Friday, December 5, 2025
E-PAPER
Homeజాతీయంప్రజా సమస్యలపై పోరు

ప్రజా సమస్యలపై పోరు

- Advertisement -

జనవరి 5,6 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు
‘ఉపాది’óపై కేంద్రం నిరంతర దాడి
నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి
బలవంతపు భూసేకరణ ఆపాలి.. స్మార్ట్‌ మీటర్లు వద్దు
వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల పిలుపు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు, ప్రజల సమస్యలపై పోరుకు వ్యవసాయ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. జనవరి 5, 6 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. గురువారంనాడిక్కడ అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మికుల సంఘాల ఐక్య సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు బి. వెంకట్‌, గోరియా, విక్రమ్‌ సింగ్‌, శ్రీనివాస్‌, కర్నల్‌ సింగ్‌, దేవేందర్‌ సమావేశ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంపై మోడీ సర్కార్‌ నిరంతరం దాడి చేస్తోందని విమర్శించారు. యూపీఏ హయంలో కేంద్ర బడ్జెట్‌లో 4 శాతం నిధులు ఖర్చు చేస్తే, ఇప్పుడు మోడీ సర్కార్‌ 1.37 శాతానికి కోత పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్‌ అనుసంధానంతో కోటి ఉపాధి హామీ జాబ్‌ కార్డులను, ఏడు కోట్ల మంది ఉపాధి కూలీలను రద్దు చేసిందని అన్నారు.

చాలా ప్రాంతాల్లో మూడు నుంచి, ఆరు నెలల పాటు వేతనాలు అందలేదని చెప్పారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా హాజరు పద్ధతి అమలు చేస్తున్నారని, దీనితో కోట్ల మంది అవస్థలు పడుతున్నారని తెలిపారు. కొలతల వారీగా వేతనాలు ఇస్తున్నారనీ, అలాంటప్పుడు రెండు పూటల హాజరు ఎందుకో తెలియడం లేదని అన్నారు. ఎన్‌ఎంఎంఎస్‌ పేరుతో అమలు చేస్తున్న పోటీల పద్ధతి కోట్లాది మంది ప్రజలను ఉపాధి నుంచి వెళ్లగొడుతుందని వివరించారు. ఈకేవైసీ పేరుతో లక్షల మంది ఉపాధి కార్డులు రద్దు చేస్తున్నారని విమర్శించారు. అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 14 మధ్య ఒక్క నెల వ్యవధిలో 27 లక్షల మంది ఉపాధి కూలీలను రద్దు చేశారన్నారు. ఉపాధికి కేంద్ర బడ్జెట్‌లో రూ.2.50 లక్షల కోట్లు కేటాయించాలని, ఈకేవైసీ, రెండు పూటల ఫొటోస్‌ అప్లోడ్‌ వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రోజువారీ వేతనం రూ.600కు పెంచి, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి కల్పించాలన్నారు.

శ్రామిక వర్గం సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలనీ, కనీస వేతనం రూ. 25 వేలకు తగ్గకుండా ఉండాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పేరుతో పేదల భూములను లాక్కోవడం ప్రభుత్వ విధానంగా మారిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల సాగు భూములు బలవంతంగా లాక్కుంటున్నారనీ, పాలకులే భూకబ్జాకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్‌ విధానం చట్టబద్దమైందని విమర్శించారు. బలవంతపు భూసేకరణ ఆపాలని, పేదల భూములను స్వాధీనం చేసుకోవడం ఆపాలని డిమాండ్‌ చేశారు. సాధారణ రైతులు, గ్రామీణ పేదలు స్మార్ట్‌ మీటర్స్‌తో ఎక్కువగా నష్టపోయే ప్రమాదముందని అన్నారు. ఉచిత విద్యుత్‌ ఉండదని, రైతుల కరెంటు మీటర్లకు మీటర్స్‌ బిగిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీ రద్దు అవుతుందని, ఉచిత కరెంటు కాకుండా స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లు బిగించి అధిక ఛార్జీలు వసూలు చేస్తారని విమర్శిం చారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు శ్రమ జీవుల నడ్డి విరుస్తున్నాయనీ, అందుకే ప్రజలంతా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -