Sunday, December 7, 2025
E-PAPER
Homeసోపతిమొదటి తరానికి నీడ, వర్తమానానికి దిశ, భావితరానికి స్ఫూర్తి

మొదటి తరానికి నీడ, వర్తమానానికి దిశ, భావితరానికి స్ఫూర్తి

- Advertisement -

ఎన్నో వేల కోట్ల ఆస్తులు, అగ్రవర్ణాల అండ, మీడియా అట్టహాసం… నేటి రాజకీయాలకు ఇవి కొలమానాలు. కానీ, ఈ కొలమానాలను తుడిచేసి, నీతి, నిబద్ధత, నిరాడంబరత అనే మూడు స్తంభాలపై తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్న అరుదైన నేత నర్రా రాఘవరెడ్డి. ‘పదవులు కాదు, ప్రజల హదయాల్లో స్థానం సంపాదించడం’ నిజమైన నాయకుడి లక్షణం అని నిరూపించిన మార్క్సిస్టు యోధుడు, నేటి రాజకీయాలకు ఒక జీవన పాఠం.
1924లో పుట్టిన రాఘవరెడ్డి జీవితం కష్టాల కొలిమిలో పుటం వేయబడింది. హోటల్‌ వర్కర్‌గా, ముంబై మిల్లు కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడే ఆయనలో పోరాట స్ఫూర్తి, సామాజిక చైతన్యం మొగ్గ తొడిగింది.
కళాకారుడిగా తొలి అడుగు : ప్రజానాట్యమండలి ద్వారా పల్లెల్లో పర్యటించారు. ప్రజల బాధలను, కన్నీటి గాథలను పాటల రూపంలో మార్చి, వాటిని జనంలో చైతన్యంగా మార్చారు. కళను రాజకీయ ఆయుధంగా మార్చిన అరుదైన శైలి ఆయనది.
కమ్యూనిస్టు ఉద్యమంలో కలుపు : 1949లో కమ్యూనిస్టు పార్టీలో చేరి, పదవుల కోసం కాకుండా, విలువల కోసం, సామాజిక మార్పు కోసం పోరాడారు. నిస్వార్థ సేవ ఆయన నాయకత్వానికి పునాది.
ఆయన రాజకీయ ప్రస్థానం కేవలం విజయాల పరంపర కాదు, అది ప్రజల అచంచలమైన నమ్మక యాత్ర.
పదవి కాలం విశేషం : సర్పంచ్‌ 1959 వట్టిమర్తి సర్పంచ్‌గా ఏకగ్రీవ ఎన్నిక. ఎమ్మెల్యే ఆరు పర్యాయాలు నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు. నిరాడంబరత జీవితాంతం 300 రూపాయల ఖర్చుతో మోటార్‌సైకిల్‌పై తొలి ఎన్నికల ప్రచారం.
”నోరే నా పెట్టుబడి, ప్రజల ప్రేమే నా సంపద” ఈ మాటలు ఆయన నిస్వార్థ ప్రజాసేవకు, పారదర్శక రాజకీయాలకు పర్యాయపదాలు. నేటి రాజకీయాల్లో కోట్లాది రూపాయల ఖర్చు, ఆయన 300 ప్రచారానికి ముందు చిన్నబోతాయి. రాజకీయ నైతికతకు నిలువెత్తు నిదర్శనం ఆయన. రాఘవరెడ్డిని ప్రజలు పూజించడానికి కారణం, ఆయన నిస్వార్థ రాజకీయం.
అవినీతి మరక అంటని వ్యక్తి: తన రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వని ఆదర్శ నాయకుడు.
ప్రభుత్వ ఇంటి స్థలం తిరస్కరణ : ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని సైతం తిరస్కరించడం ఆయన రాజకీయ నైతికతకు పరాకాష్ట. ప్రభుత్వ వనరులను ప్రజల కోసం మాత్రమే వాడుకోవాలన్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆయన తూ.చ. తప్పకుండా పాటించారు.
అభివద్ధి దారుడు: తన నియోజకవర్గంలోని 50కి పైగా గ్రామాలకు రహదారులు, తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులు కల్పించి, స్థానిక అభివద్ధికి నిజమైన దారి చూపారు.
ఆయనకు అజాతశత్రువు అనే బిరుదు దక్కడం వెనుక ఉన్న రహస్యం ఇదే. ఆయన పోరాటం వ్యవస్థలపైన, అన్యాయాలపైన తప్ప, వ్యక్తులపై ఎప్పుడూ కాదు.
ప్రజాస్వామ్యానికి పాఠం : ధనబలం, మందబలం పెరిగిపోయిన ఈ రోజుల్లో, నర్రా రాఘవరెడ్డి రాజకీయ జీవితం ప్రజాస్వామ్యానికి ఒక శక్తివంతమైన సందేశం.
జనబలమే అసలు బలం : డబ్బు, కులం, ప్రలోభాలు కాదు, ప్రజల భాగస్వామ్యం, ప్రజా విశ్వాసమే అసలైన రాజకీయ బలం అని ఆయన నిరూపించారు.
స్థానిక పాలన ఆదర్శం: సర్పంచ్‌, సమితి ప్రెసిడెంట్‌ వంటి స్థానిక సంస్థల ద్వారా ఆయన చేసిన సేవ, ప్రజా పాలన ప్రజలకు ఎంత చేరువగా ఉండాలో తెలియజేస్తుంది. పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి స్థానిక పాలన విజయానికి మూలమని చాటారు.
నర్రా రాఘవరెడ్డి గారి మరణం (2015 ఏప్రిల్‌ 9) ఆయన జీవితానికి ముగింపు కాదు. ఆయన చూపిన నిస్వార్థ రాజకీయ మార్గం, తరతరాలకు అందించిన ఒక గొప్ప రాజకీయ వారసత్వం. నేటి యువత, నాయకత్వం ఈ బోధివక్షం నీడలో విలువలతో కూడిన రాజకీయ చైతన్యాన్ని పొందాలి.
ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేయడం కాదు. నర్రా రాఘవరెడ్డి వంటి నాయకులను ఆదర్శంగా తీసుకుని, తమకు సేవ చేసేందుకు, తమ తరఫున పోరాడేందుకు, విలువలను కాపాడేందుకు నిలబడే నేతలను మాత్రమే ఎన్నుకోవాలి. నిస్వార్థ సేవ, నిబద్ధత గల నాయకత్వం ఉన్నప్పుడే నిజమైన అభివద్ధి సాధ్యమవుతుంది.
(పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన్ని స్మరించుకుందాం)

  • గడగోజు రవీంద్ర చారి, 9848772232
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -