శ్రమ దోపిడీని సులభతరం చేయటానికి కేంద్రం కుట్ర : సీపీఐ(ఎం) రాజ్యసభపక్షనేత జాన్‌బ్రిట్టాస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ డిమాండ్ చేశారు. వ్యాపారాన్ని సులభతరం చేయడం పేరుతో ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లు వాస్తవానికి శ్రమ దోపిడీని సులభతరం చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంటులో చర్చ కూడా లేకుండానే కార్మిక చట్టాలను హడావిడిగా ఆమోదించారని విమర్శించారు. కార్మిక సంఘాల వ్యతిరేకత కారణంగా వాటిని సంవత్సరాలుగా అమలు చేయలేదని, కానీ ఇప్పుడు ఎటువంటి సంప్రదింపులు లేకుండానే లేబర్ కోడ్‌లు అమల్లోకి వచ్చాయని ప్రకటించారని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్‌లు దాదాపు 70 శాతం ఉపాధి సంస్థలను, అదే సంఖ్యలో కార్మికులను కార్మిక చట్టాల రక్షణ నుంచి తొలగిస్తాయని పేర్కొన్నారు. మోడీ హయాంలో నియామకాలు సులభతరం కావడం లేదని, అయితే కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగింపు సులభతరం అవుతుందని విమర్శించారు. సామూహిక తొలగింపుతో కార్మికులను ఉపాధి నుంచి నెట్టేవేసేందుకు మార్గం సుగమం చేసే వ్యవస్థగా మార్చబడిందని అన్నారు.
గతంలో, వంద కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న సంస్థల్లో తొలగింపు, మూసివేత సాధ్యం కాదని, ఇప్పుడు అది మూడు వందల మంది వరకు ఉన్న సంస్థలుగా సవరించారని అన్నారు. కార్మిక చట్టాలు కార్మికులు సమ్మె చేసే హక్కులను కూడా తిరస్కరిస్తున్నాయని తెలిపారు. దీనికి పరిస్థితులు కఠినతరం చేయబడ్డాయని అన్నారు. కార్మిక చట్టాలు యజమానుల ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తాయని, దశాబ్దాల పోరాటంతో కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను ఒకేసారి దొంగిలించారని విమర్శించారు. కార్మికుల సమాన అవకాశాల ఉమ్మడి జాబితాలో ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను ఆక్రమించుకుంటోందని దుయ్య బట్టారు. కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోకపోతే, చారిత్రాత్మక రైతుల పోరాటం లాంటి పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. కార్మికులు పెద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారని, పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపిలు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారని తెలిపారు. కార్మికులు ఐక్య ఆందోళన వైపు కదులుతున్నారని గ్రహించి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని జాన్ బ్రిట్టాస్ కోరారు. జాన్ బ్రిట్టాస్ లేవనెత్తిన లేబర్‌కోడ్‌లు ఉపసంహరించుకోవాలి డిమాండ్‌కు వామపక్ష ఎంపీలు మద్దతు ఇచ్చారు.
రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలి రాజ్యసభలో ప్రయివేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన జాన్ బ్రిట్టాస్
కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడంలో రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని ప్రతిపాదించే ఫ్రయివేట్ మెంబర్ బిల్లును సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 282లో ఈ సవరణను ప్రతిపాదించారు. దీనితో పాటు, బ్రిట్టాస్ వన్యప్రాణుల రక్షణ సవరణ బిల్లు, డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలో చేర్చబడిన అంశాలలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఉద్దేశించిన డబ్బును రాష్ట్ర బడ్జెట్‌తో ఖర్చు చేయాలని రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదిస్తుంది.
రాష్ట్రాలు ఈ పథకాల అమలును స్వతంత్రంగా ప్రణాళిక చేసుకోగలుగుతారు. రాష్ట్రం ఈ పథకాల బ్రాండింగ్‌ను కూడా నిర్వహించగలవు. ఇందులో, రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సవరణ సూచిస్తుంది. వన్యప్రాణుల రక్షణ సవరణ బిల్లు ప్రధాన లక్ష్యం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పరిమితమైన వన్యప్రాణులను పీడించే తెగుళ్లుగా ప్రకటించే హక్కు స్థితిని మార్చడం. వన్యప్రాణులు-మానవ సంఘర్షణను నిర్వహించడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలు కూడా ఈ బిల్లులో ఉన్నాయి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ సవరణ బిల్లు రాజ్యాంగంతో పౌరులకు హామీ ఇవ్వబడిన గోప్యతను కాపాడటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు బిల్లు వరుస సవరణలను ప్రతిపాదిస్తుంది. ఇప్పటికే ఉన్న చట్టాన్ని సకాలంలో నవీకరించే ప్రతిపాదనలను కూడా కలిగి ఉంటుంది.



