Saturday, December 6, 2025
E-PAPER
Homeజాతీయంఅలాంటి వ్యాఖ్యలు తగవు

అలాంటి వ్యాఖ్యలు తగవు

- Advertisement -

రోహింగ్యాలపై చీఫ్‌ జస్టిస్‌ వ్యాఖ్యల నేపథ్యంలో న్యాయ నిపుణుల లేఖ
రాజ్యాంగ విలువలకు ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన
న్యూఢిల్లీ :
రోహింగ్యాల గురించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయవాదులు, లీగల్‌ నిపుణులు అందరూ కలిసి చీఫ్‌ జస్టిస్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. రోహింగ్యా శరణార్దులు కొంతమంది భారత్‌లో పోలీసుల కస్టడీలో వుండగా అదృశ్యమవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన హక్కుల కార్యకర్త రీటా మన్‌చందా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

రోహింగ్యాల శరణార్ధుల హోదాను జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రశ్నించారు. దేశంలోకి చట్ట విరుద్ధంగా చొరబడిన వారికి రెడ్‌ కార్పెట్‌ పరవాలా? అంటూ వ్యాఖ్యలు చేశారు. ”హింస, వేధింపులను భరించలేక పారిపోతున్న వారిపై వారి గౌరవానికి విరుద్ధమైన రీతిలో వ్యాఖ్యలు చేయడం మన రాజ్యాంగ ప్రాధమిక విలువలకు ముప్పుగా పరిణమిస్తాయి. పైగా ఆశ్రయం కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించడం పట్ల ప్రజలకు గల నమ్మకం కూడా దెబ్బతింటుంది.” అని ఆ లేఖ పేర్కొంది. అందువల్ల న్యాయస్థానాల్లో, జ్యుడీషియల్‌ తీర్పుల్లో వ్యాఖ్యలు చేసేటపుడు, అలాగే బహిరంగంగా ప్రకటనలు చేసేటపుడు మూలాలతో నిమిత్తం లేకుండా అందరి పట్ల న్యాయం, గౌరవం ప్రాతిపదికన రాజ్యాంగ నైతికతకు కట్టుబడాలని ఆ లేఖలో వారు పునరుద్ఘాటించారు. ‘మీరెన్ని తీర్పులు ఇచ్చారు, లేదా పాలనాపరమైన చర్యలేం తీసుకున్నారనే దానిపై సుప్రీం కోర్టు, మీ కార్యాలయం ఘనత, గౌరవం ఆధారపడదు, మీరెంత మానవీయతతో తీర్పులు ఇచ్చారనేదే పరిగణనలోకి వస్తుంది.’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ను ఉద్దేశిస్తూ ఆ లేఖ పేర్కొంది.

దేశ భద్రతా ప్రయోజనాలను, పౌరుల ఆందోళనలను గమనంలోకి తీసుకుంటూనే వివిధ ప్రాంతాలకు చెందిన శరణార్ధులకు ఆశ్రయం ఇవ్వడం, వారికి మానవతాపరమైన రక్షణ కల్పించిన రికార్డు భారతదేశానికి వుందని ఆ లేఖ గుర్తు చేసింది. టిబెటన్లు, శ్రీలంక జాతీయులకు ప్రత్యేక పత్రాలు జారీ చేసిన ప్రభుత్వం వారిని శరణార్ధులుగా గుర్తించిందని, వారికి మౌలిక సామాజిక, ఆర్థిక హక్కులు కూడా కల్పించిందని గుర్తు చేశారు. వాస్తవానికి పౌరసత్వ సవరణ చట్టం హింస, వేధింపుల భయంతో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ లేదా ఆఫ్ఘనిస్తాన్‌ల నుండి పారిపోయిన మతపరమైన మైనారిటీలు (ముస్లిమేతరులు)కు విదేశీ చట్ట నిబంధనల నుంచి మినహాయింపు కల్పించిందని ఆ లేఖలో వారు పేర్కొన్నారు.
ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఏపీ.షా, జస్టిస్‌ కె.చంద్రు, అంజనా ప్రకాశ్‌, జాతీయ జ్యుడీషియల్‌ అకాడమీ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మోహన్‌ గోపాల్‌, సీనియర్‌ న్యాయవాదులు రాజీవ్‌ ధావన్‌, చందర్‌ ఉదరు సింగ్‌, కొలిన్‌ గొంజాల్వ్స్‌, మిహిర్‌ దేశారు, గోపాల్‌ శంకర్‌ నారాయణన్‌, న్యాయవాదులు కామినీ జైస్వాల్‌, ప్రశాంత్‌ భూషణ్‌, చెరియల్‌ డిసౌజా, అలోక్‌ ప్రసన్న కుమార్‌, ఆర్‌టీఐ కార్యకర్తలు నిఖిల్‌ డే, అంజలి భరద్వాజ్‌ ప్రభృతులున్నారు.

పేదలు, సమాజంలో వెనుకబడినవారు, అణచివేతకు గురయ్యేవారి హక్కుల సంరక్షకదారుగా సుప్రీంకోర్టు వ్యవహరించాలని ఆ లేఖ నొక్కిచెప్పింది. ”మీ మాటలు న్యాయస్థానంలోనే కాదు, దేశ ప్రజల మనస్సాక్షిలోనూ ప్రభావం చూపుతుంది. అంతేకాద హైకోర్టులు, దిగువ న్యాయస్థానాలు, ఇతర ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కూడా ప్రభావం చూపుతాయని పేర్కొంది. రోహింగ్యాలకు భారతదేశంలో నివసించే మరే ఇతర వ్యక్తిలానే 21వ అధికరణ కింద అన్ని రక్షణలకూ అర్హులు. ఈ ప్రాధమిక హక్కు దేశ పౌరుడికే కాదు, ఈ దేశంలో నివసించే ఎవరికైనా అందుబాటులో వుంటుందని ఆ లేఖ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -