పియ్రమైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావు? ఇక్కడ నేను, నాన్న బాగున్నాము. ఎల్లుండి నానమ్మను చూడటానికి ఊరికి వెళ్తున్నాము. ఆ మధ్య వంట చేసుకోవడానికి ఓపిక లేక, బైట నుండి తెప్పించుకుంటున్నావు. ఎక్కువ బైటి ఆహారం తినకు. మంచిది కాదు. సరే.. నీకు గత కొద్ది వారాలుగా సైబర్ క్రైమ్ గురించి చెప్తున్నాను కదా.. ఇప్పుడు చెప్పేది కూడా అలాంటిదే. మొన్న పేపర్లో, టీవీలో చూసాను. ఇలాంటి సంఘటన ముప్పై ఏండ్ల కిందట విన్నాను. అప్పుడంటే అంతగా టెక్నాలజీ పెరగలేదు కనుక పెద్దగా అవగాహన లేదు. ఏంటంటే ఒక సంస్థలో నువ్వు సభ్యత్వం తీసుకుని, మరో ముగ్గురిని చేర్చాలి. ఆ ముగురిని చేర్చినందుకు నీకు డబ్బులిస్తారు. ఆ ముగ్గురు తొమ్మిది మందిని చేర్చాలి.
వాళ్ళు చేర్పించినందుకు వాళ్లకు, ముందుగా సభ్యత్వం తీసుకున్న వాళ్లకు డబ్బులు వస్తాయన్నమాట. దీన్ని మల్టీ లెవల్ మార్కెటింగ్ అంటారు. దీనికి నేను బాధితురాలినయ్యాను. మనకు బాగా తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ తాను సభ్యత్వం తీసుకుని, ముగ్గుర్ని చేర్చారు. అందులో నేను ఒక దాన్ని. అయితే నన్ను అడగలేదు, నాకు అసలు తెలీదు. తర్వాత ఫోన్ చేసి చెప్పారు. ఇక నేను తప్పనిసరిగా ముగ్గురిని చేర్చాలి. ఏంచేయాలో అర్థం కాలేదు. సరే తెలిసిన వాళ్లకు చెప్పి ఒక ముగ్గురిని చేర్చాను. ఆ తర్వాత నాకు జ్ఞానోదయం అయింది. దీనివల్ల జరగబోయే మోసం ఏమిటో. ఆ తర్వాత దానికి దూరంగా ఉన్నాను. అలాగే స్కీంలలో చేర్చమని అడుగుతారు. అదీ మోసమే.
ఇప్పుడు అది యాప్‌ల రూపంలో కూడా వచ్చింది. యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, ముగ్గురిని చేర్చడం, వాళ్లకు ఏవో కొన్ని డబ్బులు రావడం. ఇంతవరకు బాగానే ఉంటుంది. నమ్మకం కుదిరే వరకు డబ్బులు పంపిస్తారు. ఆ తర్వాత లక్షలు పంపిస్తున్నాం అంటారు. కానీ అవి డ్రా చేసుకోవడం కుదరదు. లేదా ఏదో లింక్ పంపడం నొక్కమని చెప్పడం, బ్యాంక్‌లో ఖాతా ఖాళీ అవడం. ఈ యాప్‌లు కూడా అసలు డౌన్లోడ్ చేసుకోవద్దు. డబ్బు ఎప్పుడు ఊరికే రాదు, ఎవ్వరూ ఇవ్వరు కూడా. ఇప్పుడు కొత్తగా వింటున్న డిజిటల్ అరెస్ట్ గురించి వచ్చే వారం లేఖలో చెప్తా. ఎప్పుడు కూడా ఇటువంటి వారి మాయమాటలు నమ్మకు, వాటిల్లో చేరకు. నాకు ఉన్నది చాలు అనుకో. అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. వుంటాను…
ప్రేమతో మీ అమ్మ
పాలపర్తి సంధ్యారాణి



