నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం ఆంజనేయులు, సహాయ కార్యదర్శి ఎం ముత్యాలు మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు. నాడు భారతదేశంలో ఆగ్రకుల పెత్తందారులు దళితులను తీవ్రంగా అణచివేతకు గురి చేసి, అంటరాని వారిగా చూస్తూ వారి పేదరికాన్ని ఆసరా చేసుకుని శ్రమను దోచుకున్నారన్నారు.
వెట్టి పని చేయించుకుంటూ దళితులను అనేక రకాల హింసలకు గురి చేస్తున్న ఆగ్రకుల పెత్తందారుల పోకడలకు వ్యతిరేకంగా దళిత ప్రజలను ఏకం చేస్తూ పెత్తందార్ల ఎత్తుగడలను చిత్తు చేస్తూ అనేక రూపాలలో నిరసనలు పోరాటాలు నడిపిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. దేశంలో కుల మత వర్గ రహిత సమాజం ఏర్పడాలని, అందరికీ భూమి ఉండాలని లేదంటే భూమిని జాతీయకరణ చేయాలని అందరికీ విద్య ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని నాటి ప్రభుత్వం పై ఒత్తిడి చేశారన్నారు. ఆనాడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (మనుస్మృతి) మనుధర్మ శాస్త్రం ను మంట లేసి కాల్చిన మహోన్నత మహా మనిషి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. కాబట్టి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కన్న కలలని నిజం చేయడానికి వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ యువతీ యువకులు ముందుకు తీసుకుపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోరెల్లి బిచ్చన్న, ఎన్ శివుడు, జి గట్టయ్య, రత్నయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



