- సిపిఐ(ఎం), ప్లాట్ల సాధన కమిటీ బలపరిచిన తీగల వెంకటేష్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
గోలనకొండ గ్రామంలో 25 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నఇండ్లస్థలాల సమస్యను పరిష్కరించానని, ఐదు సంవత్సరాలపాటు పట్టు విడవకుండా పోరాటం చేసి సాధించిన చరిత్ర తనకు ఉందని సిపిఐ(ఎం) ప్లాట్ల సాధన కమిటీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తీగల వెంకటేష్ అన్నారు.
ముఖ్యంగా గ్రామాల్లోని మహిళలు,యవతీ యువకులు, గ్రామ అభివృద్ధి కోరే విద్యావంతులు ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు. గత 30 సంవత్సరాలుగా అగ్రవర్ణాల అధిపత్యమే చలామణి జరుగుతుందని, ఎస్సీ, బీసీలు పేరుకు మాత్రమే సర్పంచ్‌లుగా మాత్రమే మిగిలిపోయారన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి జరగాలంటే మార్పు కావాలని, ఆ మార్పు ప్రజలు తలుచుకుంటే అవుతుందని చెప్పారు. డబ్బులకు, మందులకు లొంగకుండా ఓటుని అమ్ముకోకుండా.. ఓటు వేస్తేనే ఆ ఓటుకు విలువ ఉంటుందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి సమానంగా ఉన్నది ఆస్తి కాదు ఇండ్లు కాదు కులము కాదు ఓటు ఒక్కటే అన్నారు.
ఓటు ఎంతో విలువైందని, అధికార బలం, డబ్బు బలం కూడా పోరాటబలం ముందు బలాదూర్ అన్నారు. ఐదు సంవత్సరాలు నిరంతర పోరాటం చేసే సమస్య పరిష్కారం చేయడమే అందుకు నిదర్శనం అన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనకు ఎన్నికల అధికారులు బ్యాట్ గుర్తు కేటాయించిందని ఓటర్లకు తెలియజేశారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. తనని గెలిపించినట్లైతే గోలనుకొండ అభివృద్ధి కోసం ఎంపీ, ఎమ్మెల్యేలతో కొట్లాడి గ్రామ అభివృద్ధికోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.



