నవతెలంగాణ-హైదరాబాద్: మధురై కార్తీక దీపం వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బిజెపిపై తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదంపై శుక్రవారం స్టాలిన్ మధురై నగరంలో అభివృద్ధి కావాలా? లేక రాజకీయాలు కావాలా అనేది ప్రజలే నిర్ణయిస్తారు అని అన్నారు. తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపం స్తంభం పైకి వెళ్లి దీపాన్ని వెలిగించాలని ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కొండపై చారిత్రాత్మక సుబ్రమణ్యస్వామి ఆలయం, కాశీ విశ్వనాథన్ ఆలయం, 17వ శతాబ్దపు మసీదు అయిన సిక్కిందర్ బాదుషా దర్గా కూడా ఉన్నాయి.
ఒక మితవాద కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జి.ఆర్ స్వామినాథన్ పిటిషనర్ కోరికను అనుమతించారు. పిటిషనర్‌తోపాటు మరో పదిమందిని తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీప స్తంభంపై వెళ్లి కార్తీక దీపాన్ని వెలిగించడానికి అనమతినిచ్చిన మధురై బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. అయితే దీనిపై డిఎంకె ప్రభుత్వం స్పందించలేదు. దీంతో గురువారం మధురైలో బిజెపి నేతలు ఆందోళన చేశారు. పవిత్ర కార్తీక దీపం వెలిగించడానికి కోర్టు ఇచ్చిన ఆదేశాలను డిఎంకె ధిక్కరించిందని, హిందువుల విశ్వాసాలు, భక్తుల నమ్మకాల్ని పట్టించుకోవడం లేదు అని బిజెపి అధికార ప్రతినిధి సిఆర్ కేశవన్ స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
కాగా, తాజాగా ఈ వివాదంపై స్టాలిన్ స్పందించారు. ‘మధురైకి అభివృద్ధి రాజకీయాలు అవసరమా లేక రాజకీయాలు అవసరమా? అనేది ప్రజలే నిర్ణయిస్తారు. మెట్రో రైలు, ఎయిమ్స్, కొత్త కంపెనీలు, ఉద్యోగాలు.. మధురై అభివృద్ధి కోసం అక్కడ నివసించే ప్రజలు కోరుకుంటున్నవి ఇవే’ అని స్టాలిన్ శుక్రవారం ఎక్స్ పోస్టులో బీజేపీకి కౌంటరిచ్చారు.



