Sunday, December 7, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపేరూ తీరూ!

పేరూ తీరూ!

- Advertisement -

పేర్లు పెట్టడానికి పెద్ద కథే ఉంటది. పేర్ల వెనకాల పరిణామాలకూ ఒక చరిత్ర ఉంటుంది. ప్రపంచంలోని ప్రతి అంశానికి, వస్తువు, నిర్మాణానికి, ప్రదేశానికి, ఆఖరుకు మనిషికీ పెట్టుకునే పేర్ల వెనకాల చాలా చాలా విషయాలూ, చరిత్ర దాగి ఉంటుంది. పురాణాల్లో, నాటకాల్లో పాత్రల పేర్లు, ఆ పాత్రల స్వభావాన్ని బట్టి రచయితలు పెడుతుంటారు. మనందరికీ తెలుసు. ఆ పేర్లు పలికితే చాలు స్వభావం అర్థమవుతుంటది. దుశ్శాసనుడనగానే, కీచకుడు, శకుని, శూర్పనఖ ఈ పేర్లలోనే లక్షణాలు వ్యక్తమవుతాయి. ఇవన్ని కూడా కథననుసరించి మనం పెట్టిన పేర్లు. ఈ పేర్లను మనమెవరం పెట్టుకోము. రాముడు, కృష్ణుడు, భీముడనే పెట్టుకుంటాము. లక్ష్మీ, పార్వతి అని పిలుస్తాం కానీ మంధర, శూర్పనఖ అని నామకరణం చేస్తామా? ఇవికాక ప్రదేశాల పేర్లు చారిత్రకంగా వాటి వాటి ప్రాధాన్యతలను బట్టి, ప్రాశస్త్యాలను బట్టి పిలుస్తుంటాము. ఆ పేర్లను తలవగానే చరిత్ర స్వరూప స్వభావాలు జ్ఞప్తిలోకి వస్తాయి. ఇంకా కొన్నిటికి ఆయా ప్రాంతాల్లో అందరికోసం కృషి చేసిన నాయకుల, బోధకుల ప్రసిద్ధుల పేర్లనూ పెట్టుకుంటాం. ఏవైనా సంకేతించడం వీటి పని.

అయితే సత్యారావు అనే పేరున్నవాడు, సత్యాలనే పలుకుతాడని ఏమీ లేదు. నిత్య అసత్యవాదిలానూ ఉండొచ్చు. ఎప్పుడూ ఏడుస్తూ ఉండే అమ్మాయికి సుహాసిని అనే పేరుందనుకోండి. ఏంచేస్తాం, దాన్నే నామ విరోధాభాసం అంటారు. పెండ్లికాని కుటుంబరావులు, ఎప్పుడూ మండిపడే శాంతారావులు చాలామందే మనకు కనపడతారు. మరోవైపు సార్థకనామధేయులూ ఉంటారు. ఈ పేర్లకూ సారానికి పెద్ద సంబంధేమేమీ ఉండదు. తాజ్‌మహల్‌ పేరు తలవగానే షాజహాన్‌ ముంతాజ్‌ల ప్రేమను గుర్తుకు రాక మానదు.ఇలా పేర్ల వెనకాల కథలను గూర్చి ఎన్నయినా చెప్పుకోవచ్చు.
పేర్ల వెనకాల భావాలు, చరిత్ర, సంస్కృతీ దాగి ఉంటాయి. మీరు ఇంటిపేర్లను గమనిస్తే అర్థమవుతుంది. కుల వ్యవస్థ, ఉచ్ఛనీచాలను బట్టి పేర్లనూ ఏర్పాటు చేశారు. కొన్ని పేర్లను బట్టి సమాజంలోని అసమానతలు, ప్రవర్తనలు, అనుసరించిన విధానాలు అవగాహన కొస్తాయి. మన భావాలకు, ఉద్దేశాలకు సంకేతంగా కూడా ఈ పేర్లు పెడుతూ ఉంటాము. కొందరు పేర్లతోనూ మోసాలకు పాల్పడుతూ ఉంటారు.

ఆరోగ్య ప్రదాయిని అని పేరు పెట్టి కల్తీ వస్తువులు అమ్మే బేపారులూ కోకొల్లలు. కేవలం పేరును చూసి ఆశ పడకూడదు. ఇపుడు మనదేశంలో వీధులు, పట్టణాలు, నగరాల పేర్లు మార్చే పనిలో బీజేపీ ప్రభుత్వాలు నిమగమయ్యాయి. రైల్వేస్టేషన్ల పేర్లు కూడా మార్చే పనిలో ఉన్నారు. వీధులు, వీధుల్లో గుంతలు, కూలిపోతున్న వంతెనలు, పగిలిపోతున్న రోడ్లు, అస్తవ్యస్తంగా ఉన్న వీధులు, శిథిలాలు పోగుపడుతున్న చెత్త, ముంచుకొస్తున్న పర్యావరణ కాలుష్యాలూ ఎన్ని వస్తున్నా, వాటిని పరిష్కరించే ఆలోచన వ్యూహం ఏదీ లేకున్నా కొత్తగా పేర్లను మాత్రం మారుస్తున్నారు.
‘పేరుగొప్ప ఊరుదిబ్బ’ అని మనకో సామెత ఉంది. పేర్లు మార్చుకోటమే పెద్ద ఘనకార్యంగా తలుస్తున్నారు. ఇటీవల కేంద్ర పాలకులు ప్రధానమంత్రి కార్యాలయాన్ని, దాని సముదాయాన్ని ‘సేవాతీర్థ్‌’గా మార్చేశారు.ఇంతకుముందు పి.ఎం.ఓగా పిలిచేవారు. అలాగే గవర్నర్‌ నివాసాన్ని రాజ్‌భవన్‌గా పిలిచేవారు. ఇప్పుడు ‘లోక్‌భవన్‌’గా మార్చారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌ నుండి ఇండియా గేట్‌ వరకు రాజ్‌ పథ్‌గా పిలిచేది. ఇప్పుడు కర్తవ్యపథ్‌గా మార్చారు.

ప్రధాని అధికార నివాసం పేరును లోక్‌కళ్యాణ్‌గా మార్చారు. బానే ఉంది. వలసపాలనను గుర్తుచేసే పేర్లను మార్చి భారతీకరించిన పేర్లను పెడుతున్నాం అంటున్నారు. ‘రాజ్‌’అంటే రాజరికానికి గుర్తు కావున తీసేశారు. సరే ‘తీర్థ్‌’ అంటే పుణ్యస్థలం, నది, పవిత్రమైనది అనే అర్థాలున్నాయి. ఇది మరింత పురాతనం, సనాతనంలోకి పోవటం కాదా! పోనీ గవర్నర్‌ నియామకం, విధి విధానాలు, రాష్ట్రపతి విధులలో మార్పులు ఏమైనా చేశారా? ‘కొత్త సీసాలో పాత సారా’లాగే మరింత వెనక్కిపోవటమే కదా! అసలు గవర్నరు వ్యవస్థే అనవసరమైనది. ప్రజలు ఎన్నుకునేది కాదు. ప్రజలతో సంబంధమున్న వ్యవస్థాకాదు. పాలకుడి భవనం కానే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా, తమకు నచ్చినవారిని, మాటవినేవారిని నియమిస్తారు.

అలా వింటూ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు అడ్డుపడటం, బిల్లులు ఆపడం, ఘర్షణ పడటం చేస్తున్న తీరును గమనిస్తున్నాము.గవర్నరేమీ ప్రజలకు జవాబుదారీ కాదు. ప్రజలకు ఏ సంబంధంమూ లేని మనిషి గవర్నరు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌, ఇతర ప్రతిపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో ప్రభుత్వాల పరిపాలనలో తలదూర్చుతూ అనేక ఇబ్బందులను కలుగజేయడం నిత్యం చూస్తూనే ఉన్నాం. పేరు మార్చడంతో ఒరిగేదేమున్నది! తీరు మారలికదా! అధికారం, అహంకారం, అణచివేత ఏదీ మారదు. తీయనైన మాటలు, అందమైన పేర్లు, అద్భుతమైన నినాదాలు, ఉద్వేగపరిచే ఉపన్యాసాలతో ఏదీ మారదు. ప్రజలను మభ్యపెట్టే, మైమరపింపజేసే మాయా విన్యాసం తప్ప మరేమీ కాదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -