Saturday, December 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసాయి ఈశ్వర్‌ది కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యే

సాయి ఈశ్వర్‌ది కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యే

- Advertisement -

ఆ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌
బీసీ సమాజం క్షమించదు : మాజీమంత్రి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన మోసానికి సాయి ఈశ్వర్‌ అనే యువకుని నిండు ప్రాణం బలైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) తెలిపారు. ఆయనది ఆత్మహత్య కాదనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన హత్య అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్‌ సర్కారు తూట్లు పొడవడాన్ని తట్టుకోలేకే ఆత్మాహుతి చేసుకున్నాడని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కేవలం 17 శాతానికే కుదించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో బీసీలకు వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన హత్యేనని తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా ఈ మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కులగణన మొదలుకుని న్యాయస్థానాల్లో నిలబడని జీవోల దాకా కాంగ్రెస్‌ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్‌కు సమాధి కట్టిందని విమర్శించారు. బాధితుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో రేవంత్‌రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో సాయి ఈశ్వర్‌ బలైపోవడం తీవ్రంగా కలిచివేసిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదని పేర్కొన్నారు.

సాయిఈశ్వర్‌ భౌతికకాయానికి బీఆర్‌ఎస్‌ నివాళి
బీసీ రిజర్వేషన్లపై ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వర్‌ భౌతికకాయాన్ని సందర్శించి బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ఎల్పీ విప్‌, ఎమ్మెల్యే కెపి వివేకానంద్‌, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, జగద్గిరిగుట్ట కార్పొరేటర్‌ జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

నాడు శ్రీకాంతాచారి… నేడు సాయి ఈశ్వర్‌ బలి
నాడు తెలంగాణ ఇవ్వకుండా శ్రీకాంతాచారి, నేడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా సాయి ఈశ్వర్‌ను కాంగ్రెస్‌ బలి తీసుకుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పోరాడి హక్కులను సాధించుకుందామనీ, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు. సాయిఈశ్వర్‌ మరణం కలచివేసిందని బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ పల్లె రవికుమార్‌, మాజీ సభ్యులు కిశోర్‌గౌడ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ మోసానికి బీసీలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -