మెతుకుసీమలో గళమెత్తనున్న కార్మికవర్గం
రేపు భారీ బహిరంగ సభ
హాజరుకానున్న సీఐటీయూ జాతీయ అధ్యక్షులు హేమలత, సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
33 జిల్లాల నుంచి 600 మంది ప్రతినిధులు
మెదక్ జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ జెండావిష్కరణలు
జిల్లాలో భారీ ఏర్పాట్లు చేసిన ఆహ్వాన సంఘం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
మెతుకు సీమలో జరగనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు మెదక్ పట్టణాన్ని ముస్తాబు చేశారు. మహాసభల విస్తృత ప్రచారం కోసం మెదక్ పట్టణంలో వాల్ రైటింగ్, కరపత్రాలు, వాల్ పోస్టర్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని శ్రామిక మహిళలు మహాసభల జయప్రదానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో జరిగే రాష్ట్ర 5వ మహాసభలకు ఆహ్వాన సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. మూడు రోజుల పాటు జరిగే ప్రతినిధుల మహాసభకు మెదక్ జిల్లా కేంద్రంలోని వినాయక కన్వెన్షన్ హాల్‌ను సిద్ధం చేశారు. ఈ మహాసభల కు 33 జిల్లాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. 7వ తేదీన మధ్యాహ్నం మెదక్ చిల్ట్రన్ పార్క్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి అసంఘటిత రంగ కార్మికులు, స్కీం వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు.. తదితరులు తరలిరానున్నారు. జిల్లాలోని కార్మికులు మహాసభకు విరాళాలు ఇచ్చి సహకరిస్తున్నారు.
మెదక్ జిల్లాలో 21 మండలాలు, 73 సీఐటీయూ అనుబంధ సంఘాల సహకారంతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా 492 గ్రామ పంచాయతీల్లో సీఐటీయూ గ్రామ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ద్వారా నిధులు సేకరించడంతో పాటు ప్రచారమూ చేస్తున్నారు. అదే విధంగా సమకాలీన సమ స్యలపై సెమినార్లు జరిపారు. 7న నిర్వహించే బహిరంగ సభకు సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీఐటీయూ జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ హేమలత, తపస్‌సేన్, కోశాధికారి సాయిబాబు హాజరు కానున్నారు. అదే విధంగా రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఆపీస్ బేరర్స్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు.
మహాసభల సందర్భంగా సెమినార్ల నిర్వహణ..
మహాసభల సందర్భంగా సమకాలీన అంశాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సెమినార్లు నిర్వహించారు. లేబర్ కోడ్స్.. కార్మికులపై ప్రభావం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు బీడీ కార్మికులపై ప్రభావం, ప్రభుత్వ ఉద్యోగాలు – మధ్య తరగతి ఉద్యోగులపై ప్రభావం, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు- ప్రభుత్వాల కృషి, స్కీం వర్కర్ల సమస్యలు.. తదితర అంశాలపై సెమినార్లు, సదస్సులు నిర్వహించారు.
మెదక్‌లో సభ జరపడం కొత్త అనుభవం
అసంఘటిత కార్మికుల మధ్య సభ జరపడం సీఐటీయూకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. అసంఘటిత రంగ కార్మికులంతా సీఐటీయూనే తమ సంఘంగా బావిస్తూ రెండు, మూడు నెలలుగా కష్టపడి మహాసభలను జయప్రదం చేయడం కోసం చేస్తున్న కృషి అభినందనీయం. మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీల్లో సీఐటీయూ గ్రామ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభలకు 33 జిల్లాల నుంచి ప్రతినిధులు 600 మంది హాజరవుతారు. మహాసభల సందర్భంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సీఐటీయూ జెండావిష్కరణలు చేశారు. -సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు



