Sunday, December 7, 2025
E-PAPER
Homeసోపతిఖమ్మం సే నేపాల్‌ తక్‌ సైకిల్‌ యాత్ర

ఖమ్మం సే నేపాల్‌ తక్‌ సైకిల్‌ యాత్ర

- Advertisement -

తొక్కుకుంటూ పోతా..అంటే ఇదేదో బీభత్స ఫ్యాక్షనిస్టు డైలాగు అనుకున్నా.. కానీ ఈపిల్లోడి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో వేరే.. సైకిల్‌ తొక్కుకుంటూ పోతా అంటున్నాడీ స్టైలిస్ట్‌ సైక్లిస్ట్‌.. పేరు ఫాజిల్‌ హిందుస్థానీ.. ఊరు ఖమ్మం.. తెలంగాణ గడ్ద నుంచి దేశం పొడవు వెడల్పులు కొలిచే సంకల్పం..

సైకిల్‌ వాడకం ప్రశ్నార్థకం అవుతున్న ఈరోజుల్లో అన్నింటికీ సమాధానం ఇవ్వబోతున్నాడు. కిలోమీటరో రెండు కిలోమీటర్లో కాదు, మైలురాళ్ళను వెనక్కు నెడుతూ ఖమ్మం సే నేపాల్‌ తక్‌.. పదాలా పద్దెనిమిది వేల కిలోమీటర్లు..అయ్యారే!
యువత దేశానికి బలం.. ఉక్కునరాల శక్తి సంపన్నులు యువత.. తన శక్తిని దేశ సమగ్రతా ఉధ్బోదానికి ధారబోసే కంకణం కట్టుకున్నాడు.. నూనూగు మీసాలోడు పాలబుగ్గల పసిచాయలు వీడనివాడు. లోకమంటే ఏమిటో ఇంకా తెలీదు దేశమంటే ఏమిటో చాటిచెపుతా అంటున్నాడు.
నిజానికి దేశాటన కొత్తదేం కాదు రాచరిక వ్యవస్థ అంతటి పాతదేకదా.. ఈ నూత్న యవ్వన యువరాజు తల్లిదండ్రుల ప్రేమ సామ్రాజ్య పరదాలు దాటుకొని.. ఇతడు అభినవ సిద్ధార్దుడు.. సేఫ్‌ జోన్‌ భద్ర జీవితాన్ని త్యజించి కటికనేలను ఆశ్రయించబోతున్నాడు. తన సరంజామా తనే సర్దుకొంటూ.. మంట తానే తయారుచేసుకుంటూ, తన వంట తానే రూపొందించుకుంటూ విలువ తగ్గుతున్న రూపాయకు ఎన్ని పైసలో, ఒక్క రూపారు వెనుక ఎంత విలువైన కష్టమో స్వయానా అనుభవించబోతున్నాడు. రోజుకు ఎనభరు నుంచి వంద కిలోమీటర్ల లక్ష్యాన్ని జయిస్తూ ముందుకు సాగే ప్రణాళిక ఇతనిది.
అడవులు, కొండలు, వాగులు, సెలయేర్లు, ఎడారులు, మట్టిబాటలు, తారురోడ్లు, ముళ్ళు, పూలు అనే జీవిత నిర్వచనాలు తన గమ్యం పొడవునా ఇతనికి స్వాగతించబోతున్నాయి..
దారివెంట, పెట్రోల్‌ బంకుల్లోనో మరే ఇతర షెల్టర్లలోనో కొత్తగా ఉదయించబోతున్నాడు. రోజుకో విధంగా తన అనుభవాలను గమ్యాలను లక్ష్యాలను క్రోడీకరించబోతున్నాడు. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడు. చదువుకుతగ్గ కొలువులో నెలవుండకుండా ఇలా అధ్యయన బాటపట్టాడు. పుస్తకాలు, తరగతులు దాటి తీరని జ్ఞానదాహం ఇతనిది. నిన్నటి దాకా ఇతని చిరునామా ఖమ్మం. డిసెంబర్‌ 1 2025 నుంచి కేరాఫ్‌ ఇండియా. ప్రతి ఊరు జిల్లా రాష్ట్రం వెరసి ఈదేశం నాది అని అస్థిత్వ ప్రకటనగా ధ్వనించబోతున్నాడు.
ఉద్యోగమో, వ్యాపారమో అందరూ చేస్తారు. కొందరు మాత్రమే కలలను నిజం చేసుకునేందుకు కార్యోన్ముఖులవుతారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ అవకాశాన్నొదిలి ఇలా హార్డ్‌ కోర్‌ బాట ఎంచుకున్నాడు.
తన లక్ష్యం గమ్యాన్ని అధిగమించటం కాదు సమగ్రతను చాటిచెప్పటం. భిన్న అస్థిత్వాల దేశం ఓ రంగు సింగిడి.. సంస్కతులు, ఆచారాలు, వేషభాషలు, ఆహారపుటలవాట్లు, విశిష్టతలు, సంక్లిష్టతలు… ఇవన్నీ తనకళ్లతో చూడటమే కాదు ‘ఇండియా వాలా వ్లాగర్‌’ అనే యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా మనకూ చూపించబోతున్నాడు. చానెల ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోటం ద్వారా మనమూ ఆ సైకిల్‌ వెంట మద్దతుగా పరుగెత్తవచ్చు. ఇతను ఫలావాళ్ల కొడుకు అనేది నిన్నటిమాట ఇప్పుడు ఫలానా వాళ్లు ఇతని తల్లిదండ్రులు. ప్రవరను కాలదన్ని సొంత చరిత్ర సష్టించుకోవటం అభినందనీయం.

  • కంచర్ల శ్రీనివాస్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -