Saturday, December 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్లోబల్‌ సమ్మిట్‌కు రండి

గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి

- Advertisement -

చంద్రబాబును ఆహ్వానించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్లోబల్‌ సమ్మిట్‌ 2025లో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి ఆహ్వానించారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన మంత్రి, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన రైజింగ్‌ తెలంగాణ-విజన్‌ 2047 గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున శాలువాతో సత్కరించి, ఆహ్వాన పత్రిక అందజేశారు. చంద్రబాబుతో సుమారు గంటన్నర పాటు సాగిన భేటీలో ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలు చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో దావోస్‌ సదస్సు మాదిరిగా తెలంగాణలో గ్లోబల్‌ సదస్సు నిర్వహిస్తున్నామనీ, 3 ట్రిలియన్‌ డాలర్స్‌ ఎకానమీ లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను మంత్రి వివరించారు. చంద్రబాబు విజన్‌ 2020 అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.

తెలంగాణ ప్రభుత్వం విజన్‌ 2047 ప్రణాళికతో ముందుకెళ్లడం మంచి పరిణామం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య యాదవ్‌, నిరంజన్‌ రెడ్డి ఉన్నారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025కు రావాలని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఆహ్వానించారు. శుక్రవారం సిమ్లాలో సుఖ్వీందర్‌ సింగ్‌ను కలిసి తెలంగాణ రైజింగ్‌ విశేషాలను మంత్రి వివరించారు. అదే విధంగా . తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025కు రావాలని జమ్ముకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆహ్వానించారు. శుక్రవారం మంత్రి న్యూఢిల్లీలోని కాశ్మీర్‌ హౌజ్‌ లో అబ్దుల్లాను కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -