”మతములన్నియు మాసిపోవును…. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” అని గురజాడ అప్పారావు చెప్పిన మాటలు ఎప్పటికైనా నిజమవుతాయని చాలామందికి ఒక ఆశ ఉండేది. కానీ, అది సాధ్యపడే అవకాశ ముందా? లేదనే అనిపిస్తున్నది. దేశాల సరిహద్దులు చెరిగిపోయి ప్రపంచం ఒక కుగ్రామమై అందరికీ అన్ని రకాల వస్తుసేవలు అందుబాటులోకి వస్తాయి, ఇక మిగిలింది తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే తేడా లేని సహపంక్తి భోజనాలే అన్నంత పెద్దఎత్తున ప్రపంచీకరణ నినాదాలు వినిపించాయి. భారతదేశంలో మతసామరస్యం దెబ్బతిన్నది ఒకే సందర్భం. అది 1991-92 కాలం. జాతుల విధ్వంసం బయటి శత్రువుల నుండి కాక అంతర్గత విద్వేశాల నుండి జరిగిందని చరిత్ర చెబుతోంది. అలాంటి ప్రమాదానికి నాంది పడింది అప్పుడే. అది నేటికీ కొనసాగుతూ విభజన రేఖను గీస్తుండటమే అతి పెద్ద సమస్య. రాజ్యం యొక్క కార్యనిర్వహణ విభాగం తన కాళ్లు తానే విరగొట్టుకొని, కాగల కార్యానికి ప్రేక్షకపాత్ర వహిస్తున్నప్పుడు కూలిపోయింది బాబ్రీ మసీదు కాదు, భారత రాజ్యాంగ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం. ఆ నమ్మకంపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి కాబట్టే దాన్ని ఒక చీకటి దినం (బ్లాక్‌డేగా) దేశమంతా భావిస్తోంది. ఆ రోజు బాబ్రీ మసీదు కూల్చివేత న్యాయ సమ్మతం కాదని, దాన్ని కచ్చితంగా నివారించడానికి అవకాశం ఉండేదని సుదీర్ఘ అధ్యయనం తరువాత లిబర్హాన్ కమిషన్ స్పష్టమైన తీర్పును వెలువరించింది. అంతేకాదు, జరిగిన తప్పిదం ఒక ప్రమాదం కాదని, ఒక సమూహం మూక దాడితో సిద్ధమవుతుందని ముందస్తు సమాచారమున్నప్పటికీ సంబంధిత రాష్ట్రం ప్రేక్షకపాత్ర వహించడం వల్ల మాత్రమే అది జరిగిందని పేర్కొంది. ఈ మూడు దశాబ్దాల కాలంలో అనేకానేక తీర్పుల అనంతరం కూడా బాబ్రీ మసీదు కూల్చివేత సరైనది కాదని అనేక సందర్భాల్లో న్యాయవ్యవస్థలు అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి. అంతే కాకుండా జస్టిస్ రంజన్ గొగొయి ఆధ్వర్యంలో వెలువడిన తీర్పులో కూడా ఎక్కడా పురాతన మందిరాన్ని గురించిన ఆనవాళ్ల ప్రస్తావన చెయ్యకుండా ఆ ప్రాంతాన్ని వివాదాస్పద స్థలంగా చర్చించి తీర్పు ఇవ్వడం జరిగింది. తదనంతరం అక్కడ రామ మందిరం నిర్మాణం జరగడం ఇతర కార్యక్రమాలన్ని సాఫీగా కొనసాగుతున్నాయి. న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కారాన్ని పొందామని సంబరపడిపోతూ ఉండవచ్చు.కానీ మత సామరస్యానికి జరిగిన నష్టాలకు, సకలజనుల సామూహిక ప్రయాణానికి జరుగుతున్న కష్టాలకు కారణం సదరు కూల్చివేతనే అని గుర్తించి సరిదిద్దే ప్రయత్నాలు చేయకపోతే జరుపుకునే సంబరాలకు శాశ్వతత్వం లేనట్లే.
సమస్య మందిర నిర్మాణానికి సంబంధించినది కాదు, మసీదు కూల్చివేతకు సంబంధించినది. నేడు న్యూ ఢిల్లీలో హిందూ పురాతన ఆలయాన్ని కూల్చివేసి ఒక రాజకీయపార్టీ ఆఫీసుకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకుంటున్నారని అక్కడి కాలనీవాసులు సదరు కూల్చివేతను పూర్తిగా అడ్డుకున్నారు. అది పురాతన ఆలయమని, ప్రస్తుతం భక్తులు ఎక్కువమంది ఆలయానికి రావడం లేదని, ఎంత సర్దిచెప్పినా స్థానికులు వినడం లేదు. వారికి కావలిసింది వారి సెంటి మెంట్. ఇంతకుమించిన గుడి మరో ప్రదేశంలో కట్టిస్తూ ఉండవచ్చు. అయినా వినకుండా పెద్ద సంఖ్యలో ధర్నా చేస్తున్నారు. ఢిల్లీలో మెజారిటీ మనోభావాలుకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఉన్నప్పటికీ, కేంద్ర ఆధ్వర్యంలోని పోలీసులు సదరు దేవాలయాన్ని కూల్చొద్దని ఆందోళన చేస్తున్న వారందరినీ అరెస్ట్ చేశారు. ఈ అంశం కూడా బాబ్రీ మసీదు కూల్చివేతతో పోల్చకూడదని చెప్పలేం. అవి పెరిగి పెరిగి పెద్దవిగా మారవని ఆశించలేం. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిననాడు ఏయే ప్రదేశాలలో ఎలాంటి పురాతన కట్టడాలు ఆలయాలున్నాయో వాటిని యథాతథంగా కొనసాగించాలని చట్టాన్ని విధిగా అమలు పరిస్తే ఇలాంటివి ఉత్పన్నం కావు. న్యాయం మెజారిటీ అభిప్రాయానికి ప్రభావితం కాకూడదట. అలా జరిగినప్పుడు నమ్మకాలు చట్టాలపై, ప్రజల సామూహిక సాంస్కృతిక సహజీవనంపై స్వారీ చేస్తాయి. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. ఒక మహా నుభావుడు చెప్పినట్టుగా ”ఒక సూక్ష్మ ప్రదేశంలో జరిగిన అన్యాయం విశాల ప్రదేశానికి ప్రమాదం” (ఇన్ జస్టిస్ ఎనీవేర్ ఈస్ ది థ్రెట్ టూ జస్టిస్ ఎవ్రివేర్). మైనారిటీల మనో భావాలు మాత్రమే దెబ్బతిన్నాయి, మెజారిటీ వారికి చాలా సంతృప్తిగా ఉన్నదనుకుంటే పొరపాటే. ఇప్పుడు దెబ్బతిన్న మైనారిటీ మనోభావాల బాధలు తప్పకుండా వ్యాపిస్తాయి, ప్రతీకారానికి పరితపిస్తాయి!పర్యవసానాలు భవిష్యత్ తరాలకు ఆశని పాతంగా మరలేవని చెప్పలేం.
ఈ బ్లాక్ డే సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశంబీ కూల్చివేయబడింది మసీదు కాదు దేశ ఐక్యత. ఇప్పుడు నిర్మించబడుతున్నది కూడా ఒక సమూహ ఐక్యత మాత్రమే, సకలుర ఐక్యత కాదు. బాధాకరమైన అంశమే మంటే, అలాంటి సమ్మిళిత ఐక్యత కోసం ప్రయత్నాలు కూడా జరగడం లేదు. మందిర నిర్మాణంతోపాటు మసీదు నిర్మాణం కూడా అంగరంగ వైభవంగా నిర్మించి ప్రారంభిస్తే బాగుం డేదేమో అనే అభిప్రాయం అక్కడక్కడ వినిపించవచ్చు. అలాంటి ప్రయత్నాలు కూడా జరగవచ్చు. కానీ రాజకీ యంగా విపరీతమైన ద్వేష భావన పెరగడానికి 1992 మసీదు కూల్చివేత బాగా ఉపకరించింది. దాన్ని అదునుగా చేసుకుని అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ ప్రాబల్యాన్ని పొందిన తర్వాత అలాంటి విద్వేష భావననే ప్రధాన అస్త్రంగా పీఠాన్ని పదిలం చేసుకోవడానికి ఉపయోగించు కుంటుం డటం చాలా బాధాకరం. ఇలాంటి పరిపాలన ఎప్పటికైనా ప్రమాదకరమే. బాబ్రీమసీదు కూల్చివేత అనంతరం అస్తిత్వ రాజకీయాల పరంపర పెరిగి దేశమంతా విస్తృతమైంది. హైదరాబాద్‌కు మాత్రమే పరిమితంగా ప్రభావం కలిగిన ఏఐఎంఐఎం నేడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని సుస్థిరపరచుకున్నది. ఇప్పుడు రాజకీయాలు వారు- మనము అనే స్పష్టమైన విభజన రేఖతో నేరపబడు తున్నాయి. చాలా బాధాకరమైన అంశమేమిటంటే ఈ మత పరమైన ఏకీకరణలు జరుగుతున్న సందర్భంలో మునుపెన్నడూ లేనంతగా కుల ప్రాతిపదికన రాజకీయాలు విశృంకలత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. 1990 వరకు ఈ రకమైన అస్తిత్వ రాజకీయాల విశృంఖలత్వం ఏ మాత్రం ఉండేది కాదు. బాబ్రీ మసీదు తీర్పు వెలువడింది, మందిర నిర్మాణం జరిగింది, అంతా సవ్యంగా ఉందనుకున్న ప్పటికీ దేశంలో మతసామరస్యం పునరుద్ధరింపబడే అవకాశాలున్నాయా? ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా జరుగు తున్నాయా? అలాంటి ప్రయత్నాలు జరగకపోగా సదరు అస్తిత్వాలను పెంచి పెద్దగా చేస్తున్న పరిస్థితే కనిపిస్తున్నది.
ఇలాంటి అస్తిత్వమురికిని రాజకీయాలకు మాత్రమే పరిమితం చేయకుండా పరిపాలనకు ఆర్థిక వ్యవస్థకు కూడా అంటించారు. మంత్రి పదవులనుండి మామూలు స్థాయి వ్యవహారాల వరకు ఆస్తిత్వ గొట్టం లేనిదే మంట వెలగదు. గత దశాబ్ద కాలంగా, ముఖ్యంగా కోవిడ్ అనంతరం, మైనారిటీ సమూహాన్ని ద్వేషించే స్థాయి మరింత పెరిగిపోయింది. సోషల్ మీడియా ద్వారా విపరీతమైన దుష్ప్రచారం జరిపి ఈ ద్వేషాన్ని మరింత పెంచి పోషిస్తున్నారు. తద్వారా ముస్లిం మైనారిటీలు జరిపే వ్యాపారాలలో చాలా వరకు విద్వేషపూరిత ప్రభావానికి గురవు తున్నాయి. ముఖ్యంగా చిన్న చిరువ్యాపారులు రోడ్డు వెంట వ్యవహారాలు నడుపుకునేవారి జీవన స్థితిపై విపరీతమైన ప్రభావం పడింది. విద్యా వకాశాల్లో ముందే వెనుకబడి ఉండే ఈ తరగతి ఇలాంటి వివక్ష పెరిగిపోవడంతో మరింత క్షీణించే దుస్థితి ఏర్పడ నున్నది. ఇది ఎవరో కొందరు పనిగట్టుకొని చేస్తున్నారు, పైనుండి అలాంటి నిర్దేశాలు ఏమి లేవనే వాదన వినిపించవచ్చు. కానీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరి స్తున్న సందర్భాలూ స్పష్టంగా ఉన్నప్పుడు కింది స్థాయి ప్రజానీకం సామరస్యంగా ఉంటుందని ఆశించడం అవివేకమే అవుతుంది.
డిసెంబర్ 6ను బ్లాక్ డేగా భావించకుండా ఉండే పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటే అది రాజకీయ నిర్ణయాలతో ముడిపడి ఉన్నది. అనగా మత సామరస్య విధానాలకు శ్రీకారం చుట్టాలి. అలా జరగాలంటే మతతత్వ పార్టీగా ముద్రపడిన రాజకీయ పార్టీల్లో అన్య మతస్తు లకు కూడా స్థానాలు కల్పించాలి, ప్రోత్సహించాలి. ఇలా కోరు కోవడం అత్యాశే కావచ్చు! అలా కాకుండా ”ముస్లిం మైనారిటీలకు చేయూతగా నిలవడానికి ఏర్పడిన వక్ఫ్‌బోర్డు కార్యక్రమాల్లో ముస్లిమేతరులు అధికారులుగా నియమింప బడతారు, కానీ తిరుమల కొండపై కనీసం సఫాయి కర్మచారిలు కూడా ముస్లింలు ఉండడానికి వీల్లేదు” అంటూ పాటించే విధానాలతో మత సామరస్యం సాధ్యం కాదు. భారతదేశ ప్రజానీకంలో మత విద్వేషాలు వెర్రితలలు వేస్తున్న దృష్ట్యా అంతర్జాతీయంగా కూడా భారత జాతీయులపై దాడులు జరుగుతున్నాయి. భారతదేశంలోని అంతర్గత అంశా లకు అంతర్జాతీయ అంశాలకు సంబంధం లేదని కొట్టి పారేయలేం. ఇవి మరింత పెరిగి పెరిగి మొదటికే మోసాన్ని కలిగి స్తాయని కూడా విశ్వసించాల్సిందే. అందుచేత రాజకీయాలను మతం నుండి వేరుచేసి ప్రజలు చూడనంత కాలం అస్తిత్వ రాజకీయాలతో ప్రజల భవిష్యత్తును అధికార పీఠాధిపతులు బలి చేస్తూనే ఉంటారు.
(డిసెంబర్ 06 బ్లాక్ డే)
జి.తిరుపతయ్య
9951300016



