహన పెంచే ప్రదర్శన నిర్వహిం చారు. అనంతరం ఆహూతులతో కలిసి సుశీందర్ రావు విజేతలకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమాన్ని శ్రద్ధగా ఆలకించి నేర్చుకుంటున్న ఐదో తరగతి విద్యార్థినినీ ప్రత్యేకంగా అభినందించిన డీఈవో ఆమెకు వ్యక్తిగతంగా రూ.1,000 నగదు పారితోషికాన్ని ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల విద్యాధికారి కె.వెంకటయ్య, గండిపేట మండల విద్యాధికారి సునీల్ కుమార్, ఎస్వీకే ట్రస్ట్ సభ్యులు ఆర్.సాంబశివరావు, కల్చరల్ బాధ్యులు శ్రీనివాసరావు, ఎస్వీకే బాధ్యులు అనిల్, రవి, మహిళా బాధ్యురాలు మంజుల, బాలోత్సవ్ కన్వీనర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.



