-అభ్యర్థులకు సీఐ శ్రీను సానుకూల హెచ్చరిక
-ఎన్నికల ప్రవర్తన నియామవళిపై అవగాహన సదస్సు
నవతెలంగాణ-బెజ్జంకి
పుష్ప-1,పుష్ప-2 సినిమాల వలే ఓటర్లను మద్యం,నగదుతో ప్రలోభాలకు గురిచేస్తూ ఎన్నికల ప్రవర్తన నియామవళి నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం పోలీస్ శాఖ పుష్ప-3 చూపిస్తుందని సీఐ శ్రీను అభ్యర్థులకు సానుకూలంగా హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని సత్యార్జునా గార్డెన్ యందు మండలంలోని అయా గ్రామాల్లో స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియామవళిపై ఎస్ఐ సౌజన్య అధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
సీఐ శ్రీను హజరై ఎన్నికల ప్రవర్తన నియామవళిపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు.మండల కేంద్రంతో పాటు గుండారం,బేగంపేట,వడ్లూర్,లక్ష్మీపూర్ గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించామని.. క్రీడల్లో.. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. అభ్యర్థులందరూ బేషజాలకు వెళ్లకుండా ఐక్యతతో సమస్యాత్మక పల్లేలను..శాంతి పల్లేలుగా తీర్చిదిద్దాలని సూచించారు.ఎన్నికలు ముగిసే వరకు పటిష్టమైన నిఘా ఏర్పాటుచేశామని నగదు,మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయ్యొద్దని సూచించారు. ఎన్నికల ఫలితం ప్రకటించిన అనంతరం ఎన్నికైన అభ్యర్థులందరూ ఓటింగ్ కేంద్రాల్లోనే ఉండాలని ఎస్ఐ సౌజన్య సూచించారు.ఎంపీడీఓ ప్రవీన్,ఎన్నికల అధికారులు,అభ్యర్థులు హజరయ్యారు.



