Sunday, December 7, 2025
E-PAPER
Homeహెల్త్యువత భవిష్యత్తును మింగేస్తున్న మొబైల్‌

యువత భవిష్యత్తును మింగేస్తున్న మొబైల్‌

- Advertisement -

యువతలో మొబైల్‌ వినియోగం విపరీతంగా పెరగడంతో అది ఇప్పుడు అలవాటు కాదు వ్యసనంగా మారుతోంది. మొబైల్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య, మత్తు పదార్థాలకు బలైన వారి సంఖ్య కంటే దాదాపు రెట్టింపు స్థాయికి చేరుకుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యువత ఎదుగుదల, విద్య, కెరీర్‌, మానసిక ఆరోగ్యంలో తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది.
పి.ఎమ్‌ నుంచి పెద్ద, చిన్న అందరికీ ఉండేది 24 గంటలే. విజయం, సమయాన్ని ఎలా ఉపయోగించామన్నదానిపై ఆధారపడి ఉంటుంది. కొందరు ఉదయం లేచి వ్యాయామం, పనులు, ప్రణాళికతో చురుకుగా రోజు మొదలు పెడతారు.

మరికొందరు? కళ్ళు తెరవగానే మొదటి చూపు ఫోన్‌పైనే. WhatsApp – Insta – Facebook – X – YouTube -Reels… ఇలా ఒక రౌండ్‌ వేసేసరికి గంట పూర్తయిపోతుంది. చేతిలో ఉన్న ఫోన్‌ బ్లాక్‌ హోల్‌లా కాలాన్ని మింగేసేస్తోంది.
అందరూ వాడుతున్నారు

”అందరూ వాడుతున్నారు కాబట్టి నేనూ చూడటం తప్పేంటి?” అనేది యువతలో సాధారణ ప్రశ్న. కానీ వాస్తవం ఏమిటంటే, కంటెంట్‌ పెట్టేవారు పని చేసి పోతారు. కానీ ఆ కంటెంట్‌ను చూస్తూ సమయాన్ని కోల్పోతున్నది వినియోగదారుడే.
ప్రపంచవ్యాప్తంగా ఒక్కో వ్యక్తి రోజుకు సగటున 2.5 గంటలు సోషల్‌ మీడియాలో గడుపుతున్నారు. నేర్చుకోవలసిన నైపుణ్యాలు, విద్య, కెరీర్‌ పురోగతి… అన్ని వథా అవుతున్నాయి.
లేవగానే ఫోన్‌ ప్రమాదం
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, లేవగానే ఫోన్‌ చూడడం మెదడుపై దారుణ ఒత్తడిని కలిగిస్తుంది. ఫోన్‌లో వచ్చే రకరకాల సమాచార వర్షం కారణంగా, ఆందోళన పెరుగుతుంది. దష్టి చెదురుతుంది, మూడ్‌ అస్థిరంగా మారుతుంది, రోజంతా చదువు, పనితీరు పడిపోతుంది.
లేవగానే కనీసం 30 నిమిషాలపాటు ఫోన్‌కు దూరంగా ఉండాలి. ఇది ఏకాగ్రతను మెరుగుపరచి, ఉత్సాహాన్ని పెంచుతుంది.
సైబర్‌ నేరాలకు యువతే బలి
స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగేకొద్దీ సైబర్‌ నేరాలు కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతులు, యువకులు సోషల్‌ మీడియాలో పెట్టిన ఫొటోలను అత్యంత దుర్వినియోగం చేస్తున్నారు.
చాటింగ్‌తో మొదలై బెదిరింపుల దాకా
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతితో మాట్లాడిన ఒక బాలిక ఫొటోలు మార్చుకుని కొంతకాలంలోనే నమ్మకం పెంచుకుంది.
తరువాత ఆ ఫొటోలను మార్ఫింగ్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు.
పోలీసుల విచారణలో ఇది గ్యాంగ్‌ పని అని తేలింది.
ఫేమ్‌ కోసం రీల్స్‌ కానీ…
యువతి రీల్స్‌ చేస్తూ వేలాది ఫాలోవర్లు సంపాదించింది. గతంలో పోస్టు చేసిన ఫొటోలను ఒక నిందితుడు సేకరించి అసభ్యంగా మార్చి వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతడు అరెస్టు అయ్యాడు.
ఈ కేసుల్లో ఎక్కువ మంది బాధితులు 13-18 ఏళ్ల మధ్య ఉన్నారనే విషయం ఆందోళనకరం.
తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు
ప్రొఫైల్‌ లాక్‌ తప్పనిసరి. అపరిచితులు మీ ఫొటోలు, వివరాలు చూడకుండా నిరోధిస్తుంది.
అపరిచితుల ఫ్రెండ్‌ రిక్వెస్టులకు నో చెప్పండి. తెలిసిన పేరుతో రిక్వెస్ట్‌ వచ్చినా నిజమైనదేనా అని చెక్‌ చేయాలి.
వ్యక్తిగత ఫొటోలు ఎవరికీ పంపొద్దు.
ఒక్కసారి బయటకు వెళ్లిన ఫొటో శాశ్వతంగా మీ నియంత్రణలో ఉండదు.
మార్ఫింగ్‌ లేదా బెదిరింపులు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. భయపడి మౌనం వహించవద్దు.
ఆన్‌లైన్‌ ఫేమ్‌ కోసం భద్రతను తాకట్టు పెట్టొద్దు. లైకులు, ఫాలోవర్లు క్షణాల్లో మారిపోతారు. కానీ నష్టం జీవితాంతం ఉంటుంది.
ఫోన్‌ మన జీవితాన్ని సులభతరం చేసే సాధనం. కానీ అది మనపై ఆధిపత్యం చెలాయించనివ్వడం మన భవిష్యత్తుకు అతిపెద్ద ప్రమాదం.
ఫోన్‌ను వాడండి. కానీ ఫోన్‌ మిమ్మల్ని వాడుకోనీయొద్దు.
యువతకు ఉన్న శక్తి, ప్రతిభ, కలలు… స్క్రీన్‌ వెలుగులో కాకుండా విజయ మార్గంలో ప్రకాశించాలి.
తలదించు చూడు తల ఎత్తకుండా చేస్తాను అంటుంది ఫోన్‌. తలదించు చూడు తల ఎత్తుకునేలా చేస్తాను అంటుంది పుస్తకం..
ఏది చూడాలో.. మీ చేతుల్లోనే..

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -