అక్షరం అంటేనే క్షరం కానిది. శాశ్వతమైనదని అర్థం. మారుతున్న కాలంలో విలువైన అక్షర సంపద అలభ్యమైనప్పుడు అది అర్థ సత్యమే అనిపిస్తుంది. అలాంటి ప్రమాదం నుండి తెలుగు సారస్వతానికి నిజమైన శాశ్వతత్వాన్ని సమకూర్చడానికి నడుము కట్టిన సంస్థ మనసు ఫౌండేషన్. ఇది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం, కనియం పాడు గ్రామంలో ఉంది. దీని వ్యవస్థాపకులు మన్నం వెంకటరాయుడు, డాక్టర్ మన్నం గోపీచంద్, మన్నం చంద్రమౌళి. వీరు అన్నదమ్ములు. వీరి ప్రధాన లక్ష్యం తెలుగు సాహిత్య సంపదను పరిరక్షించి భావితరాలకు అందజేయడం.
ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు పురాణాలు మొదలుకొని నవలలు, కథలు, కవిత్వం, విమర్శ, సినిమా వ్యాసాలు, వార్తాపత్రికలు, సాహిత్య పత్రికలు, సంచికలు ఇట్లా సమస్త సరస్వత రచనలను సేకరించి డిజిటలైజేషన్ చేసి భావితరాలకు అందించడం ప్రధాన లక్ష్యం. ఈ వ్యవస్థాపకులు తమ తల్లిదండ్రులైన మన్నెం నరసింహం సుబ్బమ్మల పేర్లలో మొదటి అక్షరాలను తీసుకొని మనసు ఫౌండేషన్ సంస్థను స్థాపించారు. ఇది నెల్లూరు జిల్లాకు 200 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో, గ్రామీణ పరిమళంతో విరాజుల్లుతున్నది. ఇది 2006లో స్థాపించబడిన సంస్థ. ముప్పవరపు వెంకయ్య నాయుడు చే ప్రారంభించబడి నిరంతరం సారస్వతాన్ని శాశ్విత ప్రాతిపదికన భద్రపరుస్తున్నది.
డాక్టర్ ఎస్.రఘు నాయకత్వంలో నేను సుప్రసిద్ధ చిత్రకారుడు కూరెళ్ళ శ్రీనివాస్, నానీల కవి రవికాంత్ మరో మిత్రుడు శ్రీనివాస్ తో కలిసి ప్రత్యేకంగా మనసు ఫౌండేషన్ దర్శించాలని ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరాం. సుదీర్ఘ ప్రయాణం చేసినా అక్కడికి వెళ్లిన తర్వాత అందరి అలసట మటుమాయమైపోయింది.
అక్కడి సువిశాల వ్యవసాయ క్షేత్రంలో ఈ ఫౌండేషన్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. దీనికి కామినేని రమేష్ బాబు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు . మేము వెళ్ళిన రోజు ఈ సంస్థ కార్యకలాపాలు సమీక్షించే మన్నెం కుటుంబ బంధువు గడ్డిపాటి శ్యాంసుందర్ కూడా అక్కడే ఉన్నారు. వారంతా ఎంతో సాదరంగా ఆహ్వానించి వారు నిర్వహించే కార్యకలాపాలన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించారు.
నిజానికి ఆ సంస్థ చేస్తున్న పని ఒక ప్రభుత్వ చేయవలసినది, చేతగినది. అంతకుమించి తెలుగు భాష మీద ఎంతో మక్కువ ప్రేమ, అంకితభావం ఉంటే తప్ప ఈ ఆలోచన రాదు. వచ్చినా ప్రారంభించరు.
ప్రభుత్వాలు చేపట్టినా మనం విశ్వసించలేము. మరో ఆనందం ఏమిటంటే అక్కడ పని చేసే 40 మంది ఉద్యోగులు ఎక్కువ శాతం 20 ఏళ్లలోపు అమ్మాయిలే. పైగా అక్కడ పని చేసే వారు ఆ ఊరు ఆడపిల్లలే. ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 5:30 గంటల వరకు నిరంతరాయంగా, నిశ్శబ్దంగా పనిచేస్తారు. అది ఉపాధే కాదు వారికి అక్కడ ఉత్తమ సంస్కారం కూడా నేర్పుతున్నారు . కలిసి వండుకోవడం, భోజనం చేయడం అతిథులను ఎంతో ప్రేమగా ఆదరించడం, తాము చేస్తున్న పనిని గర్వంగా వివరించడం వీరి నిత్య కత్యం. అక్కడ సరస్వతి దేవి అనేకానేక చేతులతో భావితరాలకు తెలుగు సాహిత్య సంపదను అందిస్తున్న అనుభూతి మాకు కలిగింది. ఆ అమ్మాయి ల చేతుల మీదుగా ఇప్పటివరకు మూడు కోట్ల పేజీలు డిజిటలైజేషన్ అయి సిద్ధంగా ఉన్నాయి. నా రచనలు,నా మిత్రుల రచనలు మా పేర్లు క్లిక్ చేయగానే కళ్ళ ముందు పిడిఎఫ్ రూపంలో ప్రత్యక్షమై ఆశ్చర్యానందాల గురి చేసినవి. మనం ఎన్ని పుస్తకాలు ఇచ్చినా పంపినా వాటిని పేజీల వారిగా విడదీసి స్కాన్ చేసి తిరిగి బైండింగ్ చేసి మనకు ఇస్తారు. వద్దంటే అక్కడే వారి గ్రంథాలయంలో భద్రపరుస్తారు. ఒక లారీ లోడ్ పుస్తకాలు ఉంటే వారే వాహనాన్ని సమకూర్చి పుస్తకాలు తీసుకెళ్లి, అంతే భద్రంగా తిరిగి పంపిస్తారు.దేనికి ఒక రూపాయి తీసుకోరు. చిత్రాలు, సినిమా పత్రికలు, పాటలు ఇట్లా సమస్త రచనలు మనసు ఫౌండేషన్ లో శాశ్వతత్వాన్ని పొందుతున్నాయి. ఏమి ఆశించకుండా భాష పట్ల మక్కువ, అనురాగం ఉండటం ఆశ్చర్యపరిచింది. మాబోటి భాషాభిమానులకు ఆ సోదరులు కారణజన్ములనిపించారు.
సందర్భం వచ్చినప్పుడల్లా మన భాషను మనం రక్షించుకోవాలి. భాష అంతరించిపోతుందని తెగ దిగులు పడిపోతాం. కానీ ఏది మొదలుపెట్టం. ఆ పనిని మనసు ఫౌండేషన్ చేసి చూపిస్తున్నది. తెలుగు భాషాభిమానులు, రచయితలు జీవిత కాలంలో దర్శించదగిన పుణ్యక్షేత్రం ఇది. వీరు కుటుంబం బాంధవ్యాలు, ప్రేమలు, స్నేహాలు వర్ధిల్లే విధంగా ప్రతి సంక్రాంతికి ఐదు రోజులు 250 పైగా కుటుంబాలతో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశ, విదేశాల నుంచి భాషాభిమానులు అక్కడికి చేరుకుంటారు. అందరికీ అన్ని సౌకర్యాలు ఉచితంగా ఏర్పాటు చేస్తారు. మాకైతే అంతులేని ఆనందం కలిగింది. మేము సందర్శించినప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలోని పుస్తకాలు అన్నిటిని డిజిటలైజేషన్ చేస్తున్నారు. అక్కడి వాతావరణం లో కొన్ని గంటలు గడిపితేనే జీవనో దీప్తి కలిగింది. అందులో మమేకమై పనిచేస్తున్న వ్యక్తుల ఆనందం వెలకట్టలేనిది. అక్కడి కార్యక్రమాలు కూడా చాలా శాస్త్రీయంగా, జాగ్రత్తగా, పరిశుభ్రంగా జరపడం గమనించదగ్గ విశేషం.ఆ వ్యవస్థాకులను బ్రౌన్‌తో సమానంగా స్మరించుకుంటే తెలుగు రచయితలు కొంత రుణం తీర్చుకున్నట్లు అనిపిస్తుంది.
కోట్ల వేంకటేశ్వర రెడ్డి, 9440233261



