రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి ప్రతిపక్షనేతకు అనుమతి నిరాకరణ
విపక్షాలను కలవొద్దని ప్రముఖులకు చెబుతోన్న ప్రభుత్వం: రాహుల్ గాంధీ
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
”దేశంలో మోడీ సర్కార్ గద్దెనెక్కినప్పటి నుంచి ప్రజాస్వామ్య, పార్లమెంటరీ విలువలు, సాంప్రదాయాలపై దాడి చేస్తూ వస్తోంది. తాజాగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా ఉన్న దేశంలో ప్రజాస్వామ్య సాంప్రదాయానికి మోడీ సర్కార్ పాతర వేసింది. సాధారణంగా భారతదేశాన్ని ఎవరు సందర్శించినా, ప్రతిపక్షనేత సమావేశం నిర్వహించే సంప్రదాయం ఉంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వరకు కూడా ఇలానే జరిగింది. ఇతర దేశాల అధ్యక్షులతో, నేతలతో ప్రతిపక్ష నేతల భేటీలు జరగడం సర్వసాధారణం. ఇతర దేశాల నేతలు భారతదేశంతో పర్యటించినప్పుడు, అలాగే ప్రతిపక్ష నేతలు ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు ఆయా దేశాల నేతలతో ప్రతిపక్ష నేత భేటీ అవుతుంటారు. అంతేకాకుండా అది ఎప్పటి నుంచో వస్తోన్న ప్రజాస్వామ్య సాంప్రదాయం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నేతలను కలవవద్దని ఇతర దేశాల నేతలకు, ప్రముఖులకు చెప్పింది” అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”సాధారణంగా, విదేశాల నుంచి వచ్చే ఎవరైనా ప్రతిపక్ష నాయకుడిని కలవడం ఒక సంప్రదాయం. అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల కాలంలో కూడా ఇది జరిగింది. కానీ నేడు, విదేశీ ప్రముఖులు, లేదా నేను విదేశాలకు వెళ్ళినప్పుడు, ప్రతిపక్ష నాయకుడిని కలవవద్దని ప్రభుత్వం వారికి సలహా ఇస్తుంది. ఈ విషయాన్ని మాకు ఆయా దేశాల నేతలే చెప్పారు”అని విమర్శించారు. ”మాకు అందరితో సంబంధాలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు భిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. మేము భారతదేశానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తాం. ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు. ప్రతిపక్షం బయటి నుంచి వచ్చే వారిని కలవాలని ప్రభుత్వం కోరుకోవడం లేదు. మోడీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నియమాన్ని పాటించవు. ఇది వారి అభద్రత” అని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ ఆరోపణలపై కాంగ్రెస్ నేత శశి థరూర్ స్పందిస్తూ ”ప్రతిపక్ష నేత తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించాలని నేను భావిస్తున్నాను” అని అన్నారు. ”ప్రజాస్వామ్యంలో దేశాన్ని సందర్శించే ప్రముఖులు అందరినీ కలవడం మంచిది. ఇది ఒక ముఖ్యమైన సందర్శన అని నేను భావిస్తున్నాను. రష్యా, చైనా, అమెరికాలతో మన దేశం అనేక ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. నిబంధనలను నిర్ణయించడానికి మనకు సార్వభౌమ స్వయంప్రతిపత్తి ఉండాలి. ఆ స్ఫూర్తితో మనం రష్యా, యూఎస్, చైనాతో వేర్వేరు సమయాల్లో మంచి సంబంధాలను కొనసాగించామని, భిన్నమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నామని నేను నమ్ముతున్నాను. అధ్యక్షుడు పుతిన్ ఇక్కడ ఉన్నప్పుడు సంతకం చేయగల కొన్ని ఒప్పందాలను రూపొందించడానికి నిపుణుల స్థాయిలో ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి.
అది మనకు చాలా విలువైనది. రక్షణ సహకారం చాలా ముఖ్య మైనది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ ప్రయోజనాన్ని మనం ఇప్పటికే చూశాం. ఇప్పుడు మరిన్ని ఎస్-400, బహుశా ఎస్-500 గురించి చర్చలు జరుగుతున్నాయి. మన సైన్యం కోసం మొబిలిటీ ఒప్పందం జరిగే అవకాశం ఉంది. సైన్యంలోకి మన ప్రజలు వెళ్లి చివరికి ఒత్తిడికి గురయ్యే పరిస్థితిని మేము కోరుకోవడం లేదు. ఈ విషయాలు ఎలా జరుగుతాయనే దానిపై కొంత అధికారిక ఒప్పందం ఉండాలి. చర్చించాల్సినవి చాలా ఉన్నాయనడంలో సందేహం లేదు. మన ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మంచి సంభాషణ జరుపుతారని నేను నమ్ముతున్నాను. ప్రతిపక్ష నేత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించాలని నేను భావిస్తున్నాను” అని అన్నారు.
ప్రజాస్వామ్య సాంప్రదాయానికి పాతర
- Advertisement -
- Advertisement -



