నవతెలంగాణ – మల్హర్ రావు
సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం నానా తంటాలు పడుతుంటే.. ‘మద్య ‘తుదారులు వారికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారట. సాయంత్రమైతే సోపత్గా ళ్లకు దావత్లు ఇవ్వడం గ్రామాల్లో పెద్ద టాస్క్ గా మారింది. మద్దతునిస్తున్నారు కదా అని కాస్త చల్లబరుద్దాంలే అనుకుంటే చలికాలం చల్లదనం వద్దన్నా..మనోళ్లకు కిక్ రావాలంటే వేడి పుట్టించాల్సిందే..హాట్ లేకపోతే హర్ట్ అవుతారని షరుతు పెడుతున్నారట. సర్లే ఏం చేద్దాం బరిలోకి దిగిన తర్వాత తప్పుతుందా అనుకుంటూ..తక్కువ ఖర్చుతో వేడి పుట్టిందాంలే అను కుంటున్న అభ్యర్థులకు మద్దతుదారులు మాత్రం.. అన్నా మనోళ్లు కొంచెం కాస్ట్రీనే.. ఏదిబడితే అది నడ్వదు.. బ్రాండ్ మంచిది అయితేనే వర్కవుట్ ఐతది..లేకపోతే మళ్లీ నారాజ్ అవుతారు..ఖర్చులో ఖర్చు మంచి బ్రాండే తెప్పియ్యమంటూ జిగిరీ దోస్తులు కాస్ట్ సలహాతో పాటు బ్రాండ్ల పేరు జాబితానే పంపుతుండడంతో అభ్యర్థులకు దిక్కుతోచడం లేదు.
అన్నా అవతలోడు మంచి బ్రాండ్లు ఇస్తున్నాడే మనం అంతకుమించి ఇవ్వాల్సిందే, లేకపోతే మన ఇజ్జత్ పోతదని.. తోటివాడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకోవాలే అన్నట్లు లేని భయాన్ని కలిగిస్తుండడంతో పోటీదారులు మాత్రం నిండా మునుగుతున్నాం.. ఇక చలేంటి.. వేడే పుట్టిద్దాం అంటూ గొణుక్కుంటూనే మద్దతుదారుల బ్రాండ్ కోరికలు తీర్చుతున్నారు.కొన్ని గ్రామాల్లో అందుబాటులో ఉన్న బెల్ట్ షాపుల వద్ద ఖాతా పుస్తకాలే ఓపెన్ చేశారట. సందట్లో సడేమియా అన్నట్లు కొందరు ఉదయం పూట ఒక దగ్గర, సాయంత్రం మరో దగ్గర తమ మద్దతు తెలుపుతూ అటూ ఇటూ తెగ తిరుగుతున్నారట.



