బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందన్న డీఎంకే
న్యూఢిల్లీ: తమిళనాడులోని మధురైలో ఉన్న తిరుపుండ్రం కొండపై కార్తీక దీపాన్ని వెలిగించకుండా అడ్డుకోవడంపై లోక్‌సభలో దుమారం చెలరేగింది. తిరుపుండ్రం కొండపై వెలిగించే కార్తీక దీపం అంశాన్ని లేవనెత్తుతూ డీఎంకే ఎంపీలు లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేశారు. ఇదే అంశాన్ని మళ్లీ జీరో అవర్‌లో లేవనెత్తారు. సుబ్రమణ్యస్వామి ఆలయ శిఖరంపై ప్రతి ఏడాది తరహాలో కార్తీక దీపాన్ని వెలగించేందుకు వెళ్లిన భక్తులను ఎందుకు అడ్డుకున్నారని బీజేపీ ప్రశ్నించింది.
అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణలను డీఎంకే నేత ఖండించారు. తమిళనాడులో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందని డీఎంకే లోక్‌సభ పక్షనేత టిఆర్ బాలు విమర్శించారు. కొండపై దీపాన్ని ఎవరు వెలిగించాలి, హిందూ దేవాదాయశాఖ బోర్డు సభ్యులా లేక హైకోర్టు జడ్జి తీర్పును పట్టుకుని తిరుగుతున్నవాళ్లా అని టిఆర్ బాలు అడిగారు. ఆ ఆరోపణలను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కొట్టిపారేశారు. ఆరాధించే హక్కును తమిళనాడు సర్కారు నొక్కిపెడుతోందన్నారు. జడ్జి ఐడియాలజీతో తీర్పు ఇచ్చినట్టు ఆయన వ్యాఖ్య చేయడాన్ని కేంద్ర మంత్రి మురుగన్ తప్పుపట్టారు. పూజా హక్కును తమిళనాడు ప్రభుత్వం అణచివేసిందని మంత్రి ఆరోపించారు.
లోక్‌సభలో కార్తీకదీపం రగడ…
- Advertisement -
- Advertisement -



