Saturday, December 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

- Advertisement -

తెలంగాణను ఆ దిశగా నిలిపేందుకే గ్లోబల్‌ సమ్మిట్‌
ఎఫ్‌పీఓలను ఫుడ్‌ డెలివరీ కంపెనీలతో అనుసంధించే
ప్రక్రియను పరిశీలించాలి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సుమారు 200 బిలియన్‌ డాలర్ల వద్ద ఉందనీ, వచ్చే రెండు దశాబ్దాల్లో 15 రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యానికి గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రధాన వేదికగా నిలువబోతున్నదని తెలిపారు. ఆర్థిక బలోపేతంలో వ్యవసాయ రంగం కేంద్ర బిందువుగా ఉండబోతున్నదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ఆదాయం పెరగడం, ఉత్పాదకత పెరుగుదల, విలువ ఆధారిత వ్యవసాయం విస్తరణ, ఎగుమతుల పెంపు ఇవన్నీ 3 ట్రిలియన్‌ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత కీలక అంశాలని వివరించారు. ఐఓటీ ఆధారిత సూక్ష్మ నీటిపారుదల, నేల ఆరోగ్య నిర్వహణ, అగ్రిటెక్‌ పరిశోధన, టీఏఆర్‌సీసీ, గ్లోబల్‌ సీడ్‌ లీడర్‌షిప్‌, హార్టికల్చర్‌ మెగా క్లస్టర్లు, ఆయిల్‌ పామ్‌ విస్తరణ, ఫార్మ్‌ టూరిజం, ఎఫ్‌పీఓలను ఫుడ్‌ డెలివరీ కంపెనీలతో అనుసంధానం చేయడం, పాలు, మాంసం, మత్స్య రంగాల పెంపు, అధునాతన అగ్రి లాజిస్టిక్స్‌ వంటి కార్యక్రమాలు తెలంగాణ వ్యవసాయాన్ని గ్లోబల్‌ ప్రమాణాలకు తీసుకెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

విజన్‌ 2047 డాక్యుమెంట్‌ తెలంగాణ వ్యవసాయ రంగానికి ఒక దిశను నిర్ధేశిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని పునరుద్ఘాటించారు. రైతు భరోసా, రుణమాఫీ, పంట నష్టపరిహారం, రైతు బీమా వంటి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు భవిష్యత్తు వృద్ధికి బలమైన పునాది వేసిందన్నారు. ఇకపై సాంకేతికత, డేటా, మార్కెట్‌ ఆధారిత వ్యవసాయ మోడల్‌ద్వారా రైతులను మరింత సాధికారులను చేస్తామని ప్రకటించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, డైరెక్టర్‌ గోపి, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య, హార్టికల్చర్‌ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి, మార్క్‌ ఫెడ్‌ ఎమ్‌డీ శ్రీనివాస్‌ రెడ్డి, హెచ్‌ఏసీఏ ఎమ్‌డీ చంద్రశేఖర్‌ రెడ్డి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -