Saturday, December 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆస్ట్రేలియాకు చెందిన డీకిన్‌ యూనివర్సిటీతో ఒప్పందం

ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్‌ యూనివర్సిటీతో ఒప్పందం

- Advertisement -

ప్రపంచస్థాయి ప్రతిభావంతుల్ని తయారుచేయడమే లక్ష్యం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్‌సిటీలో కృత్రిమ మేథ (ఏఐ) ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్‌ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. దీనికి సంబంధించి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జూలియన్‌ హిల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ఆయనతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే ఈ తరహా నైపుణ్య శిక్షణ కేంద్రం (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) మొదటిదని తెలిపారు. డీకిన్‌ అప్లయిడ్‌ ఆర్టిఫిషియల్‌ ఇన్‌స్టిట్యూట్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఎక్సెలెన్స్‌ సెంటర్‌ను నిర్వహిస్తాయని వివరించారు.

కాలేజీల నుంచి అకడమిక్‌ గ్రాడ్యుయేట్లను కాకుండా ప్రపంచస్థాయి నైపుణ్యాలతో కూడిన ప్రతిభావంతులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకొని, అమల్లోకి తెస్తామన్నారు. ప్రభుత్వపాలన, ఆరోగ్యం, విద్య, ఐటీ, లైఫ్‌సైన్సెస్‌, వ్యవసాయం, క్రిటికల్‌ మినరల్స్‌, రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌ రంగాల్లో పరిశోధన, నైఫుణ్య శిక్షణ అందజేయడానికి ఈ కేంద్రం కీలకంగా మారుతుందని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో కూడా నైపుణ్య శిక్షణ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వృత్తి నిపుణులకు ఆస్ట్రేలియాలో మరింత ఉన్నత స్థాయి నైపుణ్యాల్లో శిక్షణ అందించేందుకు ఆ దేశం అంగీకరించిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు ఐ సాయిక్రిష్ణ, ఆస్ట్రేలియా ప్రతినిధులు క్యామ్‌ గ్రీన్‌, కరేన్‌ సాండర్‌ కాక్‌, నథానియెల్‌ వెబ్‌, స్టీవెన్‌ బిడిల్‌, హిల్లరీ మెక్‌ గీచి, స్టీవెన్‌ కానోలీ, విక్రంసింగ్‌, ఐటీ శాఖ చీఫ్‌ స్ట్రాటెజిస్ట్‌ శ్రీకాంత్‌ లంకా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -