నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గ్రామపంచాయతీ ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంత రావు అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మొదటి విడతలో పోలింగ్ జరిగే 6 మండలాల్లో శుక్రవారం ఉదయం ఓటు హక్కు అవగాహన పై సంబంధిత స్పెషల్ ఆఫీసర్స్ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండల కేంద్రాల్లో మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. కళాకారుల చేత ఓటు హక్కు పై ఓటర్లకు అర్థం అయ్యేలా ప్రదర్శనలు ఇచ్చారు.జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే ఆలేరు , ఆత్మకూరు, బొమ్మలరామారం,రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో ఈ నెల 11 న పోలింగ్ జరుగుతుందని,(6) మండలాల్లోని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి సూచించారు. మీ గ్రామాల్లో ఎన్నికల్లో నిలబడే వ్యక్తులు మిమ్మల్ని ఎలాంటి ప్రలోభాలకి గురిచేసినా ఎవరు తమ ఓటు ని అమ్ముకోకుండా నిజాయితీతో గ్రామాల అభివృద్ధి కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలన్నారు.
నేను ఓటు వేయకపోతే ఏమౌతుంది? నా ఒక్క ఓటుతో ఏమైనా మార్పు వస్తుందా అని ఏ ఒక్క ఓటరు కూడా అనుకోవద్దని, ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు.మీ ఒక్క ఓటుతో గెలుపు ఓటములు నిర్ణయించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమాల్లో బొమ్మల రామారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డి ఆర్డీఓ నాగిరెడ్డి, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రాజాపేట మండల కేంద్రంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి , ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జెడ్పీ సీఈఓ శోభారాణి , ఆత్మకూరు, తుర్కపల్లి మండల కేంద్రాల్లో అడిషనల్ డిఆర్డీఓ లు జంగారెడ్డి, సురేష్ ల ఆధ్వర్యంలో స్థానిక మండలాల తహసీల్దార్ లు, ఎంపీడీఓ లు పాల్గొన్నారు.



