సర్పంచ్, వార్డు సభ్యులుగా 50 శాతానికి పైగా యూత్
నవతెలంగాణ – మల్హర్ రావు
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ఆసక్తి చూపుతోంది.నేటితో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇప్పటికే దాఖలు చేసిన నామినేషన్లలో.మండల వ్యాప్తంగా సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యులుగా యువత 50 శాతానికి పైగా బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. యువత క్రీడలు, ఉద్యోగాలు, వ్యాపారాలతో పాటు రాజకీయాల్లోనూ చైతన్యం ప్రదర్శిస్తున్నారు.చదివిన వారితో పాటు పలువురు ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నవారు సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికల బరిలో దిగారు.గతంలో పెద్దలు పోటీచేస్తే ప్రచారంలో భాగ స్వాములయ్యే యువత.. ప్రస్తుతం పెద్దల సహకారంతో ప్రత్యక్షంగా పోటీలో నిలుస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా ప్రచారం…
పంచాయతీ ఎన్నికలలో యువత పోటీ చేయడమే కాకుండా గెలుపే లక్ష్యంగా తమదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. సాంకేతికతతో పోటీపడుతున్న ప్రపంచంలో సోషల్ మీడియాలో ఆకట్టుకునే విధంగా తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థి పేరు, గ్రామం పోటీ చేస్తున్న పదవితో పాటు తదితర వివరాలతో పోస్టర్లు తయారు చేస్తున్నారు. అదేవిధంగా వీడియోలో రూపొందించి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుస్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.



