Saturday, December 6, 2025
E-PAPER
Homeజాతీయంభగ్గుమన్న విమానయాన ధరలు

భగ్గుమన్న విమానయాన ధరలు

- Advertisement -

ఇండిగో సర్వీసుల బంద్‌ ఎఫెక్ట్‌
పలు మార్గాల్లో రూ.20వేలకు టికెట్‌
ఇబ్బందుల్లో ప్రయాణికులు

న్యూఢిల్లీ : వరుసగా నాలుగు రోజులుగా ఇండిగో విమాన సేవల్లో నెలకొన్న అంతరాయం విమానయాన ధరలను నింగికంటేలా చేశాయి. సిబ్బంది కొరత, సాంకేతిక లోపాల కారణంగా శుక్రవారం ఒక్క రోజే దాదాపు 1000 విమానాలను రద్దు చేసింది. దీంతో కొన్ని మార్గాల్లో రానుపోనూ విమాన టికెట్‌ ధరలు ఏకంగా రూ.40,000కు పెరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే టికెట్‌ ధరలు దాదాపు రెండు, మూడు రెట్లు పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేలాది మంది ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. డిసెంబర్‌6 నాటి ప్రయాణానికి గానూ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎయిరిండియా టికెట్‌ కనీస ధర రూ.33,000గా ఉంది.

7వ తేదీకి ఢిల్లీ-చెన్నై ఎకానమీ క్లాస్‌ కనీస టికెట్‌ ధర రూ.53వేలుగా, ఢిల్లీ-హైదరాబాద్‌ కనీస టికెట్‌ ధర రూ.25,000గా ఉంది. ఈ ధరలతో పరిస్థితి స్పష్టమవుతోంది. అదే విధంగా దేశంలోనే అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ముంబయి-ఢిల్లీ మధ్య విమాన సర్వీసుల టికెట్‌ ధరలు అమాంతం ఎగిశాయి. ఈ రూట్‌లో రానుపోనూ టికెట్‌ ధరలు రూ.40 వేలు వరకు పలుకుతున్నాయి. సాధారణ సమయల్లో ఈ రూట్‌లో చివరి నిమిషంలో బుక్‌ చేసుకున్నప్పటికీ రూ.20వేలు మించదు. కానీ ఇప్పుడు చివరి నిమిషంలో బుకింగ్‌ ధరలు ఏకంగా రూ.60వేలకు చేరినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. ముంబయి-శ్రీనగర్‌లలో సాధారణ రోజుల్లో రూ.10వేలు ఉండే టికెట్‌ ధర.. ఇప్పుడు ఏకంగా రూ.62 వేలకు ఎగిసింది. రౌండ్‌ట్రిప్‌ అయితే దాదాపు రూ.92వేల వరకు వసూలు చేస్తోన్నారు.

ఎందుకు ఈ గందరగోళం..
బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ ఇండిగో దేశంలో రోజుకు దాదాపు 2,200 విమాన సర్వీసులను నడుపుతోంది. ఎయిరిండియాతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. అలాంటి ఎయిర్‌లైన్‌ ఇప్పుడు సాంకేతిక సమస్యలు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్‌ నియమాలు తదితర కారణాలతో దాదాపు 1000 విమానాలను రద్దు చేసింది. ఇంకా వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తోన్నాయి. గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటుంది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రవేశపెట్టిన నూతన ప్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్‌ (ఎఫ్‌డీటీఎల్‌) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్‌ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.

వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. ఒక్క రోజులో డ్యూటీ టైమ్‌ 12 గంటలు ఉండగా.. దీన్ని 10 గంటలకు తగ్గించారు. 14 రోజుల్లో మొత్తం పనిగంటలు 95కు మించకూడదు. ఇంతక్రితం ఇది 48 గంటలుగా ఉంది. వరుసగా రెండు రాత్రులు మించి సిబ్బందికి డ్యూటీలు వేయరాదు. రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు. ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్‌ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.

విచారణకు ఆదేశం..
కొత్త నిబంధనల అమలుకు ముందు నుంచే ఇండిగో సంస్థలో పైలట్ల కొరత ఉందని విమర్శలు ఉన్నాయి. కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిసినప్పటికీ సంస్థ తగినంత మంది సిబ్బందిని ముందుగానే నియమించుకోవడంలో లేదా వారికి శిక్షణ ఇవ్వడంలో విఫలమైందని పైలట్‌ సంఘాలు ఆరోపించాయి. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. మరోవైపు ఈ గందరగోళంపై ఉన్నతస్థాయి విచారణకు పౌర విమానయాన శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సేవల్లో అంతరాయానికి గల కారణాల విచారణ, బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మొత్తం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -