Saturday, December 6, 2025
E-PAPER
Homeజాతీయంరైల్వేలో కానరాని సమయపాలన

రైల్వేలో కానరాని సమయపాలన

- Advertisement -

ప్రయాణికుల సహనానికి పరీక్ష
నామమాత్రంగానే ఆధునీకరణ పనులు

న్యూఢిల్లీ : తన డివిజన్లలో 90 శాతానికి పైగా సమయపాలన పాటిస్తున్నాయని మార్చిలో రైల్వే మంత్రిత్వ శాఖ గొప్పగా ప్రకటించుకుంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఆ ప్రకటనలో వాస్తవం కూడా అంతే ఉంటుంది. రైల్వేలో సమయపాలన అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించని విషయమన్న సంగతి అందరికీ తెలిసిందే. రైలు రాకడ…ప్రాణం పోకడ ఎవరికీ తెలియదన్నది ఓ నానుడి. అది ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతుంటుంది. డీజిల్‌ లోకోమోటివ్‌లపై ఆధాపడుతుండడం, సిగల్‌ వైఫల్యాలు, రద్డీ…ఇవి రాకపోకల్లో జాప్యానికి కారణాలని అధికారులు చెబుతుంటారు. 2023-24లో భారతీయ రైల్వేలు తన 69,000 కిలోమీటర్ల నెట్‌వర్క్‌లో 6.9 బిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. అంటే రోజుకు సగటున 1.9 కోట్ల మంది రైళ్లలో రాకపోకలు సాగించారన్న మాట. ఇంతటి విస్తృత వ్యవస్థ కలిగిన రైల్వేలలో సమయపాలన కొరవడడం విచారించదగిన విషయమే.

ఈ లోపాలు కూడా కారణమే
సిగల్‌ వైఫల్యాలు, ట్రాక్‌ దెబ్బతినడం, రద్దీ, రోలింగ్‌ స్టాక్‌ సమస్యలు వంటి ఇతర లోపాలు కూడా రైల్వే వ్యవస్థలో సమయపాలన తప్పడానికి కారణమవుతున్నాయి. కానీ వీటికి సంబంధించిన డేటా అందుబాటులో లేదు. 2019లో అప్పటి రైల్వే మంత్రి పీయుష్‌ గోయల్‌ లోక్‌సభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ అంతర్గత కారణాలతో సమయపాలన తప్పుతోందని తెలిపారు. లోకోమో టివ్‌లు, ఓవర్‌-హెడ్‌ ఎలక్ట్రికల్‌ కేబుల్స్‌, ట్రాక్స్‌, సిగల్స్‌, వ్యాగన్లకు సంబంధించి పరికరాల వైఫల్యం కన్పిస్తోందని ఆయన వివరించారు. తాజా డేటా ప్రకారం రైల్వేల సమయపాలన సూచీ 2020లో 94.17 ఉండగా 2023లో 73.62కు తగ్గింది. ఏదైనా రైలు దాని షెడ్యూలు సమయం కంటే పదిహేను నిమిషాలలోపు వస్తే ఈ సూచిక దానిని సమయపాలనగా పరిగణిస్తుంది. అయితే జర్మనీలో
ఈ సూచీ ఐదు నిమిషాలుగా, బ్రిటన్‌లో పది నిమిషాలుగా, జపాన్‌లో అయితే కొన్ని సెకన్లుగా ఉంది. ఆయా దేశాలతో పోలిస్తే మన రైల్వేలు అనుసరిస్తున్న ప్రమాణం చాలా తక్కువగా ఉంది.

సామర్ధ్యానికి మించి కిక్కిరిసి…
భారతీయ రైల్వేలు ఇప్పటికీ బ్రిటీష్‌ కాలం నాటి మౌలిక సదుపాయాల పైనే ఆధారపడుతున్నాయి. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్తగా ట్రాక్‌లను నిర్మించడం లేదు. గత పదిహేను సంవత్సరాలలో రైల్వేల నెట్‌వర్క్‌లో విపరీతమైన రద్దీ కన్పిస్తోంది. అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దేశంలో అత్యంత రద్డీగా ఉండే రైలు మార్గాలలో 80 శాతానికి పైబడిన రూట్లు ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తున్నాయి. వీటిలో నడుస్తున్న రైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. కనీసం ఇరవై రెండు శాతం రైళ్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. అవి తమ సామర్ధ్యానికి మించి 150 శాతం రద్దీతో నడుస్తున్నాయని జాతీయ రైలు ప్రణాళిక చెబుతోంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలలో నడిచే రైళ్ల్లలో దాదాపు సగం రైళ్లు సామర్ధ్యానికి మించి నడుస్తున్నాయి. మొత్తంగా చూస్తే దేశంలో తిరిగే 45 శాతం రైళ్లలో ప్రయాణికుల రద్దీ వాటి సామర్ధ్యంతో పోలిస్తే 70 శాతం కంటే తక్కువగానే ఉంటోంది. ఒక శాతం రైళ్లు మాత్రం సామర్ధ్యానికి మించి 150 శాతం రద్దీతో నడుస్తున్నాయి.

రిలీఫ్‌ ఇంజిన్‌ వచ్చే వరకూ అంతే
2023 ఏప్రిల్‌ నుంచి 4,400 సందర్భాలలో డీజిల్‌ లోకోమోటివ్‌లు సమయపాలనను తప్పాయి. అంటే రోజుకు సగటున ఐదు డీజిల్‌ బండ్లు ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఇది రైల్వే బోర్డు అందజేసిన అధికారిక సమాచారమే. డీజిల్‌ ఇంజిన్‌ పనిచేయకపోతే రైలు మధ్యలోనే ఆగిపోతుంది. సాంకేతిక లోపం తలెత్తినా నిలిచిపోతుంది. కొన్ని సార్లు వంతెనల మీదే ఆగుతుంది. దీంతో మొత్తంగా ఆ లైనులోనే రాకపోకలు స్తంభిస్తాయి. రిలీఫ్‌ ఇంజిన్‌ వచ్చే వరకూ రైలు కదలదని భారతీయ రైల్వేల మాజీ సీఈఓ, రైల్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ సంపాదకుడు సూశీల్‌ లూత్రా చెప్పారు. అయితే వందే భారత్‌ వంటి రైళ్లలో ఉన్న ప్రత్యేక వ్యవస్థ కారణంగా ఒక యూనిట్‌ విఫలమైనప్పటికీ మిగిలిన వాటితో రైలు ముందుకు కదులుతుందని ఆయన తెలిపారు.

సిగలింగ్‌ వైఫల్యాలు కూడా…
రైళ్ల రాకపోకల్లో ఆలస్యానికి, ప్రమాదాలకు సిగలింగ్‌ వైఫల్యాలు కూడా కారణమవుతున్నాయి. ఈ వైఫల్యాలు రైల్వేల భద్రత, విశ్వసీయతకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. ఆటోమేటిక్‌ వ్యవస్థల్లో తరచుగా సిగలింగ్‌ వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని రైల్వే భద్రతా కమిషన్‌ ఇటీవల ఎత్తిచూపింది. మరోవైపు నిర్వహణా లోపాలు కూడా రైల్వేలకు శాపంగా మారుతున్నాయి.

పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌లు
బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌ వంటి ప్రధాన జంక్షన్లలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటోంది. 30 కిలోమీటర్ల దూరం ప్రయాణానికే రెండు గంటల సమయం పడుతోంది. 2021-22 నుంచి 2023-24 వరకూ రెండు సంవత్సరాల వ్యవధిలో ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ల సంఖ్య 26 శాతం పెరగ్గా డీజిల్‌ లోకోమోటివ్‌లు ఏడు శాతం తగ్గాయి. 2021-22లో దేశంలో స్టీమ్‌ లోకోమోటివ్‌లు 39 ఉండగా 2023-24లో 38 ఉన్నాయి. అదే కాలంలో డీజిల్‌ లోకోమోటివ్‌ల సంఖ్య 4,747 నుంచి 4,397కు తగ్గగా ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌లు 8,429 నుంచి 10,675కు పెరిగాయి. 2023-24లో తిరిగిన ప్యాసింజర్‌ రైళ్లలో 15 శాతం, సరకు రవాణా రైళ్లలో 20 శాతం డీజిల్‌ ఇంజిన్లతోనే నడిచాయి. డీజిల్‌ లోకోమోటివ్స్‌ స్థానంలో ఎలక్ట్రిక్‌ ఇంజిన్లను ప్రవేశపెట్టే ప్రక్రియ నత్తనడక నడుస్తోంది. దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణం. దేశంలో డీజిల్‌ లోకోమోటివ్‌ల తయారీ 2016-17లోనే దాదాపుగా నిలిచిపోయింది. అయితే ఇప్పటికీ పరిమిత సంఖ్యలో వాటిని ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -