ఉద్యోగుల నమోదు ప్రోత్సాహక పథకం
ఈఎస్‌ఐసీ రీజినల్ డైరెక్టర్ రాజీవ్ లాల్ వెల్లడి
నవతెలంగాణ – హైదరాబాద్
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ) ఉద్యోగ, కార్మికుల వైద్య సంరక్షణ కోసం నమోదు ప్రోత్సాహక పథకం ‘స్ప్రీ’ని ఆవిష్కరించినట్టు తెలిపింది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 కింద ప్రవేశపెట్టబడిన ఈఎస్‌ఐ పథకం భారతదేశంలో అత్యంత సమగ్రమైన సామాజిక భద్రతా చట్టాలలో ఒకటని ఆ సంస్థ రీజినల్ డైరెక్టర్ రాజీవ్ లాల్ ఓ ప్రకటనలో తెలిపారు. అనారోగ్యం, ప్రసూతి, వైకల్యం, ఉద్యోగ రీత్యా ప్రమాదం కారణంగా మరణం వంటి వివిధ ఆకస్మిక పరిస్థితుల నుంచి వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు సామాజిక ఆర్థిక రక్షణ కల్పించే లక్ష్యంతో దీనిని రూపొందించారన్నారు. ఈ పథకం బీమా చేయబడిన వ్యక్తులకు, వారిపై ఆధారపడిన వారికి వైద్య సంరక్షణ కల్పిస్తుందన్నారు. కష్ట సమయాల్లో ఆర్థిక స్థిరత్వం పొందేలా చేస్తుందన్నారు.
ఈఎస్‌ఐ పరిధిని విస్తరించడానికి ఇటీవల యజమానులు, ఉద్యోగుల నమోదు ప్రోత్సాహక పథకం స్ప్రీ-2025 ప్రారంభించిందన్నారు. ఇది ఈఎస్‌ఐసీలో నమోదు చేసుకోని యజమానులు , అర్హత ఉన్న ఉద్యోగులందరినీ స్వీయ నమోదు కోసం ప్రోత్సహించడానికి రూపొందించబడిందన్నారు. ఈ ప్రోత్సాహక పథకం ఈ ఏడాది జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందన్నారు. స్ప్రీ-2025 కింద 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులను నియమించే కర్మాగారాలు, దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, రవాణా సంస్థలు, ప్రయివేట్ సంస్థలు మొదలైన వాటిని నిర్వహించేవారు ఈఎస్‌ఐసీ పోర్టల్, శ్రమ్ సువిధ పోర్టల్, ఎంసీఏ పోర్టల్ ద్వారా తమ సంస్థలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని రాజీవ్ లాల్ తెలిపారు. సరళమైన ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా చేసుకోవచ్చన్నారు. ఉద్యోగ రీత్యా ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు పరిహారం, అర్హత గల కార్మికుల పిల్లలు ఈఎస్‌ఐసీ వైద్య, దంత కళాశాలలలో వైద్య విద్యా కోర్సులలో రిజర్వేషన్లు పొందగలరన్నారు.
ఈ పథకం ప్రస్తుతం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 668 జిల్లాల్లో అమలులో ఉందన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఈఎస్‌ఐ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 19.16 లక్షల మంది కార్మికులు, 5.37 లక్షల మంది మహిళా కార్మికులు, 1.36 లక్షల మంది యజమానులు, మొత్తంగా 76.64 లక్షల లబ్ధిదారులు ఉన్నారన్నారు. ఈ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీలు, 10 డీసీబీఓలు, 8 బ్రాంచ్ ఆఫీసుల ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందిస్తుందన్నారు. అదనంగా హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మౌలిక సదుపాయాలు, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, సమర్థవంతమైన పరిపాలనా యంత్రాంగాల మద్దతుతో తెలంగాణ అంతటా తమ సేవలను విస్తరించడంలో ఈఎస్‌ఐ కార్పొరేషన్ అంకితభావంతో ఉందని రాజీవ్ లాల్ తెలిపారు.
వైద్య సంరక్షణకు ఈఎస్‌ఐ స్ప్రీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



